రాజకీయం

రౌడీయిజం చేస్తే అరెస్టు చేయ‌డం త‌ప్పా?

విశాఖపట్నం, ఫిబ్రవరి 2 (న్యూస్‌టైమ్): పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో టీడీపీ అధ్య‌క్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు రౌడీయిజం, దౌర్జ‌న్యం చేశార‌ని, అలాంటి వ్య‌క్తిని అరెస్టు చేయ‌డం నేరం- ఘోరం అన్న‌ట్లుగా టీడీపీ నేత‌లు మాట్లాడుతున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, ఎమ్మెల్యే గుడివాడ అమ‌ర్‌నాథ్ పేర్కొన్నారు. పోలీసుల‌ను అగౌర‌వ‌ప‌రుస్తూ ఇష్టం వచ్చిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నా ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ మౌనంగా ఉండ‌టం స‌రికాద‌న్నారు. ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేసే వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. మంగ‌ళ‌వారం విశాఖ‌లోని వైయ‌స్ఆర్‌సీపీ కార్యాల‌యంలో గుడివాడ అమ‌ర్‌నాథ్ మీడియాతో మాట్లాడారు.

టీడీపీ నేత‌లు దాడుల‌కు తెగ‌బ‌డితే చూస్తూ ఊరుకోవాలా అని గుడివాడ అమ‌ర్‌నాథ్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గంలో, తన సొంత ఊరు నిమ్మాడ గ్రామంలో, తనకు వ్యతిరేకంగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీచేస్తున్న వైయస్ఆర్సీపీ మద్దతుదారుడ్ని అడ్డుకుంటే, అతనిపై దౌర్జన్యం చేస్తే దాడులకు తెగబడితే పోలీసులు కేసు పెట్టి అరెస్టు చేస్తే అదేదో నేరం-ఘోరం అన్నట్టుగా చంద్రబాబు, టీడీపీ ఖండించిన తీరు ఆ పార్టీ రెండు నాల్కల వ్యవహరాన్ని బట్టబయలు చేస్తోందన్నారు.

‘‘ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, రౌడీయిజాన్ని ప్రదర్శిస్తూ అచ్చెన్నాయుడు రెడ్ హ్యాండెడ్‌గా ఆడియోల్లో, వీడియోల్లో దొరికితే చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులు అన్యాయం, అక్రమం అంటారా? అంటే మీరు ఎటువంటి ప్రజాస్వామ్యం కోరుకుంటున్నారు? వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటుంది. గ్రామాల్లో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసే విధంగా టీడీపీ ప్రజల్ని రెచ్చగొట్టి, దౌర్జన్యాలకు దిగినా, బెదిరింపులకు పాల్పడినా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ఎవరు ఇలాంటి చర్యలకు పాల్పడినా ఎవరు దౌర్జన్యాలు చేసినా, అది చంద్రబాబు అయినా, లోకేష్ అయినా మరొకరు అయినా అధికారులు కచ్చితంగా చర్యలు తీసుకుంటారు, తీసుకోవాలి.’’ అని అన్నారు.

‘‘ఖాకీ డ్రస్ చూస్తేనే అసహ్యం వేస్తుందంటూ అచ్చెన్నాయుడు మొత్తం పోలీసు శాఖనే అగౌరవపరిచాడ‌ని అమ‌ర్‌నాథ్ మండిప‌డ్డారు. ఖాకీ డ్రస్సులు చూస్తే అసహ్యం వేస్తుందని మాట్లాడుతున్న మీరు, మరి, మీ నాయకుడు చంద్రబాబు నాయుడు పోలీసులను ఎందుకు సెక్యూరిటీగా పెట్టుకున్నాడు? ఆయన సెక్యూరిటీని వెనక్కు పంపించమని చెప్పండి. టీడీపీ అధికారంలోకి వస్తుంది, తాను హోం మంత్రిని అవుతాను అని అచ్చెన్నాయుడు ఇప్పటి నుంచే పగటి కలలు కంటూ పోలీసు అధికారుల్ని బెదిరింపులకు గురిచేస్తూ, బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. టీడీపీ అధికారంలోకి రావటం అన్నది ఎప్పటికీ పగటి కలే అన్నది గుర్తు పెట్టుకోవాలి. టీడీపీ చెప్పినట్లు ఎన్నికల కమిషన్ ప్రవర్తించడం సమంజసం కాదు. అచ్చెన్నాయుడుపై తక్షణం చర్యలు తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ ఎందుకు స్పందించటం లేదు.’’ అని అమర్‌నాథ్ పేర్కొన్నారు.

స్టేట్ ఎలక్షన్ కమిషన్ కాస్తా తెలుగుదేశం ఎలక్షన్ కమిషన్ గా మారిపోయింది. పోలీసులను అగౌరవపరుస్తూ, వారి ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని ఎమ్మెల్యే గుడివాడ అమ‌ర్‌నాథ్ కోరారు.