స్థానికం

పెట్రో ధరల పెరుగుదలకు నిరసనగా ధర్నా

విశాఖపట్నం, ఫిబ్రవరి 17 (న్యూస్‌టైమ్): స్థానిక బోస్ సెంటర్‌లో సీపీయం 43వ డివిజన్ కమిటీ ఆధ్వరంలో పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీయం డివిజన్ కార్యదర్శి యర్రా గోపి మాట్లాడుతూ దేశంలో సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజలను కేంద్ర ప్రభుత్వం బతకడమే కష్టం అనే విధంగా గత నెల రోజుల్లో వంట గ్యాస్ ధర రూ.200/- పెంచిదని, అలాగే పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు రూ.100/-లకు చేరుకుంటున్నాయని, దీనివల్ల నిత్యావసర ధరలు చుక్కలను అంటి పేద, మధ్యతరగతి ప్రజలు మూడు పూటలా తిండి తినడమే కష్టం అయ్యే పరిస్థితి ప్రస్తుతం ఈ దేశంలో నెలకొంటుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేవలం ఆదాని, అంబానీలకు ఈ దేశ సంపద ఎలా ధారాదత్తం చేయాలని చూస్తున్నారు తప్ప, దేశ సామాన్య ప్రజలకు ఎటువంటి న్యాయం చేయడం లేదని అన్నారు.

తక్షణమే పెరిగిన వంట గ్యాస్, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని సీపీయం డివిజన్ కార్యదర్శి యర్రా గోపి డిమాండ్ చేశారు. సామాన్యుడికి భారంగా తయారైన పెట్రోల్ డీజిల్, గ్యాస్ పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. మోదీ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలనకు ప్రజలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి తదుపరి ఎన్నికలలో ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.