31 రైల్వే స్టేషన్ల మూసివేత

హైదరాబాద్, జనవరి 30 (న్యూస్‌టైమ్): దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) జోన్ పరిధిలోని మొత్తం 31 రైల్వే స్టేషన్లను తాత్కాలికంగా మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. ఆ రైల్వే స్టేషన్ల పరిధిలో ఆదాయం, రద్దీ లేని కారణంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 29 స్టేషన్లు మూతపడతాయని, ఏప్రిల్ 1 నుంచి మరో 2 రైల్వే స్టేషన్లు మూసివేస్తామని వెల్లడించారు. అయితే ఈ స్టేషన్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఒక్క స్టేషన్ మాత్రం మహారాష్ట్ర పరిధిలోని నాందేడ్‌ జిల్లాలో ఉంది.

డివిజన్ల వారీగా చూస్తే సికింద్రాబాద్ పరిధిలో 16 రైల్వే స్టేషన్లు, గుంతకల్ పరిధిలో 3, నాందేడ్ పరిధిలో 1, గుంటూరులో 4, హైదరాబాద్ పరిధిలో 7 స్టేషన్లను మూసివేయాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఉన్నట్టుండి 31 స్టేషన్లను మూసివేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించడం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

Latest News