రాష్ట్రీయం

త్వరలో రైతు భరోసా పోలీసు స్టేషన్లు

‘దిశ’ చట్టంపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష

అమరావతి, ఫిబ్రవరి 2 (న్యూస్‌టైమ్): త‌్వ‌ర‌లో రైతు భ‌రోసా పోలీసు స్టేష‌న్లు ఏర్పాటు చేస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. రైతులకు రక్షణగా పోలీసు వ్యవస్థ ఉండాలని ఆదేశించిన సీఎం రైతుల సమస్యలపై ప్రత్యేకంగా జిల్లాకో పోలీస్‌ స్టేషన్‌ ఆలోచన చేస్తున్నామని తెలిపారు. ‘దిశ’ చట్టం అమలుపై ముఖ్యమంత్రి వైయ‌స్‌‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మహిళల భద్రత, రక్షణ కోసం తీసుకువచ్చిన ఈ చట్టాన్ని పటిష్టం చేయడానికి తీసుకుంటున్న చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. 2019తో పోలిస్తే 2020లో మహిళలపై 7.5 శాతం నేరాలు తగ్గాయని అధికారులు నివేదించారు. రాష్ట్రంలో 12 లక్షల మంది దిశ యాప్‌ను డౌన్‌‌లోడ్‌ చేసుకున్నారని, దిశ దర్యాప్తు (పెట్రోలింగ్‌) వాహనంపై ప్రధాని ప్రశంసలు కురిపించారని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.

దిశ చట్టం కింద 471 కేసులకు సంబంధించి 7 రోజుల్లో, 1080కేసులకు సంబంధించి 15 రోజుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేశామని, అందులో 103 కేసుల్లో శిక్షలు ఖరారు చేశామని అధికారులు సీఎంకు వివరించారు. సైబర్‌ బుల్లీయింగ్‌పై 1531 కేసులు పెట్టామని, లైంగిక వేధింపులకు పాల్పడ్డ కేసుల్లో 823 కేసులు నమోదు చేశామని, గతంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డ 1,40,415 మంది డేటాను క్రోడీకరించామని వెల్లడించారు. సైబర్‌ మిత్ర ద్వారా 2750 పిటిషన్లు స్వీకరించామని, 374 ఎఫ్‌ఐఆర్‌లు రిజిస్టర్‌ చేశామని తెలిపారు. దిశ యాప్‌ను ఉపయోగించి రిపోర్టు చేసిన 799 ఘటనల్లో చర్యలు తీసుకున్నామని, 154 ఎఫ్‌ఐఆర్‌లు రిజిస్టర్‌ చేశామని పేర్కన్నారు. మహారాష్ట్ర, రాజస్థాన్, జార్ఖండ్, హిమాచల్‌ ప్రదేశ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు దిశ తరహా కార్యక్రమాలను చేపట్టాయని వెల్లడించారు. మహిళలు, బాలలపై నేరాలకు సంబంధించి 7 రోజుల్లో ఛార్జిషీటు దాఖలు చేయాలని ఆదేశించారు.

దర్యాప్తునకు అనుసరించే ప్రక్రియలో మౌలిక సదుపాయాల పరంగా సమస్యలు ఏమైనా ఉంటే వాటిపై పూర్తి స్థాయి దృష్టిపెట్టాలని సూచించారు. దిశ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని, అన్ని పోలీస్‌ స్టేషన్లలో మహిళా హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మొబైల్‌ ఫోన్ల సెక్యూరిటీ కోసం ప్రారంభించిన సైబర్‌ కియోస్క్‌ మంచి ఫలితాలు ఇస్తున్నాయని అధికారులు పేర్కొనగా, దాన్ని ఎలా వినియోగించుకోవాలన్న దానిపై సూచిక బోర్డులను కియోస్క్‌ వద్ద పెట్టాలని సూచించారు. రైల్వే స్టేషన్లు, బస్‌ స్టేషన్ల వద్దే కాకుండా విద్యా సంస్థల వద్ద కూడా కియోస్క్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కియోస్క్‌లకు ‘దిశ’ పేరు పెట్టాలని ఆదేశించారు.

తిరుపతి, విశాఖపట్నంలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. దిశ పోలీస్‌ స్టేషన్ల వద్ద, కాలేజీల వద్ద దిశ కార్యక్రమం కింద అందే సేవలు, రక్షణ, భద్రత అంశాలను పొందుపరుస్తూ హోర్డింగ్స్‌ పెట్టాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులకు, గ్రామాల్లో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లకు దిశ యాప్‌పై అవగాహన కల్పించాలని నిర్దేశించారు. గ్రామ సచివాలయాల్లో దిశ చట్టం కింద చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించి పోస్టర్లు, హోర్డింగ్స్‌ ఉండాలని ఆదేశించారు. దిశ ఎస్‌ఓఎస్‌ నుంచి కాల్‌ వచ్చిన వెంటనే నిర్దేశిత సమయంలోగా పోలీసులు అక్కడ ఉంటున్నారా? లేదా? అని సీఎం ప్రశ్నించగా సగటున 6 నిమిషాల్లోగా చేసుకుంటున్నామని పోలీసులు వెల్లడించారు. ఫిర్యాదు చేసిన మహిళలకు క్రమం తప్పకుండా కాల్స్‌ వెళ్లాలని, వారి సమస్య తీరిందా? లేదా? అన్న దానిపై తప్పని సరిగా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలని సీఎం సూచించారు. ఈ ఫాలో అప్‌ కార్యక్రమం క్రమం తప్పకుండా చేయాలని స్పష్టం చేశారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న సిబ్బందికి యూనిఫామ్స్‌ నిర్దేశించాలని ఆదేశించారు. ప్రతి రోజూ 2 గంటల పాటు కచ్చితంగా స్పందన కార్యక్రమం నిర్వహించాలని స్పష్టం చేశారు. రైతులకు రక్షణగా పోలీసు వ్యవస్థ ఉండాలని ఆదేశించిన సీఎం రైతుల సమస్యలపై ప్రత్యేకంగా జిల్లాకో పోలీస్‌ స్టేషన్‌ ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం తదితర వ్యవహారాల్లో మోసాలు జరిగితే రైతులకు అండగా నిల్చి, వారికి న్యాయం చేయడం కోసం ఈ వ్యవస్థ ఏర్పాటు చేయాలని యెచిస్తున్నట్లు సీఎం తెలిపారు. వ్యాపారుల నుంచి మోసాలకు గురి కాకుండా రైతుకు భద్రత కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో దిశ హెల్ప్‌ డెస్క్‌ తరహాలో రైతుల కోసం ఒక డెస్క్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ నూతన వ్యవస్థ ఎలా ఉండాలన్న దానిపై మేథోమథనం చేసి కార్యాచరణ రూపొందించాలని అధికారులను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశించారు.