ప్రాంతీయం

జేసీ ఏమన్నారో తెలుసా?

తాడిపత్రి, ఏప్రిల్ 5 (న్యూస్‌టైమ్): జేసీ ప్రభాకర్ రెడ్డి ఏపీ రాజకీయాల్లో వివాదాస్పద నేతగా ఇప్పటికే చాలాసార్లు ముద్ర వేసుకున్నారు. ఇటీవల ఏపీ వ్యాప్తంగా మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడింది. 75 మున్సిపాలిటీల్లో మైదుకూరు, తాడిపత్రిల్లో వైసీపీ కంటే అత్యధిక స్థానాలు నెగ్గినా కేవలం తాడిపత్రిలో మాత్రమే మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీకి దక్కింది. అయితే, జేసీ బ్రదర్స్ గట్టిగా నిలబడడంతోనే ఇది సాధ్యమైందన్నది అందరికీ తెలిసిందే. అది కూడా టీడీపీ గెలుపు కాదని, కేవలం సేవ్ తాడిపత్రి అనే నినాదమే తమను గెలిపించిందని అంటూ జేసీ బ్రదర్స్ చెప్పుకొచ్చారు. అయితే, ఆ ఎన్నికల్లో తాను ఎలా గెలిచారు అన్నదానిపై సీక్రెట్ రివీల్ చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి.

ప్రస్తుతం ఆయనే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలోని సీపీఐ కాలనీలో తన అనుచరులతో కలిసి జేసీ ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. ఈ సమయంలో ప్రజలకు, జేసీకి మధ్య జరిగిన సంభాషణ సంచలనంగా మారింది. అక్కడికి చైర్మన్ వచ్చారు అని తెలియగానే తమ సమస్యలు ఏకరువు పెట్టేందుకు ప్రజలు వచ్చారు. తమకు రోడ్లు లేవని, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని మున్సిపల్‌ చైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన అక్కడున్న వారిపై ఆగ్రహంతో ఊగిపోయారు. వీర లెవెల్లో శివాలెత్తిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఎలక్షన్‌లో ఓటుకు 2 వేల రూపాయలు తీసుకుని టీడీపీకి ఓటేశారని, ఇప్పుడు పనులు చేయమని ఎలా అడుగుతారు? అంటూ మండిపడ్డారు. పనులు చేయమని తనను అడిగే హక్కు అక్కడి ప్రజలకు లేదన్నారు.

35వ వార్డు అజంనేయస్వామి మన్యంలో జరిగిన ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నీతి, నిజాయితీగా ఓటు వేసినప్పుడే ప్రజలకు నిలదీసే హక్కు ఉంటుందని జేసీ వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. ఓటును డబ్బులకు అమ్ముకుంటే సమస్యలపై నిలదీసే హక్కు కోల్పోతామని తాను మాట్లాడిన మాటలలో తప్పులేదని, స్వేచ్ఛగా, నిజాయితీగా ఓటు వేయండి ప్రజా ప్రతినిధిని సమస్యలప్తె కాలర్ పట్టుకుని నిలదీసే హక్కు ఉంటుందని ప్రజలకు చెప్పడం తప్పా? అంటూ తన వ్యాఖ్యలను ఆయన సమర్ధించుకుంటున్నారు. తాడిపత్రి చైర్మన్‌గా నెగ్గిన ఆయన్ను సమస్యలు తీర్చమని అడగడమే తప్పా అంటూ నిట్టూరుస్తున్నారు జనం. మహిళల ఎదుటే పురుషులను బూతులు తిడుతూ దుర్భాషలాడడంపై వారు మండిపడుతున్నారు. చైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడుతారా? అంటూ అక్కడున్న వారంతా బిత్తరపోయారు. ఎన్నికల ముందు సేవ్‌ తాడిపత్రి పేరుతో మొసలి కన్నీరు కార్చిన జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇప్పుడు చైర్మన్ పదవి రాగానే నోటికి పని చెబుతున్నారని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నాయి.