గౌతమ్ బుద్ధుడికి లభించని విముక్తి!

విశాఖపట్నం, ఫిబ్రవరి 2 (న్యూస్‌టైమ్): గాజువాక బీసీ రోడ్డు వాసులంతా ముద్దుగా పిలుచుకునే నీటి ఏనుగు (ఆ బొమ్మ అసలు పేరు మాత్రం ఖడ్గమృగం) పార్కుకు గాజువాక పరస రోజూ విముక్తి కలగలేదు. ఏవో కారణాలు చెప్పి పార్కు అభివృద్ధిని పక్కనపెడుతూ వస్తున్న అధికారులపై వత్తిడిచేసైనా కనీసం పరస నాటికైనా ఆధునీకరించిన ఉద్యానవనాన్ని అందుబాటులోకి తీసుకువస్తారని ఆశించినప్పటికీ ఆ ఆశా నెరవేరలేదు.

ఇది ఎవరి చేతకానితనమో తెలియదు గానీ, పక్కనున్న ఎన్టీఆర్ గార్డెన్‌లో ఉన్న పచ్చదనం కూడా ‘నీటి ఏనుగు’ పార్కులో లేకపోవడం దారుణమనే చెప్పాలి. నాటి ఆధ్యాత్మిక గురువులలో ఒకరైన, బౌద్ధ ధర్మానికి మూల కారకులైన, బౌద్ధులందరిచే మహా బుద్ధుడిగా గుర్తింపుపొందిన సిద్ధార్థ గౌతముడు బొమ్మను ఈ పార్కులో పెట్టి నెలలు గడుస్తున్నా నేటికీ కనీసం ముసుగు తీయడానికి కూడా నోచుకోలేదు. గౌతముడిని శాఖ్యముని అని కూడా పిలుస్తారు. శాఖ్య వంశస్తులు వ్యవసాయంతోపాటు పరిపాలన చేసేవారు. ఆయన జీవిత సంఘటనలు, బోధలు, భిక్షువుల నడవడికలు మొదలగునవి అన్ని ఆయన మరణం తరువాత సంఘంచే తరతరాలుగా పారాయణం చేసినట్లు చరిత్రలో ఉంది. మొదట నోటి మాటగా బోధించినా దాదాపు నాలుగు వందల సంవత్సరాల తరువాత ‘త్రిపీటక’ అనే పేరుతో మూడు పీఠికలుగా విభజితమై భద్రపరిచారు.

అలాంటి బుద్దుడి బొమ్మను ఏర్పాటుచేసిన పార్కును ప్రారంభించకుండా వదిలేయడంతో చూపరులకు మనస్తాపం కలుగుతోంది. ఈ పార్కును ప్రారంభించిన మొదట్లో పచ్చదనం తొనికిసలాడుతూ కనిపించింది. అలాంటి పార్కు నిర్వహణ లోపంతో చివరికి మట్టిదిబ్బలా దర్శనమిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే పిల్లలు ఆడుకోవడానికి ఉపయోగపడుతుందనుకున్న ఉద్యానవనం కాస్త చివరికి రాత్రిపూట అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

పార్కులో ల్యాండ్ స్కేపింగ్ చేయించి, రోజువారీ నిర్వహణ చేపడితే బీసీ రోడ్డుకే ల్యాండ్ మార్క్‌గా మారే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు ఎందుకో ఆ పనిచేపట్టడంలేదు. ఒకపక్క నిధుల కొరత లేదంటూనే పార్కు నిర్వహణను గాలికి వదిలేసిన జీవీఎంసీ సామాజిక కార్యక్రమాలకు ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటో అంతుచిక్కడం లేదు. ఇలాంటి పార్కుల నిర్వహణ బాధ్యతలు స్వీకరించేందుకు ఆహ్వానిస్తే దాతలు ఎంతో మంది ముందుకు వస్తారు. కానీ, ఆ పనీ చేయడానికి అధికారులు గాని, ప్రజాప్రతినిధులు గానీ సాహసించడంలేదు. అలా చేస్తే తమ ప్రాధాన్యత తగ్గిపోతుందని భయపడుతున్నారో ఏమో? ఈ పార్క్ పక్క నుంచి వేసిన ‘రాజీవ్ మార్గ్’ రోడ్డును నిర్వహిస్తున్న స్టీల్‌ప్లాంట్ వాళ్లకు అప్పగించినా చేయడానికి వాళ్లు ముందుకు వచ్చే అవకాశం ఉంది.

కేవలం నగరపాలక సంస్థ నిర్వహణ లోపమే దీనికి కారణమంటే ఏ అధికారీ ఒప్పుకోరు. నియోజకవర్గానికి కొత్త ఎమ్మెల్యే వచ్చాక అయినా పార్కు దశ తిరుగుతుందనుకుంటే అదీ లేదు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పనిచేస్తున్నా స్థానికంగా ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి వనరులను మెరుగుపర్చడంలో మాత్రం విఫలమయ్యారనే చెప్పాలి. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటయిన పార్కును ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్న ప్రచారం ఊపందుకోకముందే ఎమ్మెల్యే మేల్కొని ఈ పార్కును ప్రజలకు అందుబాటులోకి తెచ్చే బావుంటుంది.

Latest News