న్యూఢిల్లీ, జనవరి 30 (న్యూస్‌టైమ్): కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ కోవిడ్ టీకాల పరిస్థితిని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య కార్యదర్శులు, నేషనల్ హెల్త్ మిషన్ ఎండీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమమైన కోవిడ్ టీకాల కార్యక్రమం జనవరి 16న ప్రధాని చేతులమీదుగా ప్రారంభం కావటం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల పనితీరును కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ప్రశంసించారు. అంతర్జాతీయ మైలురాళ్లను భారత్ ఎలా అధిగమించగలిగిందో ఆయన ఈ సందర్భంగా సోదాహరణంగా వివరించారు. మొదటి పది లక్షల టీకాల లక్ష్యాన్ని వేగంగా చేరుకోవటమే కాకుండా, ఆ తరువాత 20 లక్షలు, 30 లక్షల మైలురాళ్ళను సైతం సునాయాసంగా అధిగమించిందన్నారు. అనేక దేశాలకు 40-50 రోజులు పట్టినా, మనకు మాత్రం తక్కువ సమయమే పట్టిందన్నారు.
దేశవ్యాప్తంగా టీకాల కార్యక్రమాన్ని వేగవంతం చేయటానికి రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అనుసరించాల్సిన విధి విధానాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు దాదాపు 50% సైతం చేరుకొగా మిగిలిన రాష్ట్రాలు కూడా వేగం పుంజుకోవాలని కోరారు. టీకామందు తగినంత అందుబాటులో ఉందన్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. కో-విన్ వెబ్ సైట్‌లో తలెత్తిన కొద్దిపాటి సమస్యలు కూడా ఇప్పుడు పూర్తిగా పరిష్కృతమైనట్టు చెప్పారు. రాష్ట్రాలు, జిల్లాలు, తాలూకాలు సైతం సమస్యలను, ఎదురవుతునన్ సవాళ్లను ప్రస్తావించటం ద్వారా పరిష్కారానికి మార్గం సుగమం చేయాలన్నారు.
ఒక్కో శిబిరంలో టీకాల సంఖ్య బాగా పెంచటానికి అవకాసమున్నదని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులు రోజువారీ లబ్ధిదారుల సంఖ్యలో మార్పును విశ్లేషించి వాటిని పెంచటానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సౌకర్యాలున్నచోట ఒకే రోజు వివిధ శిబిరాలు ఏర్పాటు చేసే అవకాశాలను సైతం పరిశీలించాలన్నారు. దీనివలన సగటులు రోజుకు వేసే టీకాల సంఖ్య పెరుగుతుందని చెప్పారు. ఇటీవల ఆరోగ్య మంత్రిత్వశాఖ జారీ చేసిన లేఖను ప్రస్తావిస్తూ, మొదటి డోస్ తీసుకున్న తరువాత తాత్కాలిక డిజిటల్ సర్టిఫికెట్, రెండో విడత తీకా తీసుకున్న తరువాత ఫైనల్ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆరోగ్య కార్యదర్శి ఈ సందర్భంగా గుర్తు చేసారు. టీకా వేయించుకున్న ప్రతి వ్యక్తీ, శిబిరం నుంచి బైటికి వెళ్ళేముందు కచ్చితంగా సర్టిఫికెట్ అందుకునేట్టు చూడాలని చెప్పారు. లబ్ధిదారు అర్హతను, గుర్తింపును ధ్రువపరచుకోవటం చాలా ముఖ్యమన్నారు.
ప్రాధాన్యతా క్రమంలో అందాల్సిన వాళ్లకు ముందుగా అందాలంటే ఈ జాగ్రత్త తప్పని సరి అని చెప్పారు. ఆధార్ వలన సరైన గుర్తింపు సాధ్యం కాబట్టి దాన్నే తనిఖీకి వాడుకోవటం మంచిదని సలహా ఇచ్చారు. కో-విన్ సాఫ్ట్ వేర్ కూడా ఆధార్ సమాచారాన్ని సులభంగా గుర్తిస్తుందని చెప్పారు. సకాలంలో సమాచారాన్ని అందించటం, సరిపోల్చటం కూడా ముఖ్యమని ఈ సమావేశంలో చెప్పారు. గత రెండు వారాల్లో టీకాల కార్యక్రమానికి ఒక స్థిరత్వం లభించినందున కో-విన్ యాప్‌లో సమాచారాన్ని ఒకసారి సరిపోల్చుకోవాలన్నారు. దీనివలన అందాల్సిన వారందరికీ టీకా అందిందీ లేనిదీ తెలుస్తుందన్నారు.
ముందుగానే చెప్పినట్టుగా కోవిడ్ యోధులందరికీ ఫిబ్రవరి 1 నుంచి టీకాలు వేస్తారని మరోమారు గుర్తు చేశారు. ఈ దశ కూడా సాఫీగా సాగటానికి అవసరమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ సమీక్షలో భాగంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అందించిన సమాచారం మీద సమగ్రమైన చర్చ జరిగింది.
మరోవైపు, దేశవ్యాప్తంగా కోవిడ్ టీకాలు వేయించుకున్న ఆరోగ్య సిబ్బంది సంఖ్య 37 లక్షలు దాటింది. ఈ సాయంత్రం 7 గంటల వరకు 37,06,157 మంది టీకాలు వేయించుకున్నట్టు తాత్కాలిక నివేదిక చెబుతోంది. ఇప్పటివరకు మొత్తం 68,830 శిబిరాలు నిర్వహించగా నేడు 15వ రోజు సాయంత్రం 7 వరకు 5,143 శిబిరాలు జరిగాయి. రాత్రి పొద్దుపోయాక తుది నివేదిక అందుతుంది. పది లక్షల లక్ష్యం చేరుకోవటంలోనే కాకుండా ఆ తరువాత 20, 30 లక్షల లక్ష్యాలను సైతం భారతదేశం చాలా వేగంగా చేరుకుంది. టీకాల కార్యక్రమం చేపట్టిన అనేక దేశాలు ఈ లక్ష్యాలు చేరుకోవటానికి కూడా 40-45 రోజులు పట్టాయి.