తెలంగాణ

ఎస్‌హెచ్‌జీల్లో ఐటీ సామర్ధ్యం పెంపు

హైదరాబాద్, మార్చి 6 (న్యూస్‌టైమ్): రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు సంబంధించి ఐటి వినియోగం, సామర్ధ్యం పెంపుదల, జీవనోపాధి, ఎంటర్‌ప్రైస్, డెవలప్‌మెంట్, కన్వర్ జెన్సీకి కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సెర్ప్, మెప్మా చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, కార్యాచరణ ప్రణాళికలపై బి.ఆర్.కె.ఆర్ భవన్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళల జీవనోపాధిలో మార్పు తీసుకురావడానికి వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, భూ పరీక్షలు, కూరగాయల సాగు, పశుసంవర్ధకం న్యూట్రేషన్ తదితర రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి అంశానికి సంబంధించి అధికారులతో చిన్న సంఘాల ఏర్పాటు చేసి వివరాలతో రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఐటీ వినియోగం ద్వారా ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు నిరంతర సేవలందించాలని, ప్రతి గ్రూప్‌కు బ్యాంక్ లింకేజ్ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో చిన్నారులలో మాల్ న్యూట్రీషన్, మహిళలలో అనీమియా తగ్గించడానికి ఎస్‌హెచ్‌జీలు, సంబంధిత లైన్ డిపార్టుమెంట్స్ కన్వర్జెన్సీతో కృషి చేయాలని అధికారులను కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి బి.జనార్దన్ రెడ్డి, యస్సి అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, జి.హెచ్.యం.సి కమీషనర్ లోకేశ్ కుమార్, గ్రామీణాభివృద్ధి , పంచాయతీ రాజ్ కమీషనర్ రఘునందన్ రావు, సీడీఎంఎ సత్యనారాయణ, హార్టీకల్చర్ డైరెక్టర్ ఎల్. వెంకట్రాం రెడ్డి, అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్ జి. లక్ష్మీబాయి, స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డైరెక్టర్ అఖీల్, వీ హబ్ సిఈఓ దీప్తి రేవుల, శ్రీనిధి యండి జి.విద్యాసాగర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.