రాజకీయం

ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా?

కడప, జనవరి 23 (న్యూస్‌టైమ్): రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, కోవిడ్ వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఏమిటని, ప్రజల ప్రాణాలంటే ఆయనకు లెక్కలేదా? అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు.

గౌరవ రాజ్యాంగ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఒక రాజకీయ నాయకుడి డైరెక్షన్‌లో పనిచేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాల గురించి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పట్టడా? అని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలు, ఉద్యోగుల ప్రాణాలు ముఖ్యమన్నారు.

రాష్ట్ర ప్రజలందరినీ రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు వద్దని కోరుతున్నామన్నారు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మాత్రం ఏకపక్ష నిర్ణయాలతో రాష్ట్ర ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు సిద్ధమవుతున్నాడని మండిపడ్డారు.