రాజకీయం

‘ఏకగ్రీవాలను ప్రోత్సహించండి’

గ్రామాల అభివృద్ధికి అదే మార్గం: సజ్జల

అమరావతి, జనవరి 26 (న్యూస్‌టైమ్): వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక గ్రామస్థాయిలో సమూల మార్పులు వచ్చాయని, మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వ‌రాజ్యాన్ని సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చారని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రధాన విభాలు అన్ని సూక్షస్థాయిలో గ్రామాలకు చేరాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరగబోయే పంచాయతీ ఎన్నికలు చరిత్రాత్మకమైనవని భావిస్తున్నామన్నారు. గ్రామంలో ప్రజాప్రతినిధులు వచ్చే సమయానికి అవసరమైన అధికార యంత్రాంగం, ఉద్యోగులను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పూర్తిగా రెడీ చేసి పెట్టారని, ఇప్పుడు ఎన్నికయ్యే సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు ఆయా గ్రామాలు అభివృద్ధి చేసుకోవచ్చన్నారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘గ్రామ పంచాయతీ ఎన్నికలు పట్టుదలలకు, వర్గాలకు, కక్షలకు కారణం కావడం గతం నుంచి గమనిస్తున్నాం. ఆ పరిస్థితులను రూపుమాపి పార్టీ రహితంగా గ్రామ స్థాయి ఎన్నికలు జరుపుతున్నాం. ఎవరూ పట్టుదలలకు పోకుండా గ్రామ అభివృద్ధిపై దృష్టిపెట్టాలి. ఈ ఎన్నికలు ఎంత ప్రశాంతంగా జరిగితే తరువాత జరిగే కార్యక్రమాలు సులభంగా, శాంతియుతంగా జరుగుతాయి. పార్టీ రహితంగా జరిగే ఈ ఎన్నికల్లో వీలైనంత వరకు ఏకగ్రీవాలను ప్రోత్సహించండి. ఏకగ్రీవాలకు నగదు ప్రోత్సాహకం ముందు నుంచి ఉంది. 2013లో 15 వేల లోపు జనాభా ఉంటే రూ.7 లక్షలు, 15 వేల జనాభా పైబడి ఉంటే రూ.20 లక్షలు ఉండేది. దాన్ని మన ప్రభుత్వం నాలుగు కేటగిరిల కింద మార్పు చేసింది. 2 వేల జనాభా ఉంటే రూ.5 లక్షలు, 2–5 వేల జనాభా ఉంటే రూ.10 లక్షలు, 5–10 వేల లోపు ఉంటే రూ.15 లక్షలు, 10 వేల జనాభా పైన ఉంటే రూ.20 లక్షల నగదు ప్రోత్సాహకం ఆ పంచాయతీకి ఇవ్వడం జరుగుతుంది. హింసాత్మక సంఘటనలను రూపుమాపేందుకు సాధ్యమైనంత వరకు ఏకగ్రీవాలను జరిపే ప్రయత్నాలను చేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.’’ అని పేర్కొన్నారు.

‘‘ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలు, హింసలు ఉండకూడదని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పంచాయతీ చట్టంలో మార్పులు తెచ్చారు. చిన్న పంచాయతీలో కూడా ఎన్నికలకు లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. ఆస్తులు అమ్ముకోవడం, అన్నదమ్ముళ్ల మధ్య పంచాయతీలు, ఇలా ఎన్నో చూశాం. అలాంటి పరిస్థితులు ఉండకూడదని, ప్రలోభాలకు వీల్లేకుండా చట్టం చేశారు. ఒకవేళ ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే 3 ఏళ్ల జైలు శిక్ష, ఎన్నికైన తరువాత కూడా అనర్హత వేటు పడుతుంది. 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడం నిషేధం. గ్రామ అభివృద్ధి, అభ్యుదయం, సంక్షేమం ఈ మూడు లక్ష్యంగా గ్రామాల్లోని పెద్దలు చర్చించుకొని ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని కోరుతున్నాం. మిగతా పార్టీలను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.. మన బలాలు చూపించడానికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో చూపించుకుందాం. సర్పంచ్‌ ఎన్నికల్లో పట్టుదలకు పోతే గ్రామాల్లో శాంతియుత వాతావరణానికి భంగం కలుగుతుంది.’’ అని అన్నారు.

‘‘ఏకగ్రీవాలపై ఒక దురుద్దేశం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ మాటల్లో బయటపడుతుంది. ఎంపీటీసీ ఎన్నికల్లో అన్నీ ఏకగ్రీవాలు కావడంతోనే వాటిని పక్కనపెట్టారని మా పార్టీ భావిస్తుంది. ఏకగ్రీవాలకు వెళ్లాలని ఎస్‌ఈసీ చెప్పాలి కానీ, ఆ ప్రయత్నం చేయకపోగా ఏకగ్రీవాలు జరగకూడదు, ఏకగ్రీవాలు జరిగితే ఒక చూపుచూడాల్సి వస్తుందనే మాటల్లో వేరే దురుద్దేశం మాకు కనిపిస్తుంది. ఎస్‌ఈసీ ఉద్దేశాల వెనుక ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఉందని అనుమానం కలుగుతుంది.’’ అని వ్యాఖ్యానించారు.

‘‘పంచాయతీ ఎన్నికలను బేస్‌ చేసుకొని పచ్చని పల్లెల్లో కక్షలు రెచ్చగొట్టడం మంచిది కాదు. ఆ దుర్భుద్ధితో ప్రధాన ప్రతిపక్షం ఉందని, గట్టిగా నొక్కి చెబుతున్నాం. టీడీపీ అవకాశం దొరికితే కుట్రలకు రెడీగా ఉంటుంది. ఈ ఎన్నికల్లో కూడా నీతిమాలిన వ్యవహారాలకు దిగితే చట్టంలో చేసిన సవరణ కచ్చితంగా అమలు జరుగుతుంది. అది ఏ పార్టీ వారైనా సరే అనర్హత వేటు తప్పనిసరి అనే విషయం గుర్తుంచుకోవాలని అందరినీ హెచ్చరిస్తున్నాం. విలేజీల్లో ఉండే మేధావులు, విజ్ఞులు, పెద్దలు ప్రభుత్వ మాటను స్వీకరించి ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తారని భావిస్తున్నాం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.