రాష్ట్రీయం

‘దుష్టశక్తుల మాటలు విని పక్కదారి పట్టొద్దు’

అమరావతి, ఫిబ్రవరి 11 (న్యూస్‌టైమ్): వివక్ష, అవినీతి లేని పరిపాలన కోసం, ప్రభుత్వ పథకాలు ప్రజలకు నేరుగా అందాలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడాలేని విధంగా వలంటీర్‌ వ్యవస్థను తీసుకువచ్చామని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కొన్ని దుష్టశక్తులు వలంటీర్‌ వ్యవస్థకు తూట్లు పొడవాలని చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సేవా దృక్పథంతో పనిచేసే వారికి రూ.5 వేలు గౌరవ భృతి ఇస్తామని ముందే చెప్పామని మంత్రి బొత్స గుర్తుచేశారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు అందాలనే ఉద్దేశంతోనే వలంటీర్‌ వ్యవస్థ తీసుకొచ్చామన్నారు. సమాజంలో వలంటీర్లకు మంచి గౌరవం ఉందని దాన్ని పాడుచేసుకోవద్దని సూచించారు. ఎవరో చెప్పిన మాటలను విని.. పక్కదారి పట్టొద్దని వలంటీర్లను విజ్ఞప్తి చేశారు. సమాజంతా వలంటీర్లను ఆత్మీయులుగా చూస్తున్నారని గుర్తుచేశారు. పంచాయతీ ఎన్నికల తొలిదశ ఫలితాల్లో 82 శాతానికిపైగా వైయస్‌ఆర్‌ సీపీ మద్దతుదారులు విజయం సాధించారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తొలిదశలో జరిగిన ఎన్నికల్లో 2,637 పంచాయతీల్లో తమ పార్టీ మద్దతుదారులు గెలుపొందారని చెప్పారు.

వైయస్‌ఆర్‌ సీపీ మద్దతుదారులను గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు నోరు విప్పితే అబద్ధాలే మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చెప్పింది అంకెల గారడీతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని, ప్రజలు చాలా విజ్ఞులని అందకే టీడీపీని తగ్గిన గుణపాఠం చెప్పారన్నారు. కిందపడినా.. పైనే ఉన్నట్లు చంద్రబాబు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తీరుపై మండిపడ్డారు.