ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీకి బ్రేక్
కరోనాకు ఆయుర్వేద ఔషధం తయారుచేసిన కృష్ణపట్నం ఆనందయ్యకు పూర్తిస్థాయి పోలీసు భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. ఆయన తయారుచేసిన ఆయుర్వేద మందులు సహా ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. కరోనా మందు కోసం కృష్ణపట్నానికి ఎవరూ రాకుండా పోలీస్ పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. కొత్తవారు ఎవరు వస్తున్నా వారిని అడ్డుకొని వెనక్కి పంపిస్తున్నారు. కోవిడ్ బాధితులకు ఆనందయ్య ఆయుర్వేద ఔషధం.. కొంత ఊరట కలిగిస్తోంది. దీంతో.. మందు కోసం నెల్లూరుకు భారీగా చేరుకుంటున్నారు చుట్టుపక్కల ప్రాంతాల వారు. మందు పంపిణీ నిలిపివేశామని పోలీసులు చెబుతున్నప్పటికీ వినని పరిస్థితి నెలకొంది. ఏ క్షణమైనా ఆనందయ్య మందు పంపిణీకి పర్మిషన్ వస్తుందన్న ఆశతో.. ఇప్పిటికే చాలా మంది ప్రజలు.. కృష్ణపట్నంలో మకాం వేశారు. ఇంకోవైపు.. ఆనందయ్యకు ప్రమాదం పొంచి ఉందన్న సమాచారంతో పోలీసులు.. ఆయనను రహస్య ప్రదేశానికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆనందయ్యకు వై కేటగిరీ భద్రత ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం అందుతోంది.