జాతీయం

సంస్థాగత రుణంతో రైతులందరి అనుసంధానం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7 (న్యూస్‌టైమ్): ‘‘మన రైతులకు తగినంత రుణం అందించేందుకు వ్యవసాయ రుణ లక్ష్యాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. 16.5 లక్షల కోట్లకు పెంచాను. పశుగణాభివృద్ధి, పాడిపరిశ్రమ, మత్స్య అభివృద్ధి కి రు ణప్రవాహం పెరిగేలా ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రైతులకు సకాలంలో అందుబాటు వడ్డీకి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా రుణం అందటానికి వీలుగా రైతులందరినీ సంస్థాగత రుణంతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేట్ రంగంలో రుణ వ్యవస్థతో పోల్చుకుంటే సంస్థాగత రుణం చౌకగా అందుబాటులో ఉండటం వలన రైతుల ఉత్పత్తి వ్యయంతో దీనికి ప్రత్యక్ష సంబంధం ఉంది.

గడిచిన కొన్ని సంవత్సరాలుగా క్షేత్ర స్థాయి రుణం చెప్పుకోదగిన పురోగతి కనబరచింది. మొత్తం లక్ష్యం కంటే ఎక్కువగా నమోదైంది. క్షేత్ర స్థాయి రుణం 2013-14 లో రూ.7.30 లక్షల కోట్లు కాగా 2019-20 సంవత్సరానికి అది 13.92 లక్షల కోట్లకు చేరింది. అంటే, ఇది 40.5% పెరుగుదల. కాలిక రుణాల వాటా అదే పనిగా పెరుగుతూ వస్తుండగా దీనివలన వ్యవసాయ రంగంలో మూలధనం పెరుగుతుంది. ఫలితంగా వ్యవసాయ ఉత్పాదకత పెరుగుదల కనబడుతుంది. క్షేత్ర స్థాయి రుణం 2013-14 లో రూ.7 లక్షల కోట్లు కాగా, 2019-20 లో అది రూ. 13.5 లక్షల కోట్లు అయింది. ఈ కాలంలో వ్యవసాయ రుణం అన్ని లక్ష్యాలనూ అధిగమించింది. 2020-21 సంవత్సరానికి వ్యవసాయ రుణం లక్ష్యాన్ని రూ.15 లక్షల కోట్లుగా నిర్ణయించారు. అదే ధోరణి కొనసాగిస్తూ తరువాత కూడా కేటాయింపులకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం కోవిడ్ సంక్షోభ సమయంలోనూ పురోగతి కొనసాగింది. 76% లక్ష్యం సాధించటంతో జనవరి 2021 వరకు 76% లక్ష్యం సాధించగలిగింది. భారత వ్యవసాయ రంగంలో చిన్న, సన్నకారు రైతులే ప్రధానంగా ఉంటారు. వీళ్ల సంఖ్య 1970-71 లో 491 లక్షలు ఉండగా 2015-16 నాటికి అది 1,260 లక్షలకు చేరింది. అంటే, ఇది 156% పెరుగుదల. 2010-11 నుంచి 2019-20 వరకు క్షేత్ర స్థాయి రుణం లబ్ధి దారుల్లో చిన్న, సన్నకారు రైతుల పెరుగుదల దాదాపు 17.8%. మొత్తం క్షేత్రస్థాయి రుణంలో చిన్న, సన్నకారు రైతుల వాటా 2010-11లో 35% నుంచి 2021-22లో 52% మేరకు పెరిగింది.

2013-14 నుంచి 2020-21 కాలంలో క్షేత్రస్థాయి రుణ ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకొని 2021-22 సంవత్సరానికి రూ.16.5 లక్షలకోట్లు లక్ష్యంగా నిర్ణయించారు. రైతులకు వడ్డీ చెల్లింపు పథకం కింద ప్రభుత్వం రైతులకు రూ. 3 లక్షల వరకు స్వల్ప కాలిక రుణం ఇస్తుంది. దీనిమీద వడ్డీ కేవలం ఏడాదికి 4% మాత్రమే ఉంటుంది.ముందుగా పంటరుణం మీద 7% వడ్డీ ఉండగా సకాలంలో చెల్లించిన వారికి 3% వడ్డీ మినహాయింపు ఉంటుంది. దాని ఫలితంగా వడ్డీ రేటు 4%గా ఉంటుంది. ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డ్ లను సంతృప్త స్థాయికి చేర్చటానికి 2020 ఫిబ్రవరి 10 న మొదటి దశ ప్రత్యేక కార్యక్రమం చేపట్టగా ఇది ఏప్రిల్ లో పూర్తయింది. రెండో దశ జూన్ వరకూ కొనసాగింది. దీనికింద ఇప్పటివరకు 1.87 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డులు జారీచేశారు. అర్హులైన రైతులకు దీని మంజూరు పరిమితి రూ. 1.76 లక్షల కోట్లు. అదే విధంగా ప్రభుత్వం పశుగణాభివృద్ధి, మత్స్యాభివృద్ధి రైతులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డులను విస్తరించింది. వారికి కూడా వడ్డీ మినహాయింపు ప్రయోజనం ఇస్తున్నారు. ఈ విధంగా వారి నిర్వహన మూలధన అవసరాలకు బాగా పనికొస్తుంది.

ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు, క్షేత్రస్థాయి రుణం లక్ష్యాన్ని రూ. 16.5 లక్షల కోట్లకు పెంచటం ద్వారా రైతులకు సంస్థాగత రుణాలకు రాయితీలివ్వటం పెరుగుతుంది. దీనివలన రైతుల అప్పులమీద వడ్డీ తగ్గి, ఆదాయం కూడా రెట్టింపవుతుంది. అందుబాటు ధరకే రుణం దొరకటం వలన రైతులు కూడా తమ దగ్గర అందుబాటులో ఉన్న మొత్తంతో ఆధునిక వ్యవసాయ విధానాలు అవలంబిస్తారు. సుస్థిర వ్యవసాయ రుణం ప్రభావం వల్లనే కరోనా సంక్షోభ సమయంలోనూ వ్యవసాయ రంగం చురుగ్గా కొనసాగింది.