న్యూస్ప్రాంతీయంవిశాఖపట్నంసేవాఫదంస్థానికం

చిన్ననాటి మిత్రునికి రూ.25 వేల ఆర్థిక సాయం

నర్సీపట్నం,కోస్తాటైమ్స్,(అక్టోబర్ 17) : చిన్ననాటి నుండి తమతో చదువుకుని, ఆర్థికంగా చితికిపోయిన తమ సహచరునికి నర్సీపట్నం కళాశాలలో 1976- 79 ఇంటర్మీడియట్ పూర్వ విద్యార్థుల అసోసియేషన్ సభ్యులు రూ.25 వేల ఆర్థిక సాయం అందించారు. ఒకటవ తరగతి నుండి డిగ్రీ వరకు తమతో చదువుకొన్న తిరుమలనేడి రామనారాయణ కుటుంబ సమస్యల నేపథ్యంలో ఏలూరులో స్థిరపడ్డారు. వ్యాపారంలో నష్టపోయి ఆర్థికంగా చిదిగిపోయిన ఆయన పరిస్థితిని గమనించిన స్నేహితులు మంగళవారం ఆయనకు ఆర్థిక సాయం అందించారు.ఈ సందర్భంగా 1976-79 ఇంటర్మీడియట్ పూర్వ విద్యార్థుల అసోసియేషన్ వ్యవస్థాపకులు చింతకాయల సన్యాసి పాత్రుడు మాట్లాడుతూ,రెండు సంవత్సరాల క్రిందట పూర్వ విద్యార్థులందరూ కలిసి ఒక అసోసియేషన్ గా ఏర్పడ్డామని, అందరూ దాదాపుగా స్థిరపడిన వారే కనుక ప్రతినెలా కొంత మొత్తాన్ని నిధిగా ఏర్పాటు చేసుకున్నామని,ఆ నిధి ద్వారా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న కుటుంబాలను ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

మా స్నేహితుడైన తిరుమల నేడి రామనారాయణ మంచి కళాకారునిగా , క్రీడాకారునిగా, ఆధ్యాత్మిక గీతాల గాయకునిగా అందరికీ సుపరిచితుడన్నారు.నర్సీపట్నం షిరిడి సాయి ఆలయంలో లక్ష దీపోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఆయన ఎంతో కృషి చేశారన్నారు. అటువంటి వ్యక్తి ఆర్థికంగా చితికిపోవడంతో అసోసియేషన్ తరపున ఆయనకు ఆర్థిక సాయం అందించామన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు కర్రి రాంగోపాల్,జీకే ఆర్ కుమార్ బాబు,పిల్లా వెంకటేశ్వరరావు,టి.సత్యం నాయుడు,ఎస్ ప్రేమాకర్ తదితరులు పాల్గొన్నారు…