జాతీయం

మధ్యప్రదేశ్‌ ప్రాజెక్టులకు అదనపు సాయం

న్యూఢిల్లీ, భోపాల్, జనవరి 25 (న్యూస్‌టైమ్): వివిధ పౌర-కేంద్రీకృత ప్రాంతాల్లో ఆయా సంస్కరణలను విజయవంతంగా నిర్వహించడానికి మూలధన ప్రాజెక్టులకు అదనపు నిధులు పొందిన మొదటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. వన్ నేషన్.. వన్ రేషన్ కార్డ్ సంస్కరణలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిఫార్మ్స్, అర్బన్ లోకల్ బాడీస్ సంస్కరణలను చేపట్టడానికి మూలధన వ్యయం కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని వ్య‌యశాఖ ఈ రాష్ట్రానికి అదనంగా రూ.660 కోట్ల నిధుల‌ను కేటాయించింది. నాలుగో సంస్కరణయిన‌ విద్యుత్ రంగ సంస్కరణలో కొంత భాగాన్ని కూడా రాష్ట్రం పూర్తి చేసింది.

దీంతో సుమారు రూ.660 కోట్ల వ్యయంతో కూడిన మూలధన ప్రాజెక్టుల జాబితాకు కేంద్ర వ్యయ శాఖ త‌న ఆమోదాన్ని తెలిపింది. ఆమోదించిన మొత్తంలో 50% (అనగా రూ.330 కోట్లు) మొత్తాన్ని ఆమోదించిన ప్రాజెక్టులకు తొలి విడతగా రాష్ట్రానికి విడుదల చేసింది కేంద్రం. ఈ పథకం పార్ట్-2 కింద మూలధన ప్రాజెక్టుల కోసం గ‌తంలో ఆమోదించిన రూ.660 కోట్లకు అదనంగా ఈ రూ.660 కోట్లు అంద‌నున్నాయి. ఆత్మా నిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా గ‌త ఏడాది అక్టోబర్ 12న ఆర్థిక మంత్రి మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం పథకాన్ని ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. కోవిడ్‌-19 మహమ్మారి నుండి ఉత్పన్నమయ్యే పన్ను ఆదాయంలో కొరత కారణంగా ఈ ఏడాది క‌ఠిన‌తరమైన ఆర్థిక వాతావరణాన్ని ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వాలు మూలధన వ్యయాన్ని పెంచడానికి గాను కేంద్రం ఈ పథకం ప్ర‌క‌టించింది. మూలధన వ్యయం అధిక గుణక ప్రభావాన్ని కలిగి ఉంటుంది, ఇది ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు ఉత్పాదకత‌ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఆర్థికవృద్ధి రేటుకు దారితీస్తుంది.

కేంద్ర ప్రభుత్వం తీవ్ర‌ ప్రతికూల ఆర్థికస్థితిలో ఉన్నప్పటికీ 2020-21 ఆర్థిక సంవత్సరంలో, మూలధన వ్యయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక సాయంమందించాలని నిర్ణయించారు. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వాల నుండి మంచి స్పందన లభించింది. ఇప్పటి వరకు 27 రాష్ట్రాలలో రూ.10,657 కోట్ల మూలధన వ్యయ ప్రతిపాదనలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం ల‌భించింది. ఈ పథకం కింద తొలి విడతగా ఇప్పటికే రూ.5,328 కోట్ల మొత్తాన్ని రాష్ట్రాలకు విడుదల చేశారు. ఆయా రాష్ట్రాల వారీగా కేటాయింపులు, అనుమతుల‌ను మంజూరు చేసింది. ఈ పథకం నుంచి తమిళనాడు ఎలాంటి ప్రయోజనం పొందలేదు. ఈ ప‌థ‌కం కింద ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా, నీటిపారుదల, విద్యుత్, రవాణా, విద్య, పట్టణాభివృద్ధి వంటి వివిధ రంగాల్లో వివిధ ర‌కాల మూలధన వ్యయ ప్రాజెక్టులు ఆమోదించారు. ఈ పథకానికి మూడు భాగాలు ఉన్నాయి. ఈ పథకం మొదటి విభాగం ఈశాన్య, కొండ రాష్ట్రాలకు సాయం అందించ‌డానికి సంబంధించిన‌ది. ఈ విభాగం కింద ఏడు ఈశాన్య రాష్ట్రాలకు (అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర) రూ.200 కోట్ల మేర నిధుల‌ను కేటాయించారు.

ప్రతి కొండ రాష్ట్రాలకు (హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్) రూ.450 కోట్ల నిధుల‌ను కేటాయించారు. అధిక జనాభా, భౌగోళిక ప్రాంతాల దృష్ట్యా, అస్సాం రాష్ట్రానికి ఈ పథకం కింద రూ.450 కోట్ల‌కు కేటాయింపులు పెంచారు. ఈ పథకం పార్ట్- II, పార్ట్‌-1లో చేర్చని ఇత‌ర రాష్ట్రాలను ఇందులో చేర్చారు. ఈ విభాగానికి రూ.7,500 కోట్లు కేటాయించారు. 2020-21 సంవత్సరానికి గాను 15వ ఆర్థిక కమిషన్ మ‌ధ్యంత‌ర కేటాయింపుల ప్రకారం ఈ మొత్తాన్ని కేంద్ర పన్నులో వారి వాటాకు అనులోమానుపాతంలో కేటాయించారు. ఈ పథకం పార్ట్-3లో భాగంగా వివిధ పౌర-కేంద్రీకృత సంస్కరణలను మెరుగ్గా అమ‌లులోకి తీస‌కువ‌చ్చిన ఆయా రాష్ట్రాల‌కు సాయం అందించాల‌ని నిర్ణ‌యించారు. ఈ విభాగం కింద రూ .2000 కోట్ల‌ను కేటాయించారు. 2020 మే17 నాటి లేఖలో ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొన్న 4 సంస్కరణల్లో కనీసం మూడింటిని అమలు చేసిన వివిధ రాష్ట్రాలకు మాత్రమే ఈ మొత్తం అందుబాటులో ఉంది. 2021 ఫిబ్రవరి 15 లోపు నోడల్ మంత్రిత్వ శాఖ ద్వారా సిఫారసులు పంపిన వారికి సాయం అందించ‌నున్నారు.

వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్, సుల‌భంగా బిజినెస్ నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన వాతావ‌ర‌ణం, అర్బన్ స్థానికి ప‌రిపాల‌న విభాగం/యుటిలిటీ రిఫార్మ్, విద్యుత్ రంగంలో సంస్క‌ర‌ణ‌లు అనేవి ఈ ప‌థ‌కానికి ప్ర‌తిపాదిత సంస్క‌ర‌ణ‌లుగా ఉన్నాయి.