హైదరాబాద్, ఫిబ్రవరి 5 (న్యూస్‌టైమ్): నీళ్లు.. నిధులు.. నియామకాలు.. ఇవి తెలంగాణ ఉద్యమ నినాదాలు. టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలుపెరగని పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. వచ్చిన తెలంగాణ ప్రజల తెలంగాణ, మన తెలంగాణ, అందరి తెలంగాణ కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రం ఏర్పడిన రోజు నుంచి తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న పథకాల ప్రధాన లక్ష్యం కూడా అదే. ‘మన నీళ్లు మనకు’ అనేది ఆచరణలోకి వచ్చి అందరి కండ్లముందు కనబడుతున్నది. ప్రతి ఎకరాకు సాగునీరు లక్ష్యంగా కాకతీయులు సృష్టించిన అపూర్వమైన 45 వేల గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించడం, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయడం, కొత్త ప్రాజెక్టులను శరవేగంగా నడిపించడం తెలిసిందే. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టును అత్యంత వేగంగా పూర్తి చేశారు. మన నిధులు మన కోసమే వాడితే అభివృద్ధి, సంక్షేమం ఎలా ఉంటుందో సాక్షాత్కారమవుతున్నది. ఆసరా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, రైతు బంధు, రైతు బీమా, మిషన్ భగీరథ వంటి ఎన్నో పథకాలతో పేదలకు సాయపడేలా ప్రభుత్వం పనిచేస్తున్నది.
‘‘పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడానికి దేశంలో రకరకాల సింగిల్ విండో పద్ధతులున్నాయి. తెలంగాణ సింగిల్ విండో విధానం అనేది ‘సింగిల్ విండో వితౌట్ గ్రిల్స్’ తద్వారా 15 రోజులలోనే తప్పనిసరిగా అనుమతులు లభించడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది.’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రపంచ ఐటీ దిగ్గజ కంపెనీలు మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్, ఒరాకిల్ తమ ఆఫ్‌షోర్ సెంటర్లను అమెరికా అవతల భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశాయి. తెలంగాణ ప్రభుత్వంపై, హైదరాబాద్‌పై నమ్మకంతోనే కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాయి. ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలతో లక్షల మంది స్థానిక యువతకు ఉద్యోగాల కల్పన సాధ్యమవుతోంది.’’ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం 14.2 శాతం ఆర్థిక వృద్ధిరేటుతో దేశంలోనే మూడో స్థానానికి ఎగబాకింది. రూ.2.28 లక్షల తలసరి ఆదాయంతో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబడటంతోనే మన నిధులను మనం సాకారం చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రం సిద్ధించేదాకా తెలంగాణ ఉద్యమం కొనసాగేందుకు ముఖ్య కారణమైన నినాదం నియామకాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పాలకుల నిర్లక్ష్యంతో ఉపాధి కరువైన మన ప్రాంతంలోని యువకులకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో బతుకుదెరువు బాట పడింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి ప్రభుత్వంలో, ప్రభుత్వ రంగ సంస్థల్లో వేగంగా నియమాకాలు చేపడుతున్నది. ఎప్పటికప్పుడు ఖాళీలను, ప్రభుత్వ పాలన అవసరాలకు తగినట్లుగా పోస్టులను భర్తీ చేస్తోంది.
దేశంలోనే అత్యంత పారదర్శకంగా పోస్టులను భర్తీ చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నాన్ లోకల్ విధానాన్ని రద్దు చేసింది. అలాగే జోనల్ విధానాన్ని మార్చివేసింది. 95 శాతం ఉద్యోగాలు స్థానిక యువతకే దక్కేలా ఏర్పాట్లు చేసింది. దీంట్లోనే జోన్ల వ్యవస్థను కూడా మార్చింది. గతంలో రెండు జోన్లు ఉంటే ఇప్పుడు ఏడు జోన్లుగా ఉన్నాయి. ఇప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్లపై కేసులు వేయడం పరిపాటిగా మారింది. ఒక్కో కేసును పరిష్కరించుకుంటూ తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఇప్పటివరకు 108 నోటిఫికేషన్లతో పోస్టుల భర్తీని వేగంగా జరిపింది. మిగిలినవీ వెంటనే పూర్తవుతాయి.
రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఖాళీ పోస్టులను గుర్తించి వెంటనే భర్తీ చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నది. ఈ ప్రక్రియలో భాగంగానే 2014 నుంచి ఇప్పటివరకు అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో కలిపి 1,31,109 పోస్టులను భర్తీ చేసింది. ఒక్క తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఆధ్వర్యంలోనే 35,839 పోస్టులు భర్తీ అయ్యాయి. వీటిలో విద్యాశాఖలో 8843, వైద్యశాఖలో 4982, వ్యవసాయశాఖలో 2282, అటవీశాఖలో 2057, గ్రౌండ్ వాటర్ డిపార్టుమెంట్‌లో 1562, రెవెన్యూ శాఖలో1467 పోస్టులతోపాటు సంక్షేమ శాఖల్లోని గురుకులాల్లో కలిపి 14,646 పోస్టులను టీఎస్‌పీఎస్సీ భర్తీచేసింది. రాష్ట్రంలో పెద్దదయిన పోలీసు శాఖలో పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో 31,972 పోస్టులు భర్తీ అయ్యాయి. పేదలకు మెరుగైన విద్యనందించే లక్ష్యంతో ఏర్పాటైన గురుకులాల అవసరాలను తీర్చే తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ రిక్రూట్‌మెంట్ సంస్థ ఆధ్వర్యంలో 3,623 పోస్టులు భర్తీ అయ్యాయి.
గ్రామాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం, పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులను భర్తీ చేసింది. యూనివర్సిటీల్లో 259 పోస్టులు భర్తీ అయ్యాయి. మొత్తంగా ప్రభుత్వ శాఖలు, వాటి ఆధ్వర్యంలోనే 81,285 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. ప్రభుత్వరంగ సంస్థల్లో భర్తీచేసిన పోస్టులు 49,824 ఉన్నాయి. సింగరేణి కాలరీస్‌లో 13,175 పోస్టులు, టీఎస్ ఆర్టీసీలో 5,568, ఇంధన శాఖలో 31,081 పోస్టులు భర్తీ అయ్యాయి.
ప్రభుత్వం అమలుచేస్తున్న విధానాలతో పారిశ్రామిక రంగంలో తెలంగాణ రాష్ట్రం ప్రపంచంలోనే కీలక గమ్యస్థానంగా నిలిచింది. అనేక అంతర్జాతీయ, జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాయి. మరెన్నో పెద్ద సంస్థలు పెట్టుబడి పెట్టే దిశగా అడుగులు వేస్తున్నాయి. సొంత రాష్ట్రంలో సొంత సర్కారు వచ్చాక తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు అవసరమయ్యే అనేక అనుమతుల ప్రక్రియను ఒకేచోట, వేగంగా పూర్తిచేసేందుకు, పెట్టుబడులకు అనువుగా.. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్టు అప్రూవల్, సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టీఎస్ ఐపాస్)ను తీసుకొచ్చారు. పెట్టుబడి పెట్టేవారి స్వీయ ధ్రువీకరణ ఆధారంగా కార్యకలాపాలు మొదలుపెట్టవచ్చు. ఫార్మా రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. జాతీయ స్థూల ఫార్మా ఉత్పత్తిలో తెలంగాణ 35శాతం వాటా కలిగి ఉన్నది. 3.5 లక్షల కోట్ల విలువ చేసే 800 ఫార్మా, బయో టెక్, వైద్య సాంకేతిక సంస్థలు తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. విప్లవాత్మకమైన టీఎస్ ఐపాస్‌తో రాష్ర్టానికి ఇప్పటివరకు 14,338 పరిశ్రమలు వచ్చాయి. రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయి. వీటిలో 14,59,639 మంది ఉద్యోగాలు పొందారు.
తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు పెట్టుబడులకు గమ్యస్థానంగా మారింది. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు మన రాష్ట్రంలో ఉత్పత్తులను, కార్యకలాపాలను నిర్వహిస్తుండటంతో ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయి. తెలంగాణలో 24 గంటలు నాణ్యమైన కరంటు లభ్యత, సమశీతోష్ణ వాతావరణం, కావాల్సినంత భూమి, అద్భుతమైన శాంతిభద్రతల వ్యవస్థ వంటి మౌలిక వసతులు ఇందుకు కారణాలు. ఇలా లభించే ఉపాధి అవకాశాలనూ సర్కారు కల్పించిన అవకాశాలుగానే లెక్కించాల్సి ఉంటుంది. ఐటీ, ఐటీ అనుబంధం, ఇతర రంగాల పరిశ్రమలు రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహించడంతో 2014 తర్వాత ఏకంగా 16,70,639 మంది ఉద్యోగాలు పొందారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అనేక సంస్థలు మన రాష్ట్రానికి వచ్చాయి.
స్వీడన్‌కు చెందిన ఐకియా తమ శాఖను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. రూ.900 కోట్లతో మెదక్ జిల్లాలో ఎంఆర్‌ఎఫ్ లిమిటెడ్ తమ కార్యకలాపాలను విస్తరించింది. వాల్ మార్ట్ సుమారు రూ.750 కోట్లతో తమ శాఖను ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్ తమ అతిపెద్ద ఫుల్‌ఫిల్‌మెంట్‌ను ప్రారంభించింది. మొబైలు ఫోన్ తయారీదారు వన్ ప్లస్ పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించింది. ఫెర్రింగ్ ల్యాబోరేటరీస్ జీనోమ్ వ్యాలీలో రూ.235 కోట్లతో కార్యకలాపాలు మొదలుపెట్టింది. నోవార్టీస్ తమ నాలెడ్జ్ సెంటర్‌ను హైదరాబాదులో ఏర్పాటు చేసింది. పరిశోధన, అభివృద్ధి సంస్థలు, అంకుర పరిశ్రమల కోసం ఎంఎం పార్క్ రూ.వెయ్యి కోట్లతో రెండో దశ ఐటీ హబ్‌ను 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సిద్ధం చేసింది. బోయింగ్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ఉమ్మడిగా హెలికాప్టర్ పైభాగాల తయారీ కర్మాగారాన్ని స్థాపించాయి. కల్యాణి రాఫెల్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్ క్షిపణి ఉప-వ్యవస్థ తయారీ యూనిట్‌ను ప్రారంభించింది. మెడ్ ట్రానిక్ సంస్థ రూ.1200 కోట్లతో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటుచేసింది.
19 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఫార్మా సిటీ ప్రపంచపు అతిపెద్ద సమీకృత ఫార్మా వ్యవస్థ. రూ.70వేల కోట్ల పెట్టుబడులు, 5,60,000 మందికి ఉద్యోగావకాశాలు ఉన్నాయి. భారతదేశపు మొదటి, అతిపెద్ద జీవశాస్త్ర ఉత్పత్తుల తయారీ సముదాయంగా జీనోమ్ వ్యాలీ ఉంది. సుమారు 150 సంస్థలు, 10 వేల ఉద్యోగులతో నడుస్తున్నది. ప్రసిద్ధ వ్యాక్సిన్, పరిశోధన సంస్థలు ఇక్కడ పనిచేస్తున్నాయి. వీటిలో మన యువత ఉద్యోగాలు పొందారు.
డిగ్రీ, పీజీ చదువులు పూర్తిచేసేవాళ్లు ఏటా లక్షల సంఖ్యలో ఉంటారు. వీరి సంఖ్యతో పోల్చితే ప్రభుత్వపరంగా ఖాళీ అయ్యే ఉద్యోగావకాశాలు పరిమితంగానే ఉంటాయి. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. పరిశ్రమల మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో దేశంలోనే రోల్‌మోడల్‌గా నిలిచేలా పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో అనుమతులు ఇచ్చేలా టీఎస్ ఐపాస్ విధానాన్ని తెచ్చారు. ఇలా వచ్చిన పరిశ్రమలతో స్థానికులకు ఉపాధి కోసమే సీఎం కేసీఆర్, పరిశ్రమల మంత్రి కేటీఆర్ ద్విముఖ వ్యూహంతో రూపొందించిన విధానాన్ని ప్రభుత్వం గతేడాది ఆగస్టు 5న ఆమోదించింది. స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలకు ప్రభుత్వం తరుఫున ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది.
పెట్టుబడి పెట్టే పరిశ్రమలకు, తెలంగాణ యువతకు ఉభయతారకంగా ఈ కొత్త విధానం నిలిచింది. స్థానికులకు ప్రోత్సాహకాలు అందించేందుకు వీలుగా పరిశ్రమలను రెండు క్యాటగిరీలుగా పేర్కొంది. మొదటి క్యాటగిరీలో పాక్షిక నైపుణ్యం గల మానవ వనరుల్లో స్థానికులు 70 శాతం ఉండాలని.. నైపుణ్యత కలిగిన మానవ వనరుల్లో స్థానికులు 50 శాతం ఉండాలని స్పష్టం చేసింది. రెండో క్యాటగిరీలో పాక్షిక నైపుణ్యం గల మానవ వనరుల్లో స్థానికులు 80 శాతం ఉండాలని నైపుణ్యత కలిగిన మానవ వనరుల్లో స్థానికులు 60 శాతం ఉండాలని నిబంధన పెట్టింది. తెలంగాణ ఉద్యమంలోని నియామకాల నినాదం సాకారమయ్యేలా మన రాష్ట్ర ప్రభుత్వ విధానం ఉన్నది. ఈ విధానంతో స్థానిక యువతకు నైపుణ్యంతోపాటు ఉపాధి దొరుకుతున్నది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వెట్టి చాకిరీ తరహాలో పనిచేసే ఎన్నో రకాల ఉద్యోగుల కుటుంబాల్లో తెలంగాణ ప్రభుత్వం వెలుగులు నింపింది. ఏండ్లుగా ఒకే జీతంతో పనిచేసే వారికి ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా వేతనాలు పెంచింది. ఆశ వర్కర్ల వేతనాలను ఏకంగా 400 శాతం పెంచింది. హోం గార్డులు, వీఆర్‌ఏలు, విద్యా వలంటీర్లు, అంగన్‌వాడీలు, అంగన్‌వాడీ హెల్పర్లు, ఆశ వర్కర్లు, సెర్ప్-వీవోలు.. జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాంట్రాక్టు లెక్చరర్లు ఇలా పది క్యాటగిరీల్లోనివారే 1,70,722 మంది ఉన్నారు. వేతనాలు పెరిగిన ఇతర క్యాటగిరీ వారు మరో 1,49,521 మంది ఉన్నారు. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం వేతనాలు పెంచడంతో అన్ని క్యాటగిరీల్లో కలిపి 3,20,243 మంది ఉద్యోగులు లబ్ధి పొందుతున్నారు. ఆయా ఉద్యోగులు, సిబ్బంది అవసరాల మేరకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ వారికి తోడుగా నిలుస్తున్నది.
డిగ్రీ, పీజీ చదువులు పూర్తిచేసేవాళ్లు ప్రతి ఏటా లక్షల సంఖ్యలో ఉంటారు. వీరి సంఖ్యతో పోల్చితే ప్రభుత్వపరంగా ఖాళీ అయ్యే ఉద్యోగావకాశాలు పరిమితంగానే ఉంటాయి. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. పరిశ్రమల మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో దేశంలోనే రోల్‌మోడల్‌గా నిలిచేలా పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో అనుమతులు ఇచ్చేలా టీఎస్ ఐపాస్ విధానాన్ని తెచ్చారు. ఇలా వచ్చిన పరిశ్రమలతో స్థానికులకు ఉపాధి కోసమే సీఎం కేసీఆర్, పరిశ్రమల మంత్రి కేటీఆర్ ద్విముఖ వ్యూహంతో రూపొందించిన విధానాన్ని ప్రభుత్వం గతేడాది ఆగస్టు 5న ఆమోదించింది.
విప్లవాత్మకమైన టీఎస్ ఐపాస్‌తో రాష్ట్రానికి ఇప్పటివరకు 14,338 పరిశ్రమలు వచ్చాయి. రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయి. వీటిలో 14,59,639 మంది ఉద్యోగాలు పొందారు. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక విధానంతో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు మన రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించాయి. హైదరాబాద్ మహానగరం ఇప్పుడు ప్రపంచస్థాయి ఐటీ కంపెనీల కార్యకలాపాలకు, డాటా భద్రతకు చిరునామాగా మారింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబీఎం, ఒరాకిల్ వంటి మల్టీ నేషనల్ కంపెనీలు హైదరాబాద్‌లో వాటి ప్రాంగణాలను ఏర్పాటు చేసుకున్నాయి.
అమెజాన్ వెబ్ సర్వీసెస్ సంస్థ హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహించేందుకు ఏకంగా రూ.20,761 కోట్ల పెట్టుబడులతో డాటా సెంటర్ రీజియన్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఐటీ రంగాన్ని వరంగల్, ఖమ్మం, కరీంనగర్ నగరాలకు విస్తరించేలా రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నది. ఈ నగరాల్లో ఐటీ హబ్‌లను ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి ఏడాదికి రూ.66,276 కోట్ల విలువైన ఐటీ ఎగుమతులుండేవి. 2020-21లో తెలంగాణ నుంచి ఐటీ ఎగుమతుల విలువ రూ.1,28,807 కోట్లకు చేరింది. ఐటీ రంగంలో ఇప్పటివరకు మన రాష్ట్రంలో 5,82,126 మంది ఉద్యోగాలు పొందారు. 2014 తర్వాత 2.11 లక్షల మందికి ఐటీ రంగంలో ఉద్యోగాలు లభించాయి.