రాష్ట్రీయం

10 నెలల అప్పు రూ.73,913 కోట్లు!

అంచనాల కన్నా 153 శాతం అధికం..

అప్పుల్లో ఏపీది దేశంలోనే నాలుగో స్థానం..

అమరావతి, మార్చి 5 (న్యూస్‌టైమ్): రాష్ట్రంపై అప్పుల భారం పెరుగుతూనే ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో పది నెలల లెక్కలను కాగ్‌ విడుదల చేసింది. జనవరి నెలాఖరు వరకు రాష్ట్రంలో రూ.73,912.91 కోట్లను అప్పుల రూపంలోనే సమకూర్చుకోవాల్సి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రుణ అంచనాలతో పోలిస్తే ఇది రెట్టింపును దాటిపోయింది. కరోనా వల్ల రెవెన్యూ ఆదాయం తగ్గిపోవడంతో ప్రారంభంలో అప్పులు చేయక తప్పలేదని ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నా, రెవెన్యూ రాబడి గత ఆర్థిక సంవత్సరం కన్నా ఇప్పుడు ఎక్కువేనని కాగ్‌ లెక్కలే అంటున్నాయి.

2019-20 ఆర్థిక సంవత్సరంలో జనవరి నెలాఖరు వరకు రెవెన్యూ రాబడి రూ.85,987.04 కోట్లు ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అది రూ.88,238.70 కోట్లు. కరోనా ప్రభావం ఉన్నా రెవెన్యూ రాబడి ఈ సంవత్సరం మెరుగ్గానే ఉందని ఈ లెక్కలు పేర్కొంటున్నాయి. రుణాల విషయానికి వస్తే కిందటి ఆర్థిక సంవత్సరంలో జనవరి నెలాఖరు వరకు రూ.46,503.21 కోట్లు అప్పు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అది ఏకంగా 73,912.91 కోట్లకు చేరింది. నాటి అప్పు అంచనాలతో పోలిస్తే 131% ఉంటే ప్రస్తుత సంవత్సరంలో అది అంచనాల కన్నా 153%కు చేరింది. రాష్ట్రంలో జనవరి నెలాఖరు వరకు రెవెన్యూ ఖర్చు, పెట్టుబడి వ్యయం కలిపి రూ.1,61,833 కోట్లు వెచ్చించారు. రూ.100 ఖర్చు చేస్తే అందులో రూ.45 అప్పుల రూపంలోనే సమకూర్చుకోవాల్సి వచ్చింది. మిగిలిన రూ.55 రెవెన్యూ రాబడి. ఈ ఏడాది రెవెన్యూ లోటు గుదిబండలా మారుతోంది.

రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ ఖర్చులు పెరగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఎప్పటికప్పుడు రెవెన్యూ లోటు తగ్గించుకుంటూ వస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉంటున్నాయి. ఈ ఏడాదిరూ.54,046 కోట్ల మేర రెవెన్యూ లోటు ఏర్పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌ అంచనాల మేరకు దాన్ని రూ.18,434 కోట్లకే పరిమితం చేస్తామని ఆర్థికశాఖ వాగ్దానం చేసింది. కిందటి ఏడాది అది రూ.34,690 కోట్లే! పెట్టుబడి వ్యయం మెరుగ్గా కిందటి ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం పెట్టుబడి వ్యయం పెరిగింది. భవిష్యత్తులో ఆదాయాలు కల్పించే వనరులపై వ్యయం చేస్తే దాన్ని పెట్టుబడి వ్యయంగా పేర్కొంటారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అది రూ.19,547 కోట్లు చేశారు. కిందటి ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.7,297 కోట్లే.