రాష్ట్రీయం

రైతాంగానికి నష్టం కలిగిస్తే…

నల్గొండ, జనవరి 26 (న్యూస్‌టైమ్): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు రెండు నెలలుగా ఉద్యమాలు చేస్తుంటే వారి ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర చేస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని వెలిమినేడులో ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సంక్రాంతి క్రీడాపోటీలు నిర్వహించారు. విజేతలకు తమ్మినేని బహుమతులు అందజేశారు.

అనంతరం తమ్మినేని మాట్లాడుతూ రైతాంగానికి మద్దతుగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈనెల 26న ఢిల్లీలో లక్ష ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. వారి ఉద్యమానికి మద్దతుగా రాష్ట్రంలోనూ రైతులు, కార్మికులు, ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. 26న అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. ట్రాక్టర్ల ర్యాలీలో రైతులు స్వచ్చంధంగా పాల్గొనాలని కోరారు. వ్యవసాయ చట్టాల పట్ల సీఎం కేసీఆర్‌ వైఖరి వింతగా ఉందన్నారు. ముందు వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఇప్పుడు సమర్థిస్తున్నారని విమర్శించారు. ఇది కేసీఆర్‌ అవకాశ వాదంగా భావించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రజలకు చాలా నష్టం జరుగు తుందని, ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ పునరాలోచించుకోవాలని సూచించారు.

చట్టాలను రద్దు చేయాల్సింది పోయి రైతులను మోసం చేసేందుకు బీజేపీ పెద్ద కుట్ర చేస్తుందన్నారు. కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ ఏదో రకంగా రైతుల ఉద్యమాన్ని విరమింపచేసేందుకు కేంద్రం కుయు క్తులు పన్నుతోందన్నారు. వెలిమినేడు గ్రామస్థులు 15 కుటుంబాలు సీపీఐ(ఎం)లో చేరాయి. వారికి తమ్మినేని వీరభద్రం పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొంతల చంద్రారెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్‌, డీవైఎఫ్‌ఐ జిల్లా నాయకులు నాతి కిరణ్‌గౌడ్‌, నెలకంటే నరసింహ, అరూరి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.