ప్రాంతీయం

కోవిడ్ కేంద్రాల గుర్తింపు

ఒంగోలు, ఏప్రిల్ 5 (న్యూస్‌టైమ్): కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో గతంలో మాదిరిగా కోవిడ్ సెంటర్ల గుర్తింపు కార్యక్రమాన్ని తక్షణమే చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్ ఆదేశించారు. కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ అధికారులతో సోమవారం స్థానిక ప్రకాశం భవనంలో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అరికట్టడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. టీకా కార్యక్రమం, కోవిడ్ టెస్టింగ్, ట్రేసింగ్, కంటైన్‌మెంట్ ఆపరేషన్, హోమ్ క్వారంటైన్, హోం ఐసోలేషన్ సమర్థంగా నిర్వహించాలన్నారు.

నిర్లక్ష్యం వహించకుండా వైరస్ అరికట్టడానికి ప్రణాళికాబద్ధంగా అధికారులు పనిచేయాలన్నారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చే వారిని గుర్తించి హోం ఐసోలేషన్‌లో ఉంచాలన్నారు. మండల స్థాయిలో టాస్క్‌ఫోర్స్ కమిటీలు చురుకుగా పనిచేయాలన్నారు. గ్రామ స్థాయిలో సచివాలయ సిబ్బంది టాస్క్‌ఫోర్స్ కమిటీలుగా వ్యవహరించాలన్నారు. వైరస్ సోకిన కేసులు పెరుగుతున్నందున జిల్లాలో ప్రాధమికంగా 1000 బెడ్లు సిద్ధం చెయ్యాలని అధికారులను ఆయన ఆదేశించారు. వైద్య విధాన పరిషత్ వైద్య శాలలను కోవిడ్ సెంటర్లుగా గుర్తించాలన్నారు.

కోవిడ్ కేర్ సెంటర్ల ఎంపిక ప్రక్రియ ఆయా నియోజకవర్గాలకు నియమితులైన వెల్ఫేర్ డెవలప్‌మెంట్ మానిటరింగ్ ప్రత్యేక అధికారులదేనన్నారు. కోవిడ్ నిబంధనల అమలు ప్రక్రియ సంబంధిత అధికారులు పర్యవేక్షించాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో 552 కేసులు నమోదుకాగా, 315 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారని మిగిలిన వారు వైద్యశాలల్లో వైద్యం పొందుతున్నారని ఆయన చెప్పారు. వైరస్ వ్యాప్తిని వేగంగా అరికట్టడానికి గతంలో నిర్వహించిన పద్ధతులనే కఠినంగా అమలు చేయాలన్నారు.

ప్రతి పి.హెచ్.సి. పరిధిలోని ఒక సచివాలయంలో కోవిడ్ టీకా తప్పనిసరిగా వేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. హోమ్ ఐసోలేషన్, హోం క్వారంటైన్ పక్కాగా అమలు చెయ్యాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్లు జె.వెంకట మురళి (ఆర్‌బి అండ్ ఆర్), టి.ఎస్.చేతన్ (సచివాలయాలు, అభివృద్ధి), కె.కృష్ణ వేణి (ఆసరా, సంక్షేమం), డి.ఆర్.ఓ. కె.వినాయకం, వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి రత్నావళి, డి.సి.హెచ్.ఎస్. డాక్టర్ ఉషా రాణి, టాస్క్‌ఫోర్స్‌లోని జిల్లా అధికారులు, ఉప కలెక్టర్లు, వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.