ప్రాంతీయం

స్ఫూర్తిదాయకులు జగ్జీవన్

ఒంగోలు, ఏప్రిల్ 5 (న్యూస్‌టైమ్): రాజ్యాంగ బద్ధంగా అట్టడుగు వర్గాల అభ్యున్నతికి బాటలు వేస్తూనే దేశ స్థూల ఆదాయ అభివృద్ధికి కృషి చేసిన మహనీయులుగా బాబూ జగ్జీవన్ రామ్ చరిత్రలో నిలిచిపోయారని ప్రకాశం జిల్లా కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్ కొనియాడారు.

బాబు జగ్జీవన్ రామ్ 114వ జయంతి వేడుకలు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక స్పందన సమావేశ మందిరంలో జరిగాయి. తొలుత నెల్లూరు బస్టాండ్ సెంటర్‌లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి, అంబేద్కర్ భవనం రోడ్డులోని బాబు జగ్జీవన్ రామ్ కాంస్య విగ్రహానికి జిల్లా కలెక్టర్ పోల భాస్కర్, జె.సి.లు జె.వెంకట మురళి, కె.కృష్ణ వేణి, ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కె.కనకారావు, డి.ఆర్.ఓ. కెవినాయకం, సాంఘిక సంక్షేమ శాఖ డి.డి. లక్ష్మానాయక్, ఎస్.సి.కార్పొరేషన్ ఇ.డి. టి.శ్రీనివాస విశ్వనాధ్, నగరపాలక సంస్థ కమిషనర్ కె.భాగ్యలక్ష్మి, తదితరులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సమాజ హితం కోరుతూ నిబద్ధతో పనిచేసిన గొప్ప నాయకుడు జగ్జీవన్ రామ్ అని కలెక్టర్ చెప్పారు. చిన్న వయస్సులోనే సామాజిక వివక్షతను ఎదుర్కొన్న బాబు జగ్జీవన్ రామ్ సమాన హక్కుల కోసం పోరాడిన వ్యక్తిగా ఆయన అభివర్ణించారు.

50 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యులుగానూ, వివిధ శాఖలకు కేంద్రమంత్రిగా పనిచేసి తన దైన ముద్ర వేసుకున్నారని ఆయన చెప్పారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో హరిత విప్లవం, పారిశ్రామిక రంగం అభివృద్ధికి నాంది పలికారని ఆయన వివరించారు. మహిళలు, కార్మికుల సంక్షేమానికి అనేక చట్టాలను రూపొందించి దేశ అభివృద్ధికి కృషి చేసిన దార్శనీకుడని ఆయన తెలిపారు. సమాజంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్న అణగారిన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించడానికి ఆయన చేసిన పోరాటం అభినందనీయమన్నారు. రాజ్యాంగంలోని చట్టాలు, వాటి ప్రయోజనాలు, ప్రజల హక్కులు కార్యరూపం దాల్చే ప్రక్రియలో బాబు జగ్జీవన్ రామ్ కృషి వర్ణనాతీతమన్నారు. ఆయన అనుసరించిన మార్గం ఆదర్శనీయమని, ఆయన స్పూర్తితో నేటి యువత సమాజానికి ఉపయోగపడేలా ఎదగాలన్నారు.

ఇలాంటి మహనీయుల జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషదాయకమన్నారు. ఎస్.సి., ఎస్.టి.ల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడానికి స్థిరమైన ప్రణాళికా విధానాన్ని అమలు చేయనున్నామన్నారు. భావి భారతానికి ఆహార కొరత లేకుండా బృహత్తరమైన ప్రణాళికతో హరిత విప్లవం తెచ్చిన గొప్ప నాయకుడుగా బాబు జగ్జీవన్ రామ్ నిలిచారని జిల్లా సంయుక్త కలెక్టర్ (ఆర్‌బి ఆర్ఆర్) జె.వెంకట మురళి తెలిపారు. చిన్న తనంలోనే అంటరాని తనాన్ని ధైర్యంగా ఎదుర్కొని సాహసోపేతమైన ఉద్యమాన్ని నడిపిన గొప్ప ఉద్యమకారుడని ఆయన చెప్పారు. సమాజంలో ప్రతి ఒక్కరికి సమాన ఫలాలు అందించాలనే లక్ష్యంతో రాజ్యాంగ నిర్మాణంలో సభ్యులుగా ఉంటూనే చట్టాల అమలుకు కృషి చేశారన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని వివరించారు. అలాంటి నాయకులకు గుర్తు చేసుకోవడం సంతోషదాయకమన్నారు.

ఆయనలోని ఉద్యమస్పూర్తి, పోరాటపటిమను ఆదర్శంగా తీసుకొని సమాజంలో మార్పు కోసం నేటి యువత ముందుకు సాగాలన్నారు. వివక్షతను ఎదుర్కొని సమాజాన్ని మేల్కొల్పడానికి బాబు జగ్జీవన్ రామ్ చేసిన కృషి వర్ణనాతీతమని ఏపీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కె.కనకారావు అన్నారు. స్వాతంత్య్రం అనంతరం తొలి రక్షణ శాఖ మంత్రిగా, మాజీ ఉప ప్రధానిగా జగ్జీవన్ రామ్ పరిపాలన వ్యవస్థలో చెరగని ముద్ర వేసుకున్నారని ఆయన తెలిపారు. దేశంలో కరవు ఏర్పడిన సమయంలో ఆహార కొరత తీర్చడానికి హరిత విప్లవం తెచ్చిన తొలి నాయకులుగా చరిత్రలో నిలిచిపోయారని ఆయన వివరించారు. 40 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా దేశానికి విశేష సేవలందించిన బాబు జగ్జీవన్ రామ్‌కు భారత ప్రభుత్వం భారత రత్న ఇవ్వాలని ఆయన కోరారు. సామాజిక మార్పు కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన బాబు జగ్జీవన్ రామ్ అడుగు జాడల్లో నేటి యువతీ యువకులు నడవాలని ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత సూచించారు. ప్రజల జీవన విధానంలోను మార్పు రావాలని ఆమె కోరారు.

జగ్జీవన్ రామ్, అంబేద్కర్ వంటి నేతల జీవితాలను మననం చేసుకోవాలని, వారి స్పూర్తితో ముందుకు సాగాలన్నారు. ఎస్.సి.లను ఓటు బ్యాంకుగా చేసుకుంటున్న రాజకీయ వ్యవస్థలో మార్పురావాలని ఆమె ఆకాంక్షించారు. ఎస్‌సీలంతా ఐక్యంగా వుండి రాజ్యాంగ ఫలాలు అందుకోవాలన్నారు. బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలు కొనసాగించాలన్నారు. ఎస్.సి.ల జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ అని ఎం.ఆర్.పి.ఎస్. రాష్ట్ర అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య అన్నారు. రాజ్యాంగం అమలైన 10 సంవత్సరాలకే రిజర్వేషన్లు ఎత్తివేయాలనే ప్రతిపాదనలను ధైర్యంగా అడ్డుకొని నేటికి కొనసాగేలా పోరాడిన మహనీయులు జగ్జీవన్ రామ్ అని ఆయన కొడియాడారు.

ఎస్.సి. ఎస్.టి.లకు కేటాయించిన నిధులను పూర్తిగా వారికే ఖర్చు చేయాలని ఆయన డిమాండ్ చేశారన్నారు. కార్యక్రమంలో డి.ఆర్.డి.ఏ. పి.డి. బాబు రావు, దళిత సంఘాల నాయకులు, విజేంద్ర బహుజన్, చప్పిడి వెంగళరావు, పి.ఆది శేషు, గిరిజన సంఘాల నాయకులు టి. సత్యం, ధర్మ, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, వసతి గృహ విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.