ఆంధ్రప్రదేశ్జిల్లాలునేరాలు .. ఘోరాలున్యూస్ప్రాంతీయం

మాకవరపాలెం మండలం హత్య కేసును చేదించిన పోలీసులు

*ఇద్దరు నిందితులు అరెస్ట్
*డబ్బు కోసమే హత్య
*వివరాలు వెల్లడించిన నర్సీపట్నం ఏ ఎస్పి రాణా

నర్సీపట్నం,కోస్తాటైమ్స్,(సెప్టెంబర్ -22) : మాకవరపాలెం మండలంలో కలకలం రేపిన వ్యక్తి హత్య కేసు మిస్టరీని పోలీసులు చేదించారు. డబ్బు కోసమే హత్య చేసినట్లు నర్సీపట్నం ఏఎస్పి అదిరాజ్ సింగ్ రాణా వెల్లడించారు. శుక్రవారం నర్సీపట్నం ఏఎస్పి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఏఎస్పి కథనం ప్రకారం మాకవరపాలెం మండలం దుంగలవానిపాలెంకు చెందిన హతుడు ధనిమిరెడ్డి రవి ఒరిస్సాలో పని చేస్తున్నాడని, అతడు ఈనెల 12న విశాఖపట్నం వచ్చి తన స్నేహితుడైన సురేష్ తో కలిసి విశాఖలోని టూరిస్టు ప్రదేశాలు చూడడానికి మలిశెట్టి అరవింద్ అనే ఆటో డ్రైవర్ తో రూ. 2500 కు ఒప్పందం కుదుర్చుకున్నా రన్నారు. మూడు రోజులపాటు అదే ఆటోలో తిరుగుతూ ముగ్గురూ కలిసి త్రాగుతూ, తిరుగుతూ ఎంజాయ్ చేశారని తెలిపారు. మృతుడు ఫోన్ పే ద్వారా ఆటో డ్రైవర్ అరవింద్ స్నేహితుడైన తెప్పల గణేష్ కు ఒప్పందం సొమ్ము చెల్లించారన్నారు. ఈనెల 15వ తేదీన మృతుడు తన స్నేహితుడైన సురేష్ తో కలిసి కాకినాడ వెళ్లి తిరిగి 17వ తేదీన నర్సీపట్నం చేరుకొని, సురేష్ తన గ్రామానికి వెళ్లిపోగా, మృతుడు వెంకటాద్రి లాడ్జిలో బస చేశాడన్నారు. మృతుడు ఒంటరిగా ఉండడం ఇష్టం లేక మూడు రోజులపాటు తనతో తిరిగిన ఆటో డ్రైవర్ అరవింద్ ను విశాఖ నుండి నర్సీపట్నం రమ్మని ఫోన్ చేసి పిలవగా, ఆటో డ్రైవర్ అరవింద్ తన స్నేహితుడైన తెప్పల గణేష్ తో కలసి మంగళవారం రాత్రి 9 గంటలకు నర్సీపట్నం చేరుకున్నాడన్నారు. ముగ్గురూ కలిసి ఆటోలో మాకవరపాలెం మండలం బయలుదేరి దారిలో బీర్ బాటిళ్లు, బిర్యానీ కొనుగోలు చేసి ముగ్గురూ కలిసి తాగారన్నారు. మృతుడైన రవి తనకు రామన్నపాలెంలో తెలిసిన వాళ్ళు ఉన్నారని వారి వద్దకు వెళ్లి వస్తానని చెప్పి ఆటో డ్రైవర్, అతని స్నేహితుడిని రామన్నపాలెం రోడ్డులో ఉంచి వెళ్లాడన్నారు. మృతుడు రవి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టడం చూసిన ఆటో డ్రైవర్ అతని స్నేహితుడు మృతుని వద్ద అధిక మొత్తంలో డబ్బు ఉందని తలంచి, మృతుని ఏటీఎం కార్డ్ పిన్ నెంబర్ కూడా వీరికి తెలియడం వల్ల అతన్ని అంతమొందించి డబ్బు దోచుకోవాలని పధకం వేశారన్నారు. తెల్లవారుజామున సుమారు మూడు గంటల ప్రాంతంలో మృతుడు రవి తిరిగి రాగా , ఆటో డ్రైవర్ అరవింద్, అతని స్నేహితుడు గణేష్ మృతుడు రవిపై ఎటాక్ చేసి రాయితో కొట్టి చంపి అతని వద్ద నుండి ఏటీఎం కార్డు, మొబైల్ ఫోన్,రూ.5810 క్యాష్ తీసుకొని పరారయ్యారన్నారు. బుధవారం ఉదయం మృతుని తమ్ముడు ధనిమిరెడ్డి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాకవరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి అనకాపల్లి ఎస్పీ సూచనల మేరకు,నర్సీపట్నం ఏఎస్పీ పర్యవేక్షణలో నర్సీపట్నం రూరల్ సీఐ పి.రమణయ్య, మాకవరపాలెం ఎస్సై పి రామకృష్ణ దర్యాప్తు ప్రారంభించి, అనకాపల్లి సిసిఎస్ ఎస్ఐ రమేష్,నర్సీపట్నం పట్టణ, కేడీపేట ఎస్సైలు సుధాకర్, ఉపేంద్ర సహకారంతో 36 గంటల్లో ముద్దాయిలైన విశాఖ జిల్లా పెందుర్తి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మలిశెట్టి అరవింద్, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం బురుజుపాడు గ్రామానికి చెందిన తెప్పల గణేష్ లను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించామన్నారు. వారి వద్ద నుండి రూ 1000 క్యాష్, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని ఏఎస్ పి అది రాజ్ సింగ్ రాణా తెలిపారు. ఈ సమావేశంలో నర్సీపట్నం రూరల్ సీఐ పి.రమణయ్య,మాకవరపాలెం ఎస్సై పి.రామకృష్ణ పాల్గొన్నారు…