జాతీయం

కొవిడ్‌పై పోరాటానికి ఈశాన్యానికి సరిపడా నిధులు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14 (న్యూస్‌టైమ్): కొవిడ్‌పై పోరాటానికి కేంద్ర నుంచి సరిపడా నిధులు ఈశాన్య ప్రాంతానికి అందుబాటులో ఉంచామని ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. 2019-20 కాలానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రూ.111.34 కోట్లను ఈశాన్య రాష్ట్రాలకు కేటాయించిందని పేర్కొన్నారు. కొవిడ్‌ నిర్వహణ, నియంత్రణ కోసం జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద 2020-21లో అసోంకు కేటాయించిన రూ.72.53 కోట్లను కూడా ఇందులో కలిపినట్లు తెలిపారు. ఇంకా, 2020-21 ఆర్థిక సంవత్సరంలో, ‘ఇండియా కొవిడ్‌-19 అత్యవసర స్పందన, ఆరోగ్య వ్యవస్థ సంసిద్ధత ప్యాకేజీ’ కింద అసోంకు అందించిన రూ.180.04 కోట్లతోపాటు మొత్తం రూ.265.96 కోట్లను ఈశాన్య రాష్ట్రాలకు కేటాయించినట్లు వెల్లడించారు. దీంతోపాటు, ఈశాన్య ప్రాంత ప్రత్యేక మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకం కింద ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ రూ.193.32 కోట్ల విలువైన 5 ప్రాజెక్టులను కేటాయించిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

కొవిడ్‌ నేపథ్యంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి అరుణాచల్‌ప్రదేశ్‌, అసోం, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌కు వీటిని కేటాయించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుల కింద, రూ.77.33 కోట్లను మంత్రిత్వ శాఖ విడుదల చేసినట్లు డా.జితేంద్ర సింగ్‌ తన లిఖితపూర్వక సమాధానంలో వివరించారు. 2020-21లో, కొవిడ్‌పై పోరాటం కోసం 8 ఈశాన్య రాష్ట్రాలకు ఈశాన్య ప్రాంత మండలి (ఎన్‌ఈసీ) రూ.25.29 కోట్లు అందించిందని మంత్రి వెల్లడించారు. కొవిడ్‌ కారణంగా స్వస్థలాలకు తిరిగివచ్చిన వారికి ఉపాధి కల్పించడానికి మరో రూ.24.96 కోట్లను ఎన్‌ఈసీ కేటాయించిందన్నారు. ఆరోగ్య మౌలిక సదుపాయాల వృద్ధి కోసం ఈశాన్య రాష్ట్రాలకు కేటాయించిన ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టుల కోసం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నిధుల ఖర్చుపై సమర్పించాల్సిన వినియోగ పత్రాలు ఇంకా తమకు అందలేదని డా.జితేంద్ర సింగ్‌ లోక్‌సభకు తెలిపారు.