శ్రీకాకుళం, ఫిబ్రవరి 3 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల పంచాయతీ రోజురోజుకీ వేడెక్కుతోంది. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో జరిగిన ఘటనలో అరెస్టైన తెలుగుదేశం పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుని పోలీసులు సబ్ జైలుకు తరలించారు. వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కింజరాపు అప్పన్నను నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారన్న కేసులో అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన్ను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.
అచ్చెన్నతో సహా ఇతర 13మంది నిందితులకు న్యాయమూర్తి 14రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు ఆయన్ను కోటబొమ్మాళి నుంచి శ్రీకాకుళంలోని జైలుకు తరలించారు. ఈ వివాదంపై కోటబొమ్మాళి పీఎస్‌లో 22 మందిపై కేసు నమోదు అయింది. నిన్న 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ తెల్లవారుజామున అచ్చెన్నను అదుపులోకి తీసుకున్నారు. కేసులో ఏ-1గా కింజరాపు హరిప్రసాద్, ఏ -2గా కింజరాపు సురేష్, ఏ-3గా కింజరాపు అచ్చెన్నాయుడు, ఏ-4గా కింజరాపు లలితకుమారి పేర్లను చేర్చారు.
ఇక, తనను అరెస్ట్ చేసిన పోలీసులపై అచ్చెన్నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చితీరుతుందని, అప్పుడు తానే హోం మంత్రి అవుతానని జోస్యం చెప్పారు. చంద్రబాబుని అడిగి మరీ హోం మంత్రి పదవి తీసుకుంటాన్న అచ్చెన్న అప్పుడు ఎవర్నీ వదిలి పెట్టనని, అందరి అంతూ చూస్తానంటూ హెచ్చరించారు. వైసీపీ నేతల అండతో కొందరు పోలీసులు రెచ్చిపోతున్నారని ఆయన మండిపడ్డారు. తనపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులను వదిలి పెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. సీఐ, ఎస్సై తన బెడ్ రూమ్‌లోకి వచ్చి దౌర్జన్యం చేశారని అచ్చెన్న ఆరోపించారు. తాను నిజంగా తప్పుచేశానని భావిస్తే చట్టప్రకారం అరెస్ట్ చేయాలని హితవు పలికారు. అచ్చెన్నాయుడు సొంత ఊరైన నిమ్మాడలో ఆయన భార్య సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. ఆమెపై పోటీకి అచ్చెన్నాయుడుకు వరసకు అన్న కుమారుడైన కింజరాపు అప్పన్నను వైసీపీ బరిలో నిలిపింది. అయితే, అప్పన్నను నామినేషన్ వేయవద్దంటూ అచ్చెన్నాయుడు బెదిరించారంటూ కాల్ రికార్డ్స్ సంచలనం సృష్టించాయి. అప్పన్నతో నామినేషన్ వేయించడానికి టెక్కలి వైసీపీ కోఆర్డినేటర్ దువ్వాడ శ్రీనివాస్ నిమ్మాడ వెళ్లారు.
ఈ క్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టెన్షన్ వాతావరణం మధ్యే అప్పన్న నామినేషన్ వేశారు. తనను నామినేషన్ వేయకుండా అచ్చెన్నాయుడు బెదిరింపులకు పాల్పడ్డారని అప్పన్న ఫిర్యాదు చేయడంతో అచ్చెన్నాయుడు సహా ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.