హైదరాబాద్, జనవరి 26 (న్యూస్టైమ్): నిర్మానుష్య ప్రాంతంలో ఒంటరిగా ఉండే మహిళలే లక్ష్యంగా హత్యలు చేస్తున్న సీరియల్ కిల్లర్ సైకోను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుడు రాములుపై 18హత్యలు, నాలుగు దొంగతనం కేసులు ఉన్నట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. భార్య వదిలేయడంతోనే మహిళలను లక్ష్యంగా చేసుకున్నాడన్న సీపీ 2003 నుంచి వరస నేరాలకు పాల్పడుతున్నట్టు పేర్కొన్నారు.
జీవిత ఖైదు అనుభవిస్తూ హైకోర్టుకు వెళ్లి గతేడాది జూలైలో విడుదలైన రాములు జైలు నుంచి వచ్చిన 5 నెలల్లోనే మరో ఇద్దరు మహిళలను హతమార్చినట్టు అంజనీ కుమార్ వెల్లడించారు. మొదటి భార్య వదిలేయడంతో మహిళలపై కక్ష పెంచుకుున్నాడని సీపీ పేర్కొన్నారు. 15 రోజుల క్రితం అంకుశాపూర్ వద్ద గుర్తు తెలియని మహిళ హత్య కేసు దర్యాప్తులో సీరియల్ కిల్లర్ ఘాతుకాలు వెలుగులోకి వచ్చినట్టు సిపి మీడియాకు వివరించారు.
ఈ నెల మొదటివారంలో హైదరాబాద్ శివారులోని అంకుషాపూర్ సమీపంలో మొదట ఓ మహిళ మృతదేహం పోలీసులకు లభ్యమైంది. ముఖం గుర్తుపట్టరాకుండా ఉండటంతో ఆమెకు సంబంధించిన వివరాలేవీ తెలియరాలేదు. అయితే, సంఘటనా స్థలంలో దొరికిన ఒకే ఒక్క చిన్న క్లూతో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. మృతురాలి చీర కొంగుకు ఉన్న ముడిలో చిన్న చీటి ముక్క దొరికింది. అందులో ఒక సెల్ఫోన్ నంబర్ రాసి ఉంది. ఇక ఆ నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టగా అది నేరెడ్మెట్గా చెందిన వ్యక్తిదిగా తేలింది. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా ఆమె జూబ్లీహిల్స్ సమీపంలోని వెంకటగిరికి చెందిన వెంకటమ్మ(50)గా పోలీసులకు చెప్పాడు. హత్యతో అతనికి ఎలాంటి సంబంధం లేదని తెలిసి పోలీసులు అతన్ని విడిచిపెట్టారు.
కేసు విషయమై రాచకొండ పోలీసులు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించగా ఈ నెల 1న వెంకటమ్మపై మిస్సింగ్ కేసు నమోదైంది. ఆమె సెల్ఫోన్ నంబర్ ఆధారంగా చివరిసారిగా బేగంపేటలో ఆమె ఫోన్ సిగ్నల్ నమోదైనట్లు గుర్తించారు. నగరంలోని పలుచోట్ల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. చివరకు ఒకచోట వెంకటమ్మ,మరో వ్యక్తితో కలిసి ఆటోలో బయలుదేరిన దృశ్యాలను గుర్తించారు. అయితే ఆ వ్యక్తి ఎవరన్నది తెలియక పోలీసులు తలపట్టుకున్నారు. కుటుంబ సభ్యులు,తెలిసినవారికి అతని ఫోటోను చూపించగా అతనెవరో తెలియదన్నారు. ఆ ఫోటో పట్టుకుని నగరమంతా విస్తృతంగా గాలించిన పోలీసులు ఎట్టకేలకు అతని ఆచూకీ కనుగొన్నారు. నగరంలోని ఓ ప్రాంతానికి చెందిన వ్యక్తి గతంలో అతన్ని బోరబండలో చూసినట్లు పోలీసులకు చెప్పాడు. దీంతో ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టిన పోలీసులు ఎట్టేకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని సైకో రాములుగా గుర్తించారు.
వెంకటమ్మను తానే హత్య చేసినట్లు అంగీకరించిన నిందితుడు మరికొంతమందిని కూడా ఇలాగే హత్య చేసినట్లు చెప్పాడు. మొత్తంగా 18 మంది మహిళలను అతను హత్య చేసి ఉంటాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. గతంలో రాములుపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవగా మానసికస్థితి సరిగా లేకపోవడంతో పోలీసులు ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి తప్పించుకు పారిపోయిన రాములు ఎట్టకేలకు మళ్లీ పట్టుబడ్డాడు.