జాతీయం

భారత్ పర్వ్-2021 ప్రారంభం

నెలాఖరు వరకూ దేశవ్యాప్తంగా కొనసాగింపు…

న్యూఢిల్లీ, జనవరి 26 (న్యూస్‌టైమ్): భారతీయ స్ఫూర్తిని ప్రతిబింబించే విధంగా జరుపుకునే, వార్షిక ఉత్సవం ‘భారత్ పర్వ్’ను ఈ ఏడాది జనవరి 26వ తేదీ నుండి జనవరి 31వ తేదీ వరకు దృశ్య మాధ్యమం వెబ్‌సైట్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పాటు చేసే మంటపాలలో, ఆయా ప్రాంతాలకు చెందిన పర్యాటక ప్రదేశాలు, వంటకాలు, హస్తకళా నైపుణ్యాలు వంటి అనేక ప్రత్యేకతలను ప్రదర్శిస్తారు. ఈ ఏడాది, దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహిస్తున్న, ‘భారత్-పర్వ్-2021’ ఉత్సవాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్‌తో కలిసి మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు.

భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ ‘భారత్ పర్వ్’ ఉత్సవాన్ని, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎర్ర కోట బురుజుల ఎదురుగా 2016 నుండి ప్రతీ సంవత్సరం జనవరి 26వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిర్వహిస్తూ వస్తోంది. దేశభక్తి పట్ల ఉత్సాహాన్ని రేకెత్తించే విధంగా ఈ భారీ ఉత్సవం దేశంలోని ఘనమైన, విభిన్నమైన సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది. ‘భారత్ పర్వ్’ ఉత్సవం భారతదేశ సుగంధాన్ని పరిమళింప జేస్తుంది. ఈ ఉత్సవంలో భాగంగా సాంస్కృతిక, ఆయుష్, వినియోగదారుల వ్యవహారాలు, రైల్వే, పౌర విమానయాన మొదలైన మంత్రిత్వ శాఖలతో పాటు; చేనేత వస్త్రాల అభివృద్ధి కమిషనర్; హస్తకళల అభివృద్ధి కమిషనర్; లలిత కళా అకాడమీ; భారత పురావస్తు సర్వే; జాతీయ వస్తు ప్రదర్శన శాలలు; ఆధునిక కళల జాతీయ ప్రదర్శన శాల; సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన మీడియా సంస్థలు; ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కె.వి.ఐ.సి) వంటి వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, ఇతర సంస్థలు, భారతదేశం నలుమూలల నుండి హస్తకళలు, చేనేత వస్త్రాలు, సంగీతం, నృత్యం, చిత్ర లేఖనం, సాహిత్యంతో పాటు అనేక ఇతర అంశాలను ప్రదర్శిస్తాయి.

గణతంత్ర దినోత్సవ కవాతు విన్యాసాలు, సాయుధ దళాల సంగీత బృందాల ప్రదర్శనల రికార్డింగులు మొదలైన ప్రదర్శనలు కూడా ఈ వెబ్-సైట్ ద్వారా వీక్షించడానికి అందుబాటులో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ హోటల్ యాజమాన్య శిక్షణా సంస్థలతో పాటు, భారతీయ వంటల శిక్షణా సంస్థ రూపొందించిన వంటకాల వీడియోల ద్వారా భారతదేశానికి చెందిన అనేక ఆహార పదార్ధాల వివరాలను కూడా ఈ వెబ్‌సైట్ ద్వారా వీక్షించవచ్చు. ఈ ఏడాది దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహిస్తున్న ఈ ప్రత్యేకమైన ‘భారత్ పర్వ్-2021’ ఉత్సవంలో అనేక వీడియోలు, చలన చిత్రాలు, ఫోటోలు, బ్రోచర్లతో పాటు వివిధ సంస్థల సమగ్ర సమాచారాన్ని కూడా వీక్షించడానికి వీలుగా అందుబాటులో ఉంచారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు, వారి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, కంప్యూటర్లు, ఇతర పరికరాల్లో వారి సౌలభ్యం మేరకు www.bharatparv2021.com వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వడం ద్వారా, ఈ ‘భారత్ పర్వ్-2021’ ఉత్సవాన్ని తిలకించి, ఆనందించి, నిజమైన భారతదేశ స్ఫూర్తిని అనుభవించవచ్చు.

మరోవైపు, భారత దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిభింబించే విధంగా ‘భారత్ పర్వ్ 2021’ని నిర్వహించడానికి కేంద్ర సమాచార, ప్రసార, ప్రసార భారతి మంత్రిత్వ శాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. కోవిడ్ వల్ల ఏర్పడిన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది ఈ కార్యక్రమాన్ని వర్చ్యువల్ విధానంలో పర్యాటక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీనిలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వివిధ మంత్రిత్వశాఖల ప్రదర్శనల కోసం ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ‘భారత్ పర్వ్’లో ఆత్మ నిర్భర్ భారత్, ఏక్ భారత్ శ్రేష్ట భారత్ అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ రూపొందింది. సాంస్కృతిక వైవిధ్యాన్ని, జాతీయ సమైక్యతను ప్రోత్సహించడంలో ప్రసార భారతి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నది. ‘భారత్ పర్వ్’ వర్చువల్ ప్లాట్‌ఫాంపై ప్రసార భారతి తన స్టాల్‌ను ఏర్పాటు చేసింది దీనిలో ఏక్ భారత్ శ్రేష్ట భారత్ సాధన కోసం రూపొందించిన కొన్ని కార్యక్రమాల ముఖ్యాంశాలను ప్రసార భారతి ప్రదర్శిస్తుంది. ప్రచురణల విభాగం ‘భారత్ పర్వ్ 2021’లో భారత దేశ వారసత్వం, చరిత్ర, సాంస్కృతిక విలువల గొప్పదనాలను ప్రతిబింబించే విధంగా పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేసింది. గాంధేయ ఆలోచనలపై పుస్తకాలను ప్రచురిస్తున్న సంస్థలలో ముఖ్యమైన ప్రచురణల విభాగం మహాత్మాగాంధీ పుస్తకాలను ప్రదర్శిస్తుంది. సందర్శకులు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి ప్రసంగాల సంకలనాలతో పాటు బాల సాహిత్యం, స్వాతంత్ర్య ఉద్యమం, రాష్ట్రపతి భవన్ ప్రచురించిన పుస్తకాలను చూడడానికి అవకాశం కల్పించారు.

తన ప్రచురణలతో పాటూ ప్రచురణల విభాగం ప్రతినెలా ప్రచురిస్తున్న తన పుస్తకాలను ప్రదర్శించడంతో పాటు తన నాలుగు నెలవారీ పత్రికలైన యోజన, కురుక్షేత్ర, ఆజ్కల్, బాల్ భారతి, దాని వారపత్రిక ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌ను కూడా ప్రదర్శిస్తుంది. పబ్లికేషన్స్ డివిజన్ ప్రచురిస్తున్న ఈ పత్రికలు అభివృద్ధి, సమస్యలపై చర్చా వేదికగా పనిచేస్తాయి. జాతీయ స్థాయిలో భారత ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల వివరాలను పౌరులు, ఇతరులు తెలుసుకోవడానికి వీటిలో పొందుపరచడం జరుగుతోంది. జాతీయ దృక్పథాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయి. మహాత్మాగాంధీ 150వ వార్షికోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని బ్యూరో ఆఫ్ అవుట్ రీచ్ కమ్యూనికేషన్ ‘భారత్ పర్వ్’లో ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేస్తుంది. ‘స్వచ్ఛ భారత్, శశక్త్ భారత్, బాపు కే సప్నో కా భారత్’ అనే ఇతివృత్తానికి సంబంధించిన ప్రదర్శనకు సంబంధించి ఫోటోలు, వీడియోలు, యానిమేషన్, క్విజ్‌లు ఇందులో ఉంటాయి. ‘సంకల్ప్ సే సిధి తక్’ కింద భారత ప్రభుత్వం సాధించిన ప్రగతికి అద్దం పట్టే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సందేశాలతో ‘ఇండియా ఆఫ్ మై డ్రీమ్స్’ అనే అంశంపై వీడియో, మోషన్ యానిమేషన్ కూడా దీనిలో ఉంటాయి. ప్రదర్శనలో భాగంగా మహాత్మా గాంధీ జీవితంపై అరుదైన ప్రదర్శనలు, 50వ ఐఎఫ్ఎఫ్ఐ ఫోటోలు, చిన్న వీడియోలను ప్రదర్శిస్తారు.