జాతీయం

వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధితో లబ్ధి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 (న్యూస్‌టైమ్): మండీలుగా పిలిచే క్రమబద్ధీకరించిన వ్యవసాయ మార్కెట్లలో మౌలిక సదుపాయలు పెంచేందుకు, వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఏఐఎఫ్‌) కింద లక్ష కోట్ల రూపాయల రుణ సదుపాయాన్ని ఉపయోగించుకునేందుకు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ కమిటీలకు (ఏపీఎంసీలు) వెసులుబాటు కల్పిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ 2021-22 బడ్జెట్‌లో ప్రకటించారు. ఈ మార్కెట్లు రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణలో, రైతులతో అనుసంధానత కలిగి ఉంటాయి. వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర పొందే భరోసానిచ్చేలా, వేలం వేసుకునే వీలును రైతులకు ఈ మార్కెట్లు కల్పిస్తాయి. అయితే, వీటిని మరింత ఆధునీకరించాల్సిన అవసరం ఉంది.

ఏఐఎఫ్‌ నుంచి తక్కువ వడ్డీకే ఇవి రుణాలు పొంది, ఆ రుణాలతో మార్కెట్లలో సార్టింగ్, గ్రేడింగ్ యూనిట్లు, పంటలను ఆరబెట్టే ఏర్పాట్లు, శీతల గిడ్డంగులు, గోదాములు వంటి పంట కోత అనంతర మౌలిక సదుపాయాలను కల్పించవచ్చు. దీనివల్ల పంటలను నిల్వ చేసుకుని మంచి ధర వచ్చినప్పుడే విక్రయించే వెసులుబాటు పెరగడంతోపాటు, పంట నష్టం తగ్గుతుంది. నాణ్యమైన విలువ గొలుసు ద్వారా రైతుల ఆదాయం పెరిగేలా పంట కోత అనంతర మౌలిక సదుపాయాల లభ్యత ఉపకరిస్తుంది.

రుణ సదుపాయంతో పంటలను నిల్వ చేసుకోవడం వల్ల, ఆయా ఉత్పత్తులకు గరిష్ట ధర వచ్చినప్పుడే రైతులు అమ్ముకోవచ్చు. త్వరగా పాడైపోయే పండ్లు, కూరగాయలు, పూలు వంటివాటి మన్నికను పెంచడానికి, నాణ్యతను కాపాడటానికి విలువ గొలుసు అంతటా తక్కువ ఉష్ణోగ్రతలు కావాలి. మార్కెట్లలో శీతల గిడ్డంగుల ఏర్పాటు వల్ల రైతులు ప్రత్యక్షంగా లబ్ధిని పొందుతారు. గరిష్టంగా 5-10 శాతం వరకు ఉండే కోత అనంతర పంట నష్టాలను తగిన మౌలిక సదుపాయాలు తగ్గిస్తాయి. కాబట్టి, వ్యవసాయ ఆదాయాన్ని పెంచడానికి, విలువ గొలుసు వ్యాప్తంగా ఉండే అందరికీ ఉపయోగపడడానికి మండీల్లో మౌలిక సదుపాయాల పెంపు అతి ముఖ్యం.

వడ్డీ రాయితీ, రుణ హామీల ద్వారా పంట కోత అనంతర నిర్వహణ మౌలిక సదుపాయాలు, సామాజిక వ్యవసాయ ఆస్తుల ఏర్పాటు కోసం ఆచరణీయ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడానికి మధ్య, దీర్ఘకాలిక రుణ సదుపాయాన్ని ఏఐఎఫ్‌ కల్పిస్తుంది. ఈ పథకం వ్యవధిని 2020 నుంచి 2029 వరకున్న ఆర్థిక సంవత్సరాలుగా నిర్ణయించారు. ఈ పథకం కింద, ఏడాదికి 3 శాతం వడ్డీ రాయితీతో, లక్ష కోట్ల రూపాయల రుణాలను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అందిస్తాయి. రూ.2 కోట్ల వరకు తీసుకునే రుణాలకు సీజీటీఎంఎస్‌ఈ క్రింద రుణ హామీ లభిస్తుంది. ఈ పథకం లబ్ధిదారుల జాబితాలో ఉప్పటివరకు ఉన్న రైతులు, ఎఫ్‌పీవోలు, పీఏసీఎస్‌, మార్కెటింగ్ సహకార సొసైటీలు, ఎస్‌హెచ్‌జీలు, ఉమ్మడి రుణ బృందాలు (జేఎస్‌జీ), బహుళాంశక సహకార సంఘాలు, వ్యవసాయ పెట్టుబడిదారులు, అంకుర సంస్థలు, కేంద్ర/రాష్ట్రాల ఏజెన్సీలు లేదా స్థానిక సంస్థలు సిఫారసు చేసిన ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టులతోపాటు ఇప్పుడు ఏపీఎంసీలు కూడా చేరాయి.