రాష్ట్రీయం

ఏపీలో తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌

అమరావతి, ఫిబ్రవరి 9 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్‌లో తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. నిర్ణీత సమయం మేరకు మంగళవారం ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3.30 గంటల వరకు కొనసాగనుంది. విజయనగరం మినహా మిగిలిన 12 జిల్లాల పరిధిలో ఈ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తొలిసారిగా ‘నోటా’ను అందుబాటులోకి తెచ్చారు. పోలింగ్‌ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు జరగనుంది. కరోనా పాజిటివ్‌ బాధితులకు పీపీఈ కిట్లతో చివరిలో గంటసేపు అవకాశం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు.

తొలివిడతలో 3,249 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్లు జారీ చేయగా 525 చోట్ల సర్పంచి ఎన్నిక ఏకగ్రీవం అయ్యాయి. నెల్లూరు జిల్లా వెలిచెర్ల గ్రామంలో సర్పంచి పదవికి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో మిగిలిన 2,723 చోట్ల సర్పంచి, 20160 వార్డులకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ పర్యవేక్షణకి విజయవాడలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. సర్పంచ్ అభ్యర్థికి పింక్ బ్యాలెట్, వార్డు అభ్యర్థికి తెల్ల బ్యాలెట్‌ను కేటాయించారు. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి అనంతరం ఉపసర్పంచ్‌ ఎన్నిక నిర్వహించేందుకు ఎస్ఈసీ చర్యలు చేపట్టింది.

మొత్తానికి సర్పంచి స్థానాలకు 7,506 మంది పోటీ చేస్తున్నారు. 20,157 వార్డు సభ్యుల స్థానాలకు 43,601 మంది బరిలో ఉన్నారు. పోలింగ్‌కు 88,523 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. నోటిఫికేషన్‌ ఇచ్చిన 3,249 గ్రామ పంచాయతీల్లో 525 చోట్ల ఏకగ్రీవమయ్యాయి. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో నిలిపివేసిన ఏకగ్రీవాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సోమవారం సాయంత్రం తిరిగి అనుమతించారు. ఎన్నికలకు 29,732 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

వీటిలో 3,458 సమస్యాత్మకం, మరో 3,594 అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. 18,608 బ్యాలెట్‌ పెట్టెల్లో 8,503 మధ్య రకం, మరో 21,338 చిన్న పెట్టెలు ఉన్నాయి. పోలింగ్‌ సందర్భంగా 1,130 మంది ఎన్నికల అధికారులు, మరో 3,249 మంది స్టేజ్‌-2 అధికారులు, 1,432 మంది సహాయ ఎన్నికల అధికారులు, 33,533 మంది ప్రిసైడింగ్‌ అధికారులు, 44,392 మంది సిబ్బంది సేవలు వినియోగించనున్నారు. 519 మంది జోనల్‌ అధికారులు, పోలింగ్‌ సరళి పరిశీలించేందుకు 1,221 మంది పర్యవేక్షకులు, 3,047 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించారు.

కరోనా సోకిన వారు మైదాన ప్రాంతాల్లో మధ్యాహ్నం 2.30 నుంచి 3 వరకు, ఏజెన్సీ ప్రాంతాల్లో 12.30 నుంచి 1.30 గంటల వరకు ఓటు వేసేలా ఏర్పాట్లు చేశారు. సాధారణ ఓటర్లను థర్మల్‌ స్కానింగ్‌ చేసి సాధారణం కంటే శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే వారిని వెనక్కి పంపి చివరి గంటలో అనుమతిస్తారు. పోలింగ్‌ కేంద్రాల్లో సిబ్బందికి మాస్క్‌లు, చేతి తొడుగులు, శానిటైజర్‌ సిద్ధం చేశారు. కరోనా సోకిన వారు ఓటింగ్‌కి ఎక్కువ మంది వస్తే ఆ కేంద్రాల్లో సిబ్బందికి పీపీఈ కిట్లు సమకూర్చారు. ఓట్ల లెక్కింపు కోసం 14,535 మంది పర్యవేక్షకులు, మరో 37,750 మంది సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. ఓట్ల లెక్కింపు ప్రత్యక్ష పరిశీలనకు తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, పోలింగ్‌ కేంద్రాల్లో పరిస్థితులను తెలుసుకోవడానికి వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాట్లు చేశారు.

కాగా, 12 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్లలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహించారు. తొలిదశ పోలింగ్ జరిగే రెవెన్యూ డివిజన్లు శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ, అనకాపల్లి, కాకినాడ, పెద్దాపురం, నరసాపురం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, కావలి, చిత్తూరు, కదిరి, నంద్యాల, కర్నూలు, కడప, జమ్మలమడుగు, రాజంపేట. ఇక, ఎన్నికలు జరుగుతున్న మండలాల జాబితాలో ఎల్ఎన్ పేట, లావేరు, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం, కొత్తూరు, హిరమండలం, పాతపట్నం, మెళియాపుట్టి, అచ్యుతాపురం, అనకాపల్లి, చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు, కశింకోట, వి.మాడుగుల, మునగపాక, రాంబిల్లి, యలమంచిలి, బుచ్చయ్యపేట, చోడవరం, గొల్లప్రోలు, కాకినాడ రూరల్‌, కరప, పెదపూడి, పిఠాపురం, సామర్లకోట, తాళ్లరేవు, యు.కొత్తపల్లి, గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి, కోటనందూరు, పెద్దాపురం, ప్రత్తిపాడు, రంగంపేట, రౌతలపూడి, శంఖవరం, తొండంగి, తుని, ఏలేశ్వరం, ఆచంట, ఆకివీడు, భీమవరం, కాళ్ల, మొగల్తూరు, నర్సాపురం, పాలకోడేరు, పాలకొల్లు, పోడూరు, ఉండి, వీరవాసరం, యలమంచిలి, చందర్లపాడు, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కంచికచర్ల, కంకిపాడు, మైలవరం, నందిగామ, పెనమలూరు, పెనుగంచిప్రోలు, తోట్లవల్లూరు, వత్సవాయి, వీర్లపాడు, విజయవాడ, అమర్తలూరు, బాపట్ల, భట్టిప్రోలు, చేబ్రోలు, చెరుకుపల్లి, దుగ్గిరాల, కాకుమాను, కర్లపాలెం, కొల్లిపర, కొల్లూరు, నగరం, నిజాంపట్నం, పి.వి.పాలెం, పొన్నూరు, తెనాలి, రేపల్లె, టి.చుండూరు, వేమూరు, అద్దంకి, బల్లికురవ, చీమకుర్తి, చినగంజాం, చీరాల, ఇంకొల్లు, జె.పంగులూరు, కారంచేడు, కొరిసపాడు, కొత్తపట్నం, మార్టూరు, మద్దిపాడు, ఎస్‌.జి.పాడు, ఒంగోలు, పర్చూరు, ఎస్‌.మాగులూరు, ఎస్‌.ఎన్‌.పాడు, వేటపాలెం, టంగుటూరు, యద్దనపూడి, అల్లూరు, బోగోలు, దగదర్తి, దుత్తలూరు, జలదంకి, కలిగిరి, కావలి, కొండాపురం, వరికుంటపాడు, ఆళ్లగడ్డ, చాగలమర్రి, దొర్నిపాడు, రుద్రవరం, సిరివెళ్ల, ఉయ్యాలవాడ, గోస్పాడు, నంద్యాల, బండి ఆత్మకూరు, మహానంది, ఆత్మకూరు, వెలుగోడు, అమడగూరు, బుక్కపట్నం, గాండ్లపెంట, కదిరి, కొత్తచెరువు, ఎన్‌.పి కుంట, నల్లచెరువు, నల్లమాడ, ఓబులదేవరచెరువు, పుట్టపర్తి, తలుపుల, తనకల్లు, చాపాడు, మైదుకూరు, దువ్వూరు, ప్రొద్దుటూరు, రాజుపాలెం, ఖాజీపేట, బద్వేలు, అట్లూరు, బి.కోడూరు, గోపవరం, పోరుమామిళ్ల, ఎస్‌.ఎ.కె.ఎన్, కలసపాడు, బి.మఠం, బంగారుపాలెం, చిత్తూరు, జి.డి. నెల్లూరు, గుడిపాల, ఐరాల, కార్వేటినగరం, నగరి, నారాయణవనం, నిండ్ర, పాలసముద్రం, పెనుమూరు, పూతలపట్టు, పుత్తూరు, ఆర్‌.సి.పురం, ఎస్‌.ఆర్‌ పురం, తవనంపల్లి, వడమాలపేట, వెదురుకుప్పం, విజయపురం, యాదమర్రి ఉన్నాయి.