జాతీయం

దేశంలో సరిపడా కోవిడ్ వాక్సిన్ నిల్వలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7 (న్యూస్‌టైమ్): దేశంలో కోవిడ్ టీకాల కార్యక్రమాన్ని కొనసాగించడానికి అవసరమైన నిల్వలు కేంద్రం వద్ద ఉన్నాయి. 2021 జనవరి 16వ తేదీన దేశంలో కోవిడ్-19 టీకాల కార్యక్రమం ప్రారంభం అయ్యింది. దశలవారీగా అమలు జరిగే ఈ కార్యక్రమంలో తొలుత ప్రాధాన్యతా క్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ సిబ్బందికి టీకాలను ఇస్తున్నారు. అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో ఒకేసారి అమలు జరుగుతున్న కార్యక్రమాన్ని కొనసాగించడానికి అవసరమైన డోసులను కేంద్రం సిద్ధంగా ఉంచింది. సార్వత్రిక టీకాల కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన శీతలీకరణ సౌకర్యాలను మరింత పటిష్టం చేసి కోవిడ్-19 టీకాలను నిల్వ చేయడానికి వినియోగిస్తున్నారు. ఇప్పటికీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సరఫరా చేసిన వాక్సిన్‌లను నిల్వ చేయడానికి ఈ సౌకర్యాలు సరిపోతాయి.