ఏకతాటిపైకి జగన్‌, నిమ్మగడ్డ?

మున్సిపోల్స్‌పై పెరిగిన ఉత్కంఠ..

అమరావతి, ఫిబ్రవరి 27 (న్యూస్‌టైమ్): ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. మున్సిపల్‌ ఎన్నికలను గతేడాది వాయిదా పడిన చోట నుంచే తిరిగి నిర్వహించాలన్న ఎస్ఈసీ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తి చేసిన హైకోర్టు తీర్పును వెలువరించింది. అదే సమయంలో హైకోర్టులో ఎన్నికల ప్రక్రియను గతంలో ఆపిన చోట నుంచే కొనసాగించే విషయంలో జగన్ సర్కార్‌, నిమ్మగడ్డ ఏకతాటిపైకి రావడంతో తీర్పుపై ముందు నుంచే ఉత్కంఠ పెరిగింది.

ఏపీలో మరో ఐదు రోజుల్లో మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పటికే అభ్యర్ధులు ప్రచారం చివరి దశలో ఉన్నారు. ఈ సమయంలో ఎన్నికలు ఆలస్యం కావడం, ఎస్‌ఈసీ తిరిగి ఆపిన చోట నుంచే ఎన్నికలు ప్రారంభించడం వల్ల తాము నామినేషన్‌ వేసే అవకాశాలు కోల్పోయామని కడప జిల్లా జమ్మలమడుగు, అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన కొందరు అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించారు.

ఇప్పటివరకూ స్ధానిక సంస్ధల ఎన్నికల విషయంలో కత్తులు దూసుకున్న జగన్ సర్కార్‌, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ ఇప్పుడు హైకోర్టులో మాత్రం ఓ అంశంలో ఏకతాటిపైకి వచ్చారు. ఆపిన చోట నుంచే తిరిగి మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించేందుకు ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టులో ప్రభుత్వం సమర్ధించింది. కాలయాపన లేకుండా చూడాలంటే ఎన్నికల ప్రక్రియను ఆపిన చోట నుంచే కొనసాగిస్తే బావుంటుందని అడ్వకేట్ జనరల్‌ శ్రీరాం సుబ్రహ్మణ్యం వాదించారు.

దీంతో ఎస్ఈసీ వాదనకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించిన పిటిషనర్లు అవాక్కయ్యారు. ప్రభుత్వం, ఎస్‌ఈసీ ఇద్దరూ ఒకే మాట వినిపిస్తుండటంతో వీరి పిటిషన్లపై హైకోర్టు తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుందని ముందుగానే అందరూ ఊహించారు. గతంలో స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రక్రియను ఆపిన చోట నుంచి తిరిగి కొనసాగించే విషయంలో ఏపీలో జరిగినంత అసాధారణ జాప్యం ఎక్కడా జరగలేదు. ఆరు నెలల వరకూ జాప్యం జరిగితే తిరిగి అక్కడి నుంచే ప్రారంభించేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243కే, 243యూ, 73, 74 షెడ్యూళ్లు అవకాశం కల్పిస్తున్నాయి. ఏదో రకంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగించేందుకు వీలు కల్పిస్తున్నాయి.

అయితే, అసాధారణ పరిస్ధితులు ఎదురై ఎన్నికలు ఆరునెలల కంటే ఎక్కువగా వాయిదా పడితే మాత్రం తిరిగి నోటిఫికేషన్‌ ఇచ్చి మొత్తం ప్రక్రియను మొదటి నుంచి నిర్వహించాల్సి ఉంటుంది. ఇక్కడ ఏపీలో అదే జరిగింది. కానీ, ఎన్నికలు మాత్రం రీనోటిఫై కాలేదు. దీంతో హైకోర్టులో అదే విషయాన్ని ప్రస్తావిస్తూ పిటిషనర్లు వాజ్యాలు వేశారు. దీంతో హైకోర్టు కూడా సందిగ్ధంలో పడింది. కానీ, ఎస్ఈసీ తరఫు న్యాయవాదులు మాత్రం కరోనాను ఓ ప్రత్యేక పరిస్ధితిగా పరిగణించి తమ వాజ్యాన్ని అనుమతించాలని కోరుతున్నారు.

ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికలను కాలాతీతం అయ్యాయన్న కారణంతో తిరిగి నోటిఫికేషన్‌ ఇచ్చి మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఇస్తే అప్పుడు పరిషత్‌ ఎన్నికలకూ దీన్నే వర్తింపచేయాల్సిన పరిస్ధితి రావొచ్చు. కాబట్టి మున్సిపల్‌ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చే తీర్పు కీలకంగా మారింది. ఇప్పటికే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఆగిన చోట నుంచి నిర్వహిచేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా జనసేన నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ సోమవారం విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఒకవేళ మున్సిపల్‌ ఎన్నికలను మొదటి నుంచి నిర్వహించాలని ఆదేశాలు ఇస్తే వాటి ప్రభావంతో పరిషత్‌ పోరు కూడా మళ్లీ మొదటికొస్తుంది.

Latest News