జాతీయం

‘మాస్టర్‌’ డ్యాన్స్‌తో దుమ్మురేపిన క్రికెటర్లు

అహ్మదాబాద్‌, ఫిబ్రవరి 22 (న్యూస్‌టైమ్): టీమిండియా ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా విజయం సాధించడంలో అశ్విన్‌ కీలకపాత్ర పోషించాడు. అయితే ఆనందాన్ని అతను ఇంకా కొనసాగిస్తున్నట్లుగా తాజాగా రిలీజ్‌ చేసిన వీడియో ద్వారా తెలుస్తుంది. ఇళయదళపతి విజయ్‌ ‘మాస్టర్’ సినిమా తమిళనాట ఎంత ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాలో మాస్టర్‌ టైటిల్‌సాంగ్‌ ‘వాతీ కమింగ్‌’ పాట సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయింది. ఇదే పాటకు అశ్విన్‌ మాస్టర్‌ సిగ్నేచర్‌ స్టెప్‌ వేయగా హార్దిక్‌ పాండ్యా అతన్ని అనుకరించాడు. ఇక చివర్లో వీరిద్దరి మధ్యలో కుల్దీప్‌ వచ్చి ఇరగదీశాడు.

జిమ్‌ సెషన్‌లో వర్క్‌వుట్‌ చేస్తున్న సమయంలో సరదాగా డ్యాన్స్‌ చేసిన అశ్విన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో హార్దిక్‌, కుల్దీప్‌లను ట్యాగ్‌ చేస్తూ వాతీ షుడ్‌ బీ హ్యాపీ (అనిరుధ్‌, విజయ్‌ చూస్తే సంతోషిస్తారు) అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. కాగా మొటేరా వేదికగా జరగనున్న పింక్‌బాల్‌ టెస్టు పురస్కరించుకొని ఇప్పటికే ఇరు జట్లు అక్కడికి చేరుకున్నాయి. ఫిబ్రవరి 24 నుంచి ఇరు జట్ల మధ్య డే నైట్‌ టెస్టు సిరీస్‌ జరగనుంది. కాగా అశ్విన్‌ రెండో టెస్టులో సెంచరీతో పాటు బౌలింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 8 వికెట్లు పడగొట్టి ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేపట్టాడు. తద్వారా టీమిండియా 317 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకొని నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.