న్యూఢిల్లీ, జనవరి 22 (న్యూస్‌టైమ్): నేతాజీ సుభాష్ చంద్ర బోస్ 125వ జయంతి సంవత్సరాన్ని స్మరించుకోవడానికి ఈ నెల 23న కోల్‌కాతాలో నిర్వహించే ‘పరాక్రమ్ దివస్’ ఉత్సవాలను ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ప్రధాన మంత్రి 1.06 లక్షల భూమి పట్టాలు/ కేటాయింపు ధ్రువ పత్రాలను పంపిణీ చేయడానికి అసమ్‌లోని శివసాగర్ జిల్లాలో జెరెంగా పథర్‌ను కూడా సందర్శిస్తారు. కోల్‌కాతాలోని విక్టోరియా స్మృతి చిహ్నం వద్ద నిర్వహించే ‘పరాక్రమ్ దివస్’ ప్రారంభ కార్యక్రమానికి ప్రధాన మంత్రి అధ్యక్షత వహిస్తారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అజేయ స్ఫూర్తి ని, దేశ ప్రజల కు ఆయన చేసిన స్వార్ధ రహిత సేవలను గుర్తుకు తెచ్చి, సమ్మానించడానికి ఆయన పుట్టిన రోజైన జనవరి 23వ తేదీని ప్రతి సంవత్సరం ‘పరాక్రమ్ దివస్’గా జరపాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతికూల పరిస్థితులలో సైతం నేతాజీ ఎలా నిబ్బరంగా వ్యవహరించారో ఆ స్ఫూర్తిని దేశ ప్రజలలో, ప్రత్యేకించి యువతలో, నింపేటందుకు, దేశభక్తి తాలూకు శ్రద్ధను వారిలో ప్రోది చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టాలని ఉద్దేశించడం జరిగింది.
నేతాజీకి సంబంధించిన ఒక శాశ్వత ప్రదర్శనను, ఒక ప్రొజెక్షన్ మ్యాపింగ్ షోను ఈ సందర్భంలో మొదలుపెడతారు. ఒక స్మారక నాణేన్ని, తపాలా బిళ్ళను కూడా ప్రధానమంత్రి విడుదల చేయనున్నారు. నేతాజీ ఇతివృత్తంగా ‘అమ్రా నూతొన్ జొబొనెరి దూత్’ పేరుతో రూపొందించిన ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా ప్రదర్శించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కంటే ముందు, ప్రధానమంత్రి కోల్‌కాతాలోని జాతీయ గ్రంథాలయానికి వెళ్తారు. అక్కడ ‘రి-విజిటింగ్ ద లెగసీ ఆఫ్ నేతాజీ సుభాష్ ఇన్ ద ట్వంటీఫస్ట్ సెంచరి’ విషయంపై ఒక అంతర్జాతీయ సమావేశాన్ని, కళాకారుల శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. సమావేశంలో పాలుపంచుకొనే వారి తోను, కళాకారులతోను ప్రధాన మంత్రి మాట్లాడతారు.
ఆ రోజు ఇంతకంటే ముందుగా, ప్రధాన మంత్రి అసమ్‌లోని శివసాగర్‌లో 1.06 లక్షల భూమి పట్టాలను/ కేటాయింపు ధ్రువ పత్రాలను పంపిణీ చేస్తారు. రాష్ట్రంలో స్వదేశీ ప్రజల భూమి హక్కులను పరిరక్షించవలసిన తక్షణ అవసరాన్ని లెక్కలోకి తీసుకొని అసమ్ ప్రభుత్వం ఒక నూతన సంపూర్ణ భూమి విధానాన్ని తీసుకు వచ్చింది. అసమ్‌కు చెందిన స్థానికులకు పట్టాల కేటాయింపు ధ్రువ పత్రాలను జారీ చేయడానికి వారిలో భద్రత భావనను నింపడానికి పెద్ద పీటను వేయడమైంది. అసమ్‌లో భూమి లేని కుటుంబాలు 2016వ సంవత్సరంలో 5.75 లక్షలుగా ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం 2016 మే నెల నుంచి 2.28 లక్షల భూమి పట్టాలను/కేటాయింపు ధ్రువ పత్రాలను వితరణ చేసింది. ఈ నెల 23న జరపాలని తలపెట్టిన కార్యక్రమం ఈ ప్రక్రియలో తరువాతి అడుగును సూచిస్తున్నది.