అప్పుల్లో పోటీ పడుతున్న జగన్, కేసీఆర్!
హైదరాబాద్, అమరావతి, మార్చి 7 (న్యూస్‌టైమ్): అప్పులు చేయడంలో, కొత్త అప్పులు పుట్టించడంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌లు పోటీ పడుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ వెల్లడించిన తాజా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూ.44,250 కోట్ల అప్పులు చేయగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.36,354 కోట్ల అప్పు చేశారు. ఈ రెండు తెలుగు రాష్ట్రాల రుణాలు మొత్తం కలిపి రూ. 80,600 కోట్లకు పైగా ఉన్నాయని ఆర్బీఐ పేర్కొనడం గమనార్హం. 2020 ఏప్రిల్–డిసెంబర్ మధ్యకాలంలో ఈ అప్పులు చేసినట్లుగా రిజర్వ్ బ్యాంక్ ఓ ప్రకటనలో తెలియజేసింది. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు ఇద్దరూ తమ రాష్ట్ర అవసరాల కోసం ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని ఎక్కువగా వాడుకుంటున్నారు. నెల రోజుల వ్యవధిలో ఏపీ మూడు రోజుల పాటు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని వాడుకోగా తెలంగాణ ఏకంగా 13 రోజుల ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని వాడుకోవడం విశేషం. వివిధ ప్రభుత్వ పథకాలతో ఆర్ధిక అవసరాలు ఏర్పడుతుండటంతో ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యంతో పాటుగా స్పెషల్ డ్రాయింగ్, చేబదుళ్లని కూడా జగన్, కేసీఆర్‌లు ఉపయోగించుకుంటున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా రుణ పరిమితిని స్వల్పంగా పెంచడంతో మరికొన్ని అప్పులు చేసే అవకాశం ఈ ఆర్ధిక సంవత్సరంలో జగన్, కేసీఆర్‌కు లభించనుంది.