ఆంధ్రప్రదేశ్

ఎస్‌ఈసీ పదవీ కాలం పొడిగింపు?

అమరావతి, జనవరి 30 (న్యూస్‌టైమ్): తమకు కొరకరాని కొయ్యలా మారిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పదవీకాలం పొడిగించకుండా అడ్డుకునేందుకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేపట్టిందా? అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు! 2016 ఏప్రిల్‌ ఒకటో తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ బాధ్యతలు స్వీకరించారు. నిబంధనల ప్రకారం ఆయన ఐదేళ్ల పాటు పదవిలో ఉండాలి. ఈ లెక్కన నిమ్మగడ్డ ఈ ఏడాది మార్చి 31న రిటైర్‌ అవుతారు. కానీ నిమ్మగడ్డ వ్యవహారం నచ్చని రాష్ట్ర ప్రభుత్వం మధ్యలోనే ఆయన్ను తొలగించి కనకరాజ్‌ను ఎస్‌ఈసీగా నియమించిన సంగతి తెలిసిందే.

దీనిపై నిమ్మగడ్డ న్యాయపోరాటం చేసి తిరిగి రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమితులయ్యారు. అయితే, ఆ న్యాయపోరాట సమయంలో రెండు నెలల పాటు నిమ్మగడ్డ పదవికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఈ రెండు నెలల కాలాన్ని తిరిగిపొందాలని నిమ్మగడ్డ భావిస్తున్నారు. తన సర్వీసును మార్చి 31తో ముగించకుండా మరో రెండు నెలల పాటు పొడిగించుకోవాలని చూస్తున్నారు. తన నిర్ణీత ఐదేళ్ల కాలపరమితిలో రెండు నెలల కాలాన్ని కోల్పయాను కాబట్టి ఆ మేరకు తన సర్వీసును మరో రెండు నెలలు పొడిగించుకోవాలని నిమ్మగడ్డ భావిస్తున్నారు. ఈ మేరకు తన ప్రతిపాదనలను రాష్ట్ర గవర్నర్‌ను పంపనున్నారని సమాచారం.

ఒక వేళ గవర్నర్‌ ద్వారా పనికాకుంటే కోర్టుకు వెళ్లి తన పదవీకాలాన్ని తెచ్చుకోవాలని భావిస్తున్నారు. అయితే, నిమ్మగడ్డను పదవి నుంచి తీసేసిన ఆ రెండు నెలల కాలానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం జీతం చెల్లించింది. ఈ కారణంగా ఆయనకు పదవీకాలం పొడగింపు సాధ్యం కాదు అని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. వచ్చేనెల 21వ తేదీతో పంచాయతీ ఎన్నికలు ముగుస్తాయి. వెంటనే ఈనెల 22వ తేదీన మున్సిపల్‌ ఎన్నికలకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ నోటిఫికేషన్‌ ఇస్తారని తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి నిఘా వర్గాలు సమాచారాన్ని కూడా అందించినట్లు తెలుస్తోంది. మున్సిపల్‌ ఎన్నికలు ముగిసే లోపు జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తారని తెలుస్తోంది.ఇలా వరుసగా ఎన్నికలు జరగుతూ ఉన్నందున తనను పదవిని కొనసాగించాలనే వాదనను కూడా ఎస్‌ఈసీ ముందుకు తీసుకురానున్నారు. ఈ వాదనను కూడా వినిపించి కోర్టు నుంచి పదవీకాలం పొడగింపు పొందాలని నిమ్మగడ్డ స్థిరంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మార్చి 31 తర్వాత ఒక్కరోజు కూడా నిమ్మగడ్డ పదవిలో కొనసాగకుండా చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేయనుందని సమాచారం.