అమరావతి, జనవరి 24 (న్యూస్‌టైమ్): గ్రామాలకు అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ నెట్వర్క్ అందించాలని, అంతరాయం లేకుండా ఇంటర్నెట్ అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఐటీ, డిజిటల్ టెక్నాలజీపై సీఎం వైయస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్షన్లు, అమ్మఒడి పథకంలో ఆప్షన్‌గా ఇచ్చే ల్యాప్‌టాప్‌ల పంపిణీపై సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు. అనంతరం సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ ‘‘గ్రామాల్లో అంతరాయాలు లేకుండా ఇంటర్నెట్ నెట్వర్క్ అందించాలి. ఏ స్థాయి కనెక్షన్ కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. గ్రామంలో నెట్వర్క్ పాయింట్ వద్ద ఇంటర్నెట్ లైబ్రరీ ఉండాలి. తద్వారా సొంత ఊళ్లలోనే వర్క్ ఫ్రం హోం సదుపాయం కల్పించవచ్చు. ఈ మేరకు ప్రణాళిక సిద్ధం చేయాలి.’’ అని అన్నారు.
‘‘అదే విధంగా అమ్మఒడి పథకంలో ఆప్షన్‌గా విద్యార్థులకిచ్చే ల్యాప్‌టాప్‌లపైనా అధికారులు ఆలోచన చేయాలి. వచ్చే ఏడాది అమ్మఒడి చెల్లింపుల నాటికి ల్యాప్‌టాప్‌లు ఇచ్చేందుకు సిద్ధం కావాలి. ల్యాప్‌టాప్ చెడిపోయిందని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇస్తే వారం రోజుల్లో మరమ్మతులు చేసి మళ్లీ విద్యార్థులకు ఇచ్చే విధంగా సిస్టమ్ ఉండాలి. ఆ రకంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోండి’’ అని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఏపీ ఫైబర్‌నెట్ సంస్థ ఛైర్మన్ పి.గౌతం రెడ్డి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, గృహ నిర్మాణశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ నాగులాపల్లి శ్రీకాంత్, ఏపీ ఫైబర్‌నెట్ సంస్థ ఎండీ ఎం.మధుసూధన్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.