జాతీయం

భారత్ ఇపుడు వాణిజ్య మార్కెట్ మాత్రమే కాదు…

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6 (న్యూస్‌టైమ్): భారతదేశం ఇపుడు కేవలం వాణిజ్యావకాశాల మార్కెట్ మాత్రమే కాదని, రక్షణరంగంతోపాటుగా, పలు రంగాల్లో మొత్తం ప్రపంచానికే విస్తృత అవకాశాలు కల్పిస్తోందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. బెంగుళూరులో జరిగిన ఎయిరో ఇండియా వైమానిక విన్యాసాల ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రసంగించారు. రక్షణ, గగనతల రంగాల్లో ప్రపంచ స్థాయిలో ఎప్పటికప్పుడు ప్రవర్థమానం అవుతున్న భారతీయ శక్తి సామర్థ్యాలకు ఎయిరో ఇండియా-21 సజీవ తార్కారణమని రాష్ట్రపతి అన్నారు. భారతీయ సామర్థ్యాలు ప్రపంచ స్థాయిలో క్రమంగా వృద్ధి చెందుతున్నాయనే అంశాన్ని ఎయిరో ఇండియా-21 ప్రతిబింబింపజేసిందన్నారు.

భారతదేశంలో గత ఆరేళ్ల కాలంలో మొదలైన సంస్కరణల కారణంగా రక్షణ, గగనతల రంగాల్లో పెట్టుబడిదారులకు, ప్రైవేటు కంపెనీలకు ఇదివరకెన్నడూ కనీ వినీ ఎరుగని అవకాశాలు లభించాయని రాష్ట్రపతి చెప్పారు. రక్షణరంగంలో అగ్రస్థానంలో ఉన్న దేశాల సరసన భారతదేశాన్ని చేర్చేందుకు తాము ఎన్నో చర్యలు తీసుకున్నామని, స్వావలంబన, ఎగుమతులకు ప్రోత్సాహం అన్న జంట లక్ష్యాలతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని రాష్ట్రపతి చెప్పారు. భారతదేశంలో తమ తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేలా వివిధ కంపెనీలను ప్రోత్సహించేందుకు ‘సులభతర వాణిజ్య నిర్వహణ’ అనే అంశంపై ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించినట్టు ఆయన పేర్కొన్నారు. రక్షణ రంగంలో కూడా క్రమం తప్పకుండా సరళీకృత విధానం అమలు చేస్తున్నట్టు, అనేక వస్తువులను, ఉత్పాదనలను పారిశ్రామిక లైసెన్సింగ్ ప్రక్రియనుంచి మినహాయించినట్టు రాష్ట్రపతి తెలిపారు.

పారిశ్రామిక లైసెన్సింగ్, ఎగుమతిని అధీకృతం చేయడం వంటి ప్రక్రియలను మరింత సరళతరం చేసి, ఆన్ లైన్ విధానంలో అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. రక్షణరంగంలో పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం కల్పించేందుకు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల (ఎం.ఎస్.ఎం.ఇ.ల)కు ప్రాధాన్యం ఇచ్చేందుకు ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో రెండు రక్షణ రంగ కారిడార్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దీనితో భారీ స్థాయిలో ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడుతుందని, రక్షణ రంగంలో స్వావలంబన మార్గంలో భారతదేశం పురోగమించగలదని భావిస్తున్నామని తెలిపారు.

హిందూ మహా సముద్ర ప్రాంతానికి (ఐ.ఒ.ఆర్.కు) చెందిన వివిధ దేశాల రక్షణ మంత్రుల సమ్మేళనం గురించి రాష్ట్రపతి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘హిందూ మహా సముద్ర ప్రాంతంలో మరింత శాంతి, భద్రత, సహకారం’ అన్న ఇతివృత్తంతో ఎయిరో ఇండియా-21 ప్రదర్శనకు ముందుగా ఈ సమ్మేళనాన్ని నిర్వహించారు. విశ్వశాంతి, అభివృద్ధి అన్న అంశాలను భారతదేశం ఎప్పటినుంచో బలంగా పేర్కొంటూ వస్తోందని రాష్ట్రపతి అన్నారు. భౌగోళికంగా ఎంతో వ్యూహాత్మకమైన హిందూ మహాసముద్ర ప్రాంతానికి మరెంతో ప్రాముఖ్యత ఉందని, సుపంపన్నమైన ప్రకృతి వనరులకు ఇది నిలయమని అన్నారు. హిందూ మహా సముద్ర ప్రాంతంలో వివిధ దేశాల మధ్య సహకార సంబంధాలను ప్రోత్సహించేందుకు తాము ‘సాగర్’ అన్న భావననను ప్రవేశపెట్టామని రాష్ట్రపతి అన్నారు. ‘ఈ ప్రాంతంలో అందరికీ భద్రత, సహకారం’ అన్న అంతరార్థంతో ఈ ఆలోచనను ప్రవేశపెట్టినట్టు చెప్పారు. రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, రక్షణ రంగాల్లో సహకారాన్ని పెంపొందించే లక్ష్యంపై హిందూ మహా సముద్ర ప్రాంతపు దేశాలు దృష్టిని కేంద్రీకరించడం అవసరమని రాష్ట్రపతి అన్నారు. మానవతా దృక్పథంతో సహాయం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో అండగా నిలవడం అన్న అంశాలకు సంబంధించిన ప్రణాళిక, సమన్వయం కోసం హిందూ మహా సముద్ర ప్రాంతపు దేశాలతో నైపుణ్యాలను పంచుకునేందుకు భారతదేశం ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటుందని రాష్ట్రపతి చెప్పారు.

కోవిడ్-19 వ్యాప్తితో సంక్షోభం తలెత్తిన తర్వాత, ‘సాగర్-1’ కార్యక్రమం కింద భారత్ తన ఇరుగు పొరుగుదేశాలకు అండగా నిలిచిందని, వైద్య బృందాలను, ఔషధాలను, వ్యాధినిర్ధారణ కిట్లను, కృత్రిమ శ్వాస పరికరాలను, మాస్కులను, చేతి తొడుగులను, ఇతర వైద్యపరమైన ఉత్పత్తులను భారత్ అందించిందని చెప్పారు. కోవిడ్-19పై పోరాటం, వైరస్ నిరోధించే కార్యక్రమంలో భాగంగా, వ్యాక్సీన్ ఉత్పత్తి, పంపిణీకోసం తన సామర్థ్యాన్ని వినియోగించేందుకు భారతదేశం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ఈ విషయంలో తమ మిత్రదేశాలకు తగిన సహాయం అందించడం భారత్ ఇప్పటికే ప్రారంభించిందని రాష్ట్రపతి తెలిపారు.