రాజకీయం

ఎన్నిక‌లు నిమ్మ‌గ‌డ్డ కోసమా?

అమరావతి, జనవరి 25 (న్యూస్‌టైమ్): రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్‌కు తొంద‌ర ఎక్కువైంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ బాల‌శౌరీ పేర్కొన్నారు. పంచాయ‌తీ ఎన్నిక‌లు తెలుగు గ‌డ్డ కోస‌మా? నిమ్మ‌గ‌డ్డ కోస‌మా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యం వ‌ద్ద బాల‌శౌరి మీడియాతో మాట్లాడారు.

నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్‌కు ప్రాణాల‌పై భీతితో మీడియా స‌మావేశంలో గ్లాస్ ఏర్పాటు చేసుకొని జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించార‌ని, ఆయ‌న మాదిరిగానే అధికారులు, ప్ర‌జ‌ల‌కు ప్రాణ‌భ‌యం ఉండ‌దా అని ప్ర‌శ్నించారు. ఇటీవ‌ల కోర్టు విచార‌ణ‌కు కూడా నిమ్మ‌గ‌డ్డ వ‌ర్చువ‌ల్ విధానంలో హాజ‌ర‌య్యార‌ని గుర్తు చేశారు. ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌కు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న వేళ హ‌డావుడిగా ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని ప్ర‌శ్నించారు.

ప్ర‌జ‌లు, ఉద్యోగులు త‌మ ప్రాణాలు ముఖ్య‌మ‌ని అంటున్నారు. నిమ్మ‌గ‌డ్డ‌, చంద్ర‌బాబు, నారా లోకేష్ మాత్రం హైద‌రాబాద్‌లో ఉంటార‌ని, వీరికి ఏపీలో ఎన్నిక‌లు కావాలా అని నిల‌దీశారు. ఎన్నిక‌ల‌పై నిమ్మ‌గ‌డ్డ‌కు తొంద‌రెందుక‌ని ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు కోసం నిమ్మ‌గ‌డ్డకు తొంద‌ర ఎక్కువైంద‌ని, ఆయ‌న స్పీడ్ త‌గ్గించుకుంటే బాగుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.