రాష్ట్రీయం

పారదర్శకంగా ఎన్నికలు: ఎస్‌ఈసీ

కడప, జనవరి 30 (న్యూస్‌టైమ్): పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం కడప జిల్లాలో పర్యటించిన ఆయన పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై జిల్లా అధికారులతో ఇక్కడి కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నిర్వహణపై తీసుకున్న చర్యలను కలెక్టర్‌ హరికిరణ్‌ ఎస్‌ఈసీకి వివరించారు. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఎన్నికల ఏర్పాట్లను ప్రదర్శించారు.

అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్ఈసీ మాట్లాడుతూ వైఎస్‌ హయాంలో ఆర్థిక కార్యదర్శిగా పని చేశానాని తెలిపారు. దివంగత నేత వైఎస్ఆర్‌‌లో లౌకిక దృక్పథం ఉండేదని, వైఎస్‌ఆర్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయలేదన్నారు. ఇటీవల జరిగిన పరిణామాల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయని, వాటికీ తనే ప్రత్యక్ష సాక్షిననీ, దేనికీ భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసారు. సరైన సమయంలో ఎన్నికల నిర్వహణ జరగడం రాజ్యాంగ హక్కని, దాని ప్రకారమే ఎన్నికల నిర్వహణ జరుగుతోందన్నారు. వ్యవస్థలను గౌరవించకుండా మా వాళ్లు, మీ వాళ్లు అనడం సరికాదన్నారు.

‘‘2006లో 36 శాతమే ఏకగ్రీవమయ్యాయి. ఆ తర్వాత ఏకగ్రీవాలు తగ్గుముఖం పట్టాయి. బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడటం తగదు. వాటిని ప్రభావితం చేసే వారిపై షాడో టీమ్‌ల నిఘా ఉంటుంది. వెనుకబడిన వారిని ప్రోత్సహించడమే సమన్యాయం. ప్రతిపక్ష పార్టీలపై వేధింపులు ఉండవు. భిన్న సంస్కృతులకు తావులేదు. సమష్ఠిగా పని చేస్తాం. మీడియాను మించిన నిఘా మరొకటి లేదు. చురుకైన బాధ్యతను మీడియా తీసుకోవడం అభినందనీయం.’’ అని పేర్కొన్నారు. ఎన్నికల నియమ నిబంధనల ఉల్లంఘనపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఎస్ఈసీ తెలిపారు. ఏకగ్రీవాలన్నీ తప్పని చెప్పట్లేదని, అసాధారణంగా జరిగితేనే పరిశీలిస్తామని అన్నారు. అంతకుముందు ఎస్ఈసీని తెదేపా నేతలు కలిశారు. గత పరిషత్‌ ఎన్నికల సందర్భంగా జిల్లాలో చోటు చేసుకున్న అక్రమాలపై ఫిర్యాదు చేశారు. మరోసారి అలా జరగకుండా చర్యలు తీసుకోవాలని వారు ఎస్‌ఈసీని కోరారు. శుక్రవారం రాత్రి కడపకు చేరుకున్న ఎస్ఈసీ ఇవాళ ఉదయం ఒంటిమిట్ట కోదండరాముణ్ని దర్శించుకున్నారు. అక్కడి నుంచి కడపకు వచ్చిన ఆయన కలెక్టర్‌ హరికిరణ్, ఎస్పీ అన్బురాజన్‌ తదితర జిల్లా అధికారులతో ఎన్నికల ఏర్పాట్లు, భద్రత అంశాలపై సమీక్ష నిర్వహించారు.