జాతీయంనేరాలు .. ఘోరాలు

తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు

ఆగ్రా, మార్చి 4 (న్యూస్‌టైమ్): ప్రపంచ ప్రఖ్యాత ప్రేమసౌధం తాజ్​మహల్‌కు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన పోలీస్‌ అధికారులు తాజ్​మహల్‌ రెండు ద్వారాలను మూసివేసి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. చివరికి బాంబు బెదిరింపు కాల్‌ వట్టిదే అని పోలీసులు తేల్చారు. ప్రపంచ పర్యటక కేంద్రం ఆగ్రాలోని తాజ్​‌మహల్‌కు బాంబు బెదిరింపు కాల్‌ బూటకమని అని తేలింది. కంట్రోల్‌ రూమ్‌కు అందిన సమాచారం ఆధారంగా పోలీసులు తాజ్‌మహల్‌కు చేరుకుని తనిఖీలు చేపట్టారు. పర్యటకులను బయటకు పంపి బాంబు, డాగ్‌ స్క్వాడ్‌లతో విస్తృత తనిఖీలు చేశారు. ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు. దీంతో బాంబు బెదిరింపు కాల్‌ ఆకతాయిల పనిగా నిర్ధరించారు.

‘‘బాంబ స్క్వాడ్​ సహా ఇతర బృందాలు తాజ్​మహల్​ పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టాయి. ఎలాంటి అనుమానించ దగ్గ వస్తువులు దొరకలేదు. బాంబు సమాచారం ఇచ్చిన వ్యక్తిని త్వరలోనే పట్టుకుంటాం. 99% ఇది తప్పుడు సమాచారమే.’’ అని ఆగ్రా ఐజీ సతీశ్​ గణేశ్ మీడియాకు తెలిపారు. బాంబు బెదిరింపు నేపథ్యంలో తాజ్‌మహల్‌ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పూర్తిగా తనిఖీలు చేసిన తర్వాత తిరిగి సందర్శకులను అనుమతించారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో అత్యవసర సేవల నంబర్ 112కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తాజ్​మహల్​ లోపల బాంబు పెట్టినట్లు సదరు వ్యక్తి సమాచారమిచ్చాడు. అప్రమత్తమైన అధికారులు వెంటనే కేంద్ర పరిశ్రమల భద్రత దళం (సీఐఎస్​ఎఫ్​) సహా బాంబు, డాగ్​ స్వ్కాడ్​లతో మొత్తం తాజ్​మహల్​ పరిసర ప్రాంతాల్ని జల్లెడ పట్టారు.