స్థానికం

నీతి ఆయోగ్‌ భేటీలో విశాఖ ఉక్కు గుర్తుకురాలేదా?

అమరావతి, ఫిబ్రవరి 21 (న్యూస్‌టైమ్): ‘‘స్టీల్ ప్లాంట్‌పై వైజాగ్‌లో కాదు, ఢిల్లీలో బహిరంగసభ పెట్టే దమ్ము ఏ1, ఏ2లకు ఉందా? నీతి ఆయోగ్ సమావేశంలో స్టీల్ ప్లాంట్ అంశం ప్రధాని ముందు జగన్ రెడ్డి ఎందుకు ప్రస్తావించలేదు? కేంద్రాన్ని ప్రశ్నించలేక వైజాగ్‌లో బహిరంగ సభ పెట్టి తమ తప్పును ఒప్పుగా చేసుకునే పనిలో వైకాపా నేతలు నిమగ్నమయ్యారు. ఢిల్లీలో చేయాల్సిన పోరాటం గల్లీలో చేయడం ఏంటి? విజయసాయిరెడ్డి కేంద్రాన్ని పల్లెత్తు మాట అనకపోవడం ఊసరవెల్లి రాజకీయం కాదా? ప్రైవేటీకరణ కోసం వైసీపీ ఎంపీలు రాజీనామాలు ఎందుకు చేయటం లేదు?’’ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి జగన్‌ను సూటిగా ప్రశ్నించారు.

‘‘పాదయాత్ర చేసి విజయసాయిరెడ్డి సాధించింది శూన్యం. మీ పాదయాత్ర వల్ల ప్రజలకు ఒరిగింది ఏంటి? కోర్టు కేసులు ఉండటం వల్ల విశాఖ ఉక్కు గనులు ఇవ్వలేకపోతున్నామని విజయసాయిరెడ్డి చెప్పడం దుర్మార్గం. ఆలికి అన్నం పెట్టి ఊరికి ఉపకారం చేసినట్లు మీ అన్యాయులకు ఒబుళాపురం గనులు దోచిపెట్టి ఇప్పుడు మాత్రం కోర్టులో ఉన్నాయని మాట్లాడటం సిగ్గుచేటు. విశాఖలో సభ పెట్టింది ఉక్కు పరిశ్రమ కోసమా? చంద్రబాబు నాయుడుని తిట్టడానికా? అధికారంలో ఉన్నది ఎవరు? పోరాటం చేయాల్సింది ఎవరు? ప్రతిపక్షం మీద నెపం నెట్టి బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారు. పోస్కోతో రహస్య ఒప్పందాలు చేసింది మీరు. మీ కేసుల కోసం ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు.’’ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

‘‘కేంద్రాన్ని పల్లెత్తు మాట అనకుండా టీడీపీపై నోరు పారేసుకోవడం విజయసాయిరెడ్డి దివాళాకోరుతనం. ప్రజలకు సమాధానం చెప్పలేనప్పుడల్లా తెలుగుదేశం పార్టీపై నెపం నెట్టడం వైసీపీకి అజెండాగా మారింది. జగన్ నేలబారు రాజకీయాలకు వైజాగ్ ప్రజలు నవ్వుకుంటున్నారు. ఏ2 రెడ్డి పాదయాత్ర పేరుతో ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకున్నారు. అసలు బహిరంగ సభ ఎందుకు పెట్టారో ప్రజలకు అర్ధం కావడం లేదు. ప్రధాన మంత్రితో నిర్వహించిన నీతి ఆయోగ్ వర్చువల్ సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాల గురించి జగన్ రెడ్డి కనీసం ప్రస్తావించకపోవడం అత్యంత దుర్మార్గం. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడం కోసం ప్రజలు చేస్తున్న ఉద్యమం గురించి ప్రధాన మంత్రి వద్ద ఎందుకు స్పందించలేదు? 2020 సెప్టెంబర్‌లో వైసీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, బాలశౌరి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహా నలుగురు ఎంపీలు పోస్కో ప్రతినిధులతో కలిసి కేంద్ర ఉక్కు శాఖా మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్‌ను కలవడం వాస్తవం కాదా? ప్రైవేటీకరణకు చేయాల్సిన తంతు పూర్తి చేసి నేడు వైజాగ్ ప్రజల ముందు కళ్లబొల్లి కబుర్లు చెప్పడం హేయం.’’ అని అన్నారు.