రాజకీయం

చంద్రబాబు ఓడితే ప్రజాస్వామ్యం ఓటమా?

అమరావతి, ఫిబ్రవరి 18 (న్యూస్‌టైమ్): ఎన్నికల్లో చంద్రబాబు ఓడితే ప్రజాస్వామ్యం ఓటమి అంటారని, వైయస్‌ఆర్‌సీపీ గెలిస్తే అక్రమం అంటూ గగ్గోలు పెడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అబద్ధాలే చెబుతారన్నారు. ఇప్పుడు కొత్తగా చంద్రబాబులో నిస్పృహ కనిపిస్తుందన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన నడుస్తోందని, గడప వద్దకే సంక్షేమ ఫలాలు అందజేస్తున్నామని చెప్పారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు.

‘‘మా పాలనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారనడానికి పంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో ఆదరణ పెరిగింది. పంచాయతీ ఎన్నికల్లో అదే రుజువైంది. ఏపీలో సంక్షేమ పాలన నడుస్తోంది. వైయస్‌ జగన్‌ నాయకత్వాన్ని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు.  గడప వద్దకే సంక్షేమ ఫలాలు అందిజేస్తున్నాం. చంద్రబాబు తన జాగీరు అనుకున్న కుప్పంలో ఆయన్ను చిత్తుగా ఓడించారు. చంద్రబాబును పూర్తిగా వెలివేశారు. చరిత్రహీనుడిగా మిగిలి సంధీ ప్రేలాపనలు చేస్తున్నారు. చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నారు. ఇప్పుడు వైయస్‌ఆర్‌సీపీ పరిపాలన సాగిస్తోంది. ప్రతి మాట వైయస్‌ జగన్‌ బాధ్యతతో మాట్లాడుతున్నారు. ఎలాంటి అపోహాలకు తావులేకుండా హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చుతున్నారు. కానీ చంద్రబాబు అడ్డగోలుగా హామీలు ఇవ్వడం, మోసం చేయడం అలవాటు.’’ అని వ్యాఖ్యానించారు.

‘‘చంద్రబాబుకు ఓ శాపం ఉందని మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అన్నారు. ఆయన నిజం చెబితే తల వెయ్యి ముక్కలు అవుతుందని చంద్రబాబును ఉద్దేశించి వైయస్‌ఆర్‌ అన్న మాటలు గుర్తున్నాయి. చంద్రబాబు ఓడిన అబద్ధాలే, గెలిచినా అబద్ధాలే. ఇప్పుడు అదనంగా వచ్చి చేరింది ఏంటంటే ఆయనకు వయసు పైబడింది. ఆయన కుమారుడు ఎమ్మెల్యేగా కూడా గెలిచే అవకాశం లేకపోవడం, భవిష్యత్‌లో లోకేష్‌ టీడీపీని నడుపుతారన్న నమ్మకం లేక ఫ్రెస్టేషన్‌లోకి వెళ్లారు. వైయస్‌ జగన్‌ చిన్న వయసులోనే సొంతంగా పార్టీ పెట్టడం, అధికారంలోకి రావడంతో చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు కొత్తగా చంద్రబాబులో నిస్పృహ కనిపిస్తోంది. పల్లెల్లో సాధారణంగా గొడవలు జరిగితే ఎలాంటి హేతుబద్ధత లేకుండా తిట్లతో మొదలుపెడతారు కదా అలాగే చంద్రబాబు తీరు ఉంది. ఇవాళ చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ నిన్నటి ఫలితాల్లో 7 గంటల వరకు టీడీపీ మద్దతుదారులు అధికంగా గెలిచారని, ఆ తరువాత ఫలితాలు మారిపోయాయని చెప్పారు. అంతా కళ్లముందు కళ్లకు కట్టినట్లు అన్ని టీవీ చానల్స్‌లో చూపించారు.చంద్రబాబు చెప్పినంత హంస, అక్రమాలు ఎక్కడున్నాయో తెలియడం లేదు. రౌడీలు, ఉన్మాదులు, రాజారెడ్డి రాజ్యాంగం అంటూ ఇష్టం వచ్చినట్లు చంద్రబాబు మాట్లాడారు.’’ అని రామకృష్ణారెడ్డి అన్నారు.

‘‘కుప్పంలో ఓటమి ప్రజాస్వామ్యానిదంటా? మొన్న ఎన్నికల్లో చంద్రబాబు గెలిచి ఇంట్లో ఉన్నారా? ప్రజాస్వామ్యం గెలిచిందా? ఎందుకు గెలవలేకపోయామని సంజాయిషి ఇవ్వాల్సింది పోయి ఏదో చెబుతున్నారు. కుప్పం ప్రజలు ఓట్లు వేయలేదా? వైయస్‌ఆర్‌సీపీ గెలిస్తే అక్రమాలు, ప్రజాస్వామ్య ఓటమి, ఆయన గెలిస్తే ప్రజాస్వామ్య విజయమా? కొత్తగా రాష్ట్రంలో ఓ స్టేట్‌మెంట్‌ ఇస్తే పోలా? మేం అధికారంలోకి వస్తేనే ప్రజాస్వామ్యం విజయమని చంద్రబాబు ప్రకటించమని చెప్పండి. 70 ఏళ్ల వృద్ధ నాయకుడు ఉన్న టీడీపీ దుకాణాన్ని మూసుకోవడం మేలు. చంద్రబాబుకు సిగ్గు, ఎగ్గు ఉండదు. మొన్నటి దాకా అధికార పార్టీగా ఉన్న టీడీపీ ఇవాళ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు వేయడమే విజయంగా భావించడం సిగ్గుగా లేదు.’’ అని పేర్కొన్నారు.

‘‘ఏకగ్రీవాలకు సంబంధించి ప్రభుత్వం చెప్పినా, అంతకుముందు పారితోషాకాలు ఇచ్చి ఏకగ్రీవాలు చేశారు. గ్రామస్థాయిలో ఏకగ్రీవాలు చేయాల్సిన పని ప్రభుత్వానిదే. కానీ చంద్రబాబు, ఎన్నికల కమిషనర్‌ కలిసి ఏదో కుట్ర జరిగిందంటూ గాలిలో కత్తి దూసి గగ్గోలు పెట్టారు. కానీ ప్రజల్లో చైతన్యం కలగడం వల్ల 16 శాతం ఏకగ్రీవాలు అయ్యాయి. వాలంటీర్లు బెదిరించారని చంద్రబాబు అంటున్నారు. వాలంటీర్లు బెదిరిస్తే మీ ఎల్లో మీడియా ఊరికే ఉంటుందా? నంద్యాల ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి హోదాలో ఏమన్నారో గుర్తు లేదా చంద్రబాబూ? మేం వేసిన రోడ్లపై నడుస్తున్నారు కదా? టీడీపీకి ఎందుకు ఓట్లు వేయరని అన్నారు. ఒక అమ్మా అబ్బకు పుడితే ఓట్లు వేయరా అంటారు. ఈ రోజు చంద్రబాబు మాట్లాడుతున్నారు ఆయనది నోరా? తాటి మట్టా? అర్థం కావడం లేదు. మా ప్రభుత్వం అర్హతే ప్రమాణికంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నాం. గతంలో పింఛన్‌ రావాలంటే ఒకరు చనిపోవాల్సిందే. మా ప్రభుత్వంలో అలా కాదు. అర్హత ఉంటే ఎప్పుడైనా సంక్షేమ పథకాలు అందజేస్తున్నాం.’’ అని అన్నారు.

‘‘2014లో వైయస్‌ జగన్‌ 67 ఎమ్మెల్యే స్థానాల్లో గెలిచినా కూడా పంచాయతీ ఎన్నికల్లో ఇలా మీ మాదిరిగా వ్యవహరించలేదు. మీలాగా లేఖలు రాయలేదు. చంద్రబాబు ఎన్నికల కమిషన్‌ను వాడుకుంటారు. కోర్టులను వాడుకుంటూ బెదిరించారు. వైయస్‌ జగన్‌ ఎప్పుడూ ఇలా చేయలేదే? చంద్రబాబుకు తన కుటుంబం, ఆయన చుట్టూ ఉన్న కోటరీ ప్రయోజనాలే ముఖ్యం. చంద్రబాబు రాజకీయ జీవితం చరమాంకానికి చేరుకుందని కుప్పం ప్రజలు ఆయన్ను వెలివేశారన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిపోయే సమయం వచ్చింది. కుప్పంలో ఓటమిపై చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వైయస్‌ఆర్‌సీపీ పతనం ఎక్కడైనా మీడియాకు కనిపించిందా? రెండేళ్ల వైయస్‌ జగన్‌ పాలనపై ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. మా పార్టీ గ్రాఫ్‌ విఫరీతంగా పెరిగింది. చంద్రబాబు అనుకుంటున్నట్లు 40 శాతం వైయస్‌ఆర్‌సీపీ గెలిచినా కూడా మేం గెలిచినట్లే కదా? మా పతనం మొదలైతే మీరు పైకి వస్తున్నారా? అర్థం లేని మాటలు చంద్రబాబు కట్టిపెట్టాలి.’’ అని హితవుపలికారు.

‘‘నిన్నటి వరకు ఎస్‌ఈసీ అంటే ఏమనుకుంటున్నారు ప్రత్యేక రాజ్యాంగం అంటూ చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఎస్‌ఈసీపై చంద్రబాబు పడ్డారు. పంచాయతీ ఎన్నికలను మేం ఎదుర్కొన్నాం. ఇప్పట్లో పరిషత్‌ ఎన్నికలు రావడం లేదు. అయినా చంద్రబాబు ఎందుకు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారు.’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.