జాతీయం

విజయ్‌ హజారే వన్డే టోర్నీలో ఇషాన్ విశ్వరూపం

ఇండోర్, ఫిబ్రవరి 21 (న్యూస్‌టైమ్): దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ తొలి రోజే సంచలన ప్రదర్శన నమోదైంది. కెప్టెన్, వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ (94 బంతుల్లో 173; 19 ఫోర్లు, 11 సిక్సర్లు) విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగడంతో జార్ఖండ్‌ 324 పరుగుల తేడాతో మధ్యప్రదేశ్‌ను చిత్తుగా ఓడించింది. హోల్కర్‌ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జార్ఖండ్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 422 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనుకూల్‌ రాయ్‌ (39 బంతుల్లో 72; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), విరాట్‌ సింగ్‌ (49 బంతుల్లో 68; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), సుమీత్‌ కుమార్‌ (58 బంతుల్లో 52; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలతో కిషన్‌కు అండగా నిలిచారు. ఐపీఎల్‌లో ఈ ఏడాది ముంబై తరఫున సత్తా చాటిన కిషన్‌ సొంత రాష్ట్రం తరఫున వన్డేల్లో తన మెరుపులు చూపించాడు. అతని ఇన్నింగ్స్‌లో 142 పరుగు లు బౌండరీల ద్వారానే రావడం విశేషం.

తన అర్ధ సెంచరీని 42 బంతుల్లో అందుకున్న కిషన్, 74 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆపై 150 పరుగుల మార్క్‌ను దాటేందుకు మరో 12 బంతులు సరిపోయాయి. శతకం మైలురాయిని చేరిన తర్వాత వచ్చిన 71 పరుగులను అతను 20 బంతుల్లోనే సాధించడం అతని బ్యాటింగ్‌ జోరును చూపిస్తోంది. అనంతరం మధ్యప్రదేశ్‌ 18.4 ఓవర్లలో 98 పరుగులకే కుప్పకూలింది. అభిషేక్‌ భండారి (42) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, పేస్‌ బౌలర్‌ వరుణ్‌ ఆరోన్‌ (6/37) ప్రత్యర్థిని పడగొట్టాడు. కీపర్‌గానూ సత్తా చాటిన కిషన్‌ మధ్యప్రదేశ్‌ ఇన్నింగ్స్‌లో ఏకంగా 7 క్యాచ్‌లు అందుకోవడం మరో విశేషం.