తెలంగాణ

రాజ్యాంగ స్ఫూర్తితో పాలన: పోచారం

హైదరాబాద్, జనవరి 26 (న్యూస్‌టైమ్): భారతదేశ 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శాసనసభ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యావత్ దేశ ప్రజలకు భారతదేశ 72వ గణతంత్ర దినోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘130 కోట్ల మంది భారతీయలు కుల మత, ప్రాంతానికి సంబంధ లేకుండా కలిసి జరుపుకొనే పండుగ ఇది. దేశంలో రాజ్యాంగ స్పూర్తితో పరిపాలన సాగుతుంది. దేశం కొన్ని రంగాలలో అభివృద్ధి పధంలో కొనసాగుతోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనుగొన్న శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు. తెలంగాణకు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కరోనా వ్యాక్సిన్ను కనుగొనడం తెలంగాణ గడ్డకు గర్వకారణం. కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిలో 60 శాతం తెలంగాణ రాష్ట్రం నుంచి జరుగుతుంది. కరోనా కట్టడికి తెలంగాణ రాష్ట్రం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం. కరోన మరణాలు దేశ సగటు కంటే తక్కువగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. అన్నం పెట్టేది రైతన్న, దేశాన్ని కాపాడేది జవాన్. అందుకే జై జవాన్-జై కిసాన్ అన్నారు. వారి సేవలు గొప్పవి. మనమందరం కలిసి రైతులను కాపాడుకోవాలి. రాష్ట్ర ప్రగతికి, రైతుల ప్రగతికి మనమందరం పునరంకీతం కావాలి.’’ అని పిలుపునిచ్చారు.

‘‘ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగినప్పుడే అది అద్భుతమైన పరిపాలన. పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ఉన్నది. గతంలో తెలంగాణ కరువు నేల. నేడు సస్యశ్యామలం అయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో సాగు విస్తీర్ణం 35 లక్షల ఎకరాల నుండి 1.10 కోట్ల ఎకరాలకు పెరిగింది.పండించిన పంటలకు మద్దతు ధర, రైతు బందు అందుతున్నాయి. స్వాతంత్ర్య ఫలాలు దేశ ప్రజలందరికీ అందాలి. అప్పుడే దేశానికి నిజమైన గణతంత్ర దినోత్సవం.’’ అని అన్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మండలి చీఫ్ విప్ బోడకంటి వెంకటేశ్వర్లు, పలువురు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, లెజిస్లేటివ్ సెక్రటరీ డాక్టర్ వి. నరసింహాచార్యులు, శాసనసభ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.