న్యూస్ప్రాంతీయంరాజకీయం

అర్హులైన వారందరికీ అవినీతికి తావు లేకుండా పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.

వైఎస్ఆర్సిపి ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ వై వి సుబ్బారెడ్డి

నర్సీపట్నం, కోస్తాటైమ్స్ , : ఎన్నికల ముందు ఏ హామీలు ఇచ్చారో అవన్నీ దిగ్విజయంగా అమలు చేస్తూ, అర్హులైన వారందరికీ అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్సిపి ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ వై వి సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో “మళ్లీ జగనే ఎందుకు ముఖ్యమంత్రి కావాలి” అనే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాలుగు మండలాలు, పట్టణ పరిధి నుండి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేనివిధంగా గ్రామ వార్డు సచివాలయాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, రైతు భరోసాకేంద్రాలు, విద్యాలయాలలో నాడు నేడు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్యాన్ని కాపాడడం కోసం సెప్టెంబరు 30 నుండి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని రాష్ట్రంలోని 15 వేల సచివాలయాల పరిధిలో చేపట్టారన్నారు. రాబోయే నాలుగు నెలల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రణాళికను ఆయన వివరించారు. ఈనెల 26 నుండి సామాజిక సాధికారిక బస్సుయాత్ర ద్వారా ఈ నాలుగున్నర సంవత్సరాలలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తారన్నారు. నవంబర్ 1 నుండి జగనన్నే ఎందుకు ముఖ్యమంత్రి కావాలి కార్యక్రమాన్ని ఒక్కో సచివాలయం పరిధిలో రెండు రోజులపాటు నిర్వహిస్తారని, ఈ కార్యక్రమంలో హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలే కాకుండా అనేక మందికి లబ్ధి చేకూర్చే విధంగా పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి కార్యక్రమాలు ప్రజలకు వివరించాలన్నారు. జనవరి1 నుండి 10 వరకు రూ.3 వేల పింఛను అందించే కార్యక్రమాన్ని పండుగలా జరపాలన్నారు. జనవరిలో వైయస్సార్ ఆసరా, డ్వాక్రా మహిళలకు చివరి విడత రుణమాఫీ కార్యక్రమం ఉంటాయన్నారు. ఫిబ్రవరి 1 నుండి రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి ప్రచార కార్యక్రమం ఉంటుందని, రెండు నెలలపాటు ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను గడపగడపకు వివరించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం చేపట్టారని, నర్సీపట్నం నియోజకవర్గంలో ఐదు వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని, మరో వెయ్యి మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ను ముఖ్యమంత్రి కుటుంబ సభ్యునిగా చూస్తారని, అందుకే నర్సీపట్నంలో ఈ నాలుగున్నర సంవత్సరాలలో 1750 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. తెలుగుదేశం జనసేన ఇతర పార్టీలు వైయస్సార్ పార్టీపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టి రానున్న ఎన్నికలలో 175 స్థానాలు గెలుచుకునేలా సమిష్టిగా కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో 1 కోటి 60 లక్షల కుటుంబాలు ఉంటే వారిలో 1 కోటి 15 లక్షల కుటుంబాలకు ప్రభుత్వం లబ్ధి చేకూర్చిందన్నారు. ఈ విషయాన్ని వారందరికీ వివరించి వైయస్సార్ పార్టీకి మద్దతు తెలిపేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. అనంతరం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ముఖ్య అతిథులను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ బి సత్యవతి, జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, సీనియర్ నాయకుడు చింతకాయల సన్యాసి పాత్రుడు, మున్సిపల్ చైర్ పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ, నియోజకవర్గంలోని పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.