సిద్దిపేట, ఫిబ్రవరి 2 (న్యూస్‌టైమ్): సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో సకల సదుపాయాలతో ఉచిత డయాగ్నోస్టిక్ హబ్ కేంద్రాన్ని వైద్య ఆరోగ్య కమిషనర్ వాకాటి కరుణ, జిల్లా జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా శర్మతో కలిసి రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రారంభించారు. అంతకు ముందు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు.
అనంతరం డయాగ్నోస్టిక్ ద్వారా అందే సేవల తీరుతెన్నుల గురించి డయాగ్నోస్టిక్ డెలివరీ వర్క్ ఫ్లో గురించి వైద్య ఆరోగ్య కమిషనర్ వాకాటి కరుణ మంత్రి హరీశ్ రావుకు సవివరంగా వివరించారు. డయాగ్నోస్టిక్ హబ్‌లోని వైద్య పరికరాలు, 57 రకాల వైద్య పరీక్షల గురించి వైద్యాధికారులు మంత్రికి వివరించారు. ల్యాబ్ పరీక్షల నిమిత్తం వచ్చిన రోగులకు ల్యాబ్ రిపోర్టులను మంత్రి అందజేశారు. రోగుల సహాయకుల విశ్రాంతి గదిని ప్రారంభించారు. పేషెంట్స్ సహాయకుల, పేషెంట్స్ వేచి ఉండేందుకు షెడ్డును ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో తొలి డయాగ్నోస్టిక్ హబ్‌ను సిద్దిపేటలోనే ఏర్పాటు చేశామన్నారు. ఏ వ్యాధి నిర్ధారణ పరీక్షలైనా ఇక్కడే చేపడుతున్నట్లు వెల్లడించారు.