ప్రాంతీయం

అక్రమంగా నీటిని మళ్లిస్తే చర్యలు

ఏలూరు, మార్చి 5 (న్యూస్‌టైమ్): కాలువలు నుండి అక్రమంగా నీటిని మళ్ళించేవారి పై కఠిన చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.వెంకట రమణా రెడ్డి హెచ్చరించారు. స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ కె.వెంకట రమణా రెడ్డి సాగునీరు, వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు కొనుగోలు తదితర అంశాలపై వ్యవసాయ, ఇరిగేషన్, హర్టికల్చర్, పశుసంవర్ధకశాఖ, మార్కెటింగ్ శాఖల అధికారులతో సమీక్షించారు. సాగునీటిని వేరే అవసరాలకు అక్రమంగా మళ్లిస్తే పంటలకు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందన్నారు. సాగులో వున్న పంటలకు దాదాపు 40 రోజులు నీరు అవసమని, శివారు భూములకు నీటి ఎద్దడి ఏర్పడకుండా వంతులవారీగా నీటి నిర్వహణ చేయాలన్నారు. కాలువలపై రాత్రి సమయాలలో పర్యవేక్షణకు రెవిన్యు, పోలీస్, ఇరిగేషన్, వ్యవసాయ శాఖల సిబ్బందితో ఒక టీమ్ ను ఏర్పాటుచేయాలని సూచించారు. ఎవరో రైతు నీరు అక్రమంగా తరలిస్తున్నారు అనే చెప్పేవరకు మనం అరికట్టకపోవడం సరైనదికాదని, ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అక్రమంగా నీటిని తరలించేవారిపై కేసులు ఫైల్ చేయాలని ఆదేశించారు. కస్టమ్ హైరింగ్ సెంటర్లలో వుంచేందుకు రైతులకు అవసరమైన యంత్రసామాగ్రిని రైతు సంఘాలకు కొ ఆపరేటివ్ బ్యాంకు ద్వారా అందించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు వేగవంతంచేయాలన్నారు. రైతులకు అవసరమైన ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, హర్వెస్టర్స్ తదితర యంత్ర సామాగ్రిని కస్టమ్ హైరింగ్ సెంటర్లు ప్రారంభించేనాటికి సిద్ధంగా వుంచాలన్నారు. ఈ సమావేశంలో డిసిసిబి బ్యాంకు సిఇఓ వి.ఫణికుమార్, జిల్లా కోఆపరేటివ్ అధికారి ఎం.వెంకట రమణ, వ్యవసాయశాఖ జెడి గౌసియ బేగం, తదితరులు పాల్గొన్నారు.