జాతీయం

చికిత్సలో ఉన్న కరోనా రోగులు 1.92 లక్షలకు తగ్గుదల

న్యూఢిల్లీ, జనవరి 22 (న్యూస్‌టైమ్): భారతదేశంలో చికిత్సపొందుతున్నకోవిడ్ బాధితుల సంఖ్య ఈరోజుకు 1,92,308కు చేరింది.మొత్తం పాజిటివ్ కేసులలో చికిత్సలో ఉన్నవారి వాటా ప్రస్తుతం మరింత తగ్గి 1.81% అయింది. కోలుకుంటున్నవారు పెరుగుతూ ఉండటం వలన చికిత్సలో ఉన్నవారి నికర సంఖ్య తగ్గుతూ వస్తోంది. గత 24 గంటలలో నికరంగా 4,893 కేసుల తగ్గుదల నమోదైంది. చికిత్సపొందుతూ ఉన్నవారు జాతీయ స్థాయిలో తగ్గుదల బాటలో సాగుతున్న తీరును ప్రతిబింబిస్తూ 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రతి పది లక్షల జనాభాలో జాతీయ సగటు కంటే తక్కువ కేసులున్నాయి. దేశంలో ప్రతి పది లక్షల జనాభాలో కేసుల సంఖ్య 7,689. దేశంలో ఇప్పుడు చికిత్సలో ఉన్నవారిలో దాదాపు 73% మంది కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్నాటక, పశ్చిమ బెంగాల్ అనే ఐదు రాష్ట్రాలలోనే ఉన్నారు.

2021 జనవరి 21 ఉదయం 7 గంటలకు మొత్తం 8,06,484 మంది కోవిడ్ టీకా వేయించుకున్నారు. కాగా, గత 24 గంటలలో 1,31,649 మంది 2398 శిబిరాలలో టీకాలు తీసుకున్నారు. ఇప్పటిదాకా మొత్తం 14,118 శిబిరాలు నిర్వహించారు. గడిచిన 24 గంటలలో 19,965 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కోలుకున్నవారు 1,02,65,706 మంది. అంటే, కోలుకున్నవారి శాతం 96.75%గా నమోదైంది. కొత్తగా కోలుకున్నవారిలో 87.06% మంది కేవలం 10 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారున్నారు. కేరళలో అత్యధికంగా ఒక్క రోజులో 7,364 మంది కోలుకోగా మహారాష్ట్రలో 4,589 మంది కోలుకున్నారు.

కొత్తగా నిర్థారణ అయిన కేసులలో 83.84% మంది 8 రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలకు చెందిన వారున్నారు. కేరళలో అత్యధికంగా 6,815 కేసులు రాగా మహారాష్టలో 3,015, చత్తీస్‌గఢ్‌లో 594 నమోదయ్యాయి. గత 24 గంటలలో 151 మంది కోవిడ్ బాధితులు మరణించగా, 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 83.44% మంది మరణించారు. మహారాష్ట్రలో 59 మంది, కేరళలో 18 మంది, చత్తీస్‌గఢ్‌లో 10 మంది చనిపోయారు. 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రతి 10 లక్షల జనాభాలో మరణాలు జాతీయ సగటు కంటే ఎక్కువ నమోదయ్యాయి. భారత్‌లో ప్రతి పది లక్షల్లో మరణాలు 11 కాగా శాతం పరంగా 1.44%. మరోవైపు 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రతి పది లక్షల జనాభాలో మరణాలు జాతీయ సగటు కంటే తక్కువ నమోదయ్యాయి.