జాతీయం

శత్రువులు తోక జాడిస్తే దేనికైనా సిద్ధం: ‌రాజ్‌నాథ్‌

బెంగళూరు, ఫిబ్రవరి 5 (న్యూస్‌టైమ్): స‌రిహ‌ద్దుల్లో శ‌త్రువులు దుస్సాహసాల‌కు పాల్పడితే తిప్పికొట్టేందుకు భార‌త సేన‌లు సిద్ధంగా ఉన్నాయ‌ని ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. క‌ర్ణాట‌క‌లో ఏరో ఇండియా-2021 ఎయిర్ షోను ప్రారంభించిన అనంత‌రం ప్ర‌సంగించిన ఆయ‌న‌ లఢ‌క్‌‌ సరిహద్దుల్లో భారత్-చైనా ప్రతిష్టంభన గురించి ప్రస్తావించారు. భౌగోళిక సమగ్రతను కాపాడుకునేందుకు, దేశ ప్రజల రక్షణకు భారత సైన్యం సంసిద్ధంగా ఉన్న‌ద‌ని చెప్పారు. స‌రిహద్దుల్లో క‌ట్టుదిట్టంగా బ‌ల‌గాల‌ను మోహ‌రించామ‌ని, శ‌త్రు దేశాల సేన‌లు ఎలాంటి దుస్సాహ‌సం చేసినా వెంట‌నే తిప్పికొట్టేందుకు సైన్యం అప్రమత్తంగా ఉన్న‌దని తెలిపారు.

కరోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ దేశాల‌ను అతలాకుత‌లం చేసిన స‌మ‌యంలోనూ ఎయిరో షోలో అనేక దేశాలకు చెందిన వైమానిక‌ సంస్థలు పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్న‌ద‌ని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ ఎయిర్ షోలో నేరుగా, వర్చువల్‌గా పాల్గొన్న సంస్థలకు ఆయ‌న‌ కృతజ్ఞతలు తెలియజేశారు. భారత రక్షణరంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటున్న‌ద‌ని, ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ కింద రక్షణ సామర్థ్యాన్ని పెంచడంలో భాగంగా వచ్చే ఏడెనిమిదేండ్లలో 130 బిలియన్‌ డాలర్లతో దళాలను ఆధునీకరించనున్నామ‌ని ఆయ‌న తెలిపారు.

కాగా, ఈ కార్యక్రమానికి క‌ర్ణాట‌క‌ ముఖ్యమంత్రి యెడియూరప్ప కూడా హాజ‌ర‌య్యారు. నేటి నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఈ ఎయిర్ షో జరుగనుంది. క‌రోనా నేప‌థ్యంలో సాధారణ ప్రేక్షకులకు డిజిటల్‌ వేదికల ద్వారా ఈ ప్రదర్శనను వీక్షించే వీలు కల్పించారు. ఈ ఎయిర్ షోలో ప్రపంచ దేశాల్లోని 601 సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. ఆద్యంతం ఆసక్తి కలిగించే రఫేల్‌ జెట్, అమెరికా అపాచి హెలిక్యాప్ల‌ర్లు భారతీయ సైన్యం తరఫున విన్యాసాలు చేయనున్నాయి.

ఈ ఎయిర్ షో సందర్భంగా హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ నుంచి కేంద్రం 83 తేజస్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ‌ రూ.48 వేల కోట్లు. ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సమక్షంలో రక్షణశాఖ అధికారులు, హాల్‌ అధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు. తేజ‌స్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు గత నెల కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన నేప‌థ్యంలో తాజాగా ఈ ఒప్పందం జ‌రిగింది. దీనిపై రాజ్‌నాథ్‌ హర్షం వ్యక్తంచేశారు. రక్షణ రంగ చరిత్రలో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద మేకిన్‌ ఇండియా రక్షణ ఒప్పందం అవుతుంద‌ని చెప్పారు.