న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1 (న్యూస్‌టైమ్): కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని వైయస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశపరిచిందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. పార్లమెంట్ ఆవరణలో పార్టీ ఎంపీలతో కలిసి విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఇవాళ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఎన్నికలు సమీపిస్తున్న రాష్ట్రాలపై మాత్రమే వరాలు కురిపించారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో రెవెన్యూ లోటు ఉందని చెప్పారు. రాష్ట్రంపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిందన్నారు. ఏపీకి సరైన కేటాయింపులు జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశమే ప్రస్తావనకు రాలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు పెంచిన అంచాలపై ఎలాంటి ప్రతిపాదనలు లేవన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ఆత్మ నిర్భర్ ఏ మాత్రం కనపడలేదన్నారు. బడ్జెట్ నిరాశపరిచిందన్నారు.
ఏపీకి ఒక్క కొత్త రైల్వే ప్రాజెక్టు ఇవ్వలేదన్నారు. ఖరగ్‌పూర్–విజయవాడ రైల్వే కారిడార్‌తో రాష్ట్రానికి ఒరిగేదేమి లేదన్నారు. ఏపీకి మెట్రోరైలు కోసం ఆరేళ్లుగా నిధులు అడుగుతున్నామన్నారు. విశాఖ, విజయవాడలో మెట్రో రైలు ఏర్పాటు చేయాలని కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని, ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో మాత్రమే మెట్రో ఏర్పాటుకు నిధులు కేటాయించారన్నారు. కొత్త టెక్ట్స్‌టైల్ పార్క్ రాష్ట్రానికి ఇవ్వాలని చేస్తున్నామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సీఎం వైయస్ జగన్‌మోహన్ రెడ్డి త్వరలోనే రాష్ట్రంలో మరో 13 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారని, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని కేంద్రానికి ప్రతిపాదనలు చేసినా ఎలాంటి కేటాయింపులు జరపలేదన్నారు. సీఎం వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఇప్పటికే 8 ఫిషింగ్‌హార్బర్లు ప్రకటించారని, కేంద్రం కేటాయింపులు జరపకపోవడం బాధాకరమన్నారు. దేశవ్యాప్తంగా వంద విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారని, ఏపీకి ప్రాధాన్యత కల్పించాలని కోరుతామని తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో కరోనా వ్యాక్సినేషన్‌కు నిధులు కేటాయించడం ఒక్కటే రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉంటుందని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.