అమరావతి, ఫిబ్రవరి 2 (న్యూస్‌టైమ్): స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌పై విచారణ జరిపే అధికారం ప్రివిలేజ్ కమిటీకి ఉందని కమిటీ చైర్మన్ కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ చేసిన ఫిర్యాదును విచారణకు స్వీకరించామన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తమ హక్కులకు భంగం కలిగించారని మంత్రులు స్పీకర్‌కు లేఖ రాశారు. ఈ మేరకు స్పీకర్ తమ్మినేని సీతారాం ఆ ఫిర్యాదును ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేశారు.
ఈ సందర్భంగా మంత్రుల లేఖపై విచారణ జరిపేందుకు ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్థన్‌రెడ్డి అధ్యక్షతన కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. సమావేశం అనంతరం కాకాణి మీడియాతో మాట్లాడుతూ రూల్ 173 కింద ఫిర్యాదుపై ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో చర్చించామని చెప్పారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి అసెంబ్లీకి నివేదిస్తామన్నారు. గతంలో మహారాష్ట్రలో ఇలాంటి విచారణ జరిగిందని గుర్తుచేశారు.