ఆంధ్రప్రదేశ్న్యూస్ప్రాంతీయంరాష్ట్రీయంవిశాఖపట్నంసంపాదకీయంసేవాఫదం

జర్నలిస్ట్ గా 27 ఏళ్ల అనుభవం… ఎప్పుడు ప్రెస్ అక్రిడిటేషన్ కు నోచుకోని వైనం.

నాలాంటి అభాగ్యులు మరెందరో…

నేమాల హేమసుందరరావు అను నేను సామాజిక సేవా దృక్పథంతో 1996లో విశాఖ సమాచారం దినపత్రికలో గాజువాక పారిశ్రామిక ప్రాంతం పెదగంట్యాడ మండల రిపోర్టర్ గా పత్రికా రంగంలో అడుగుపెట్టాను.1998 వరకు గాజువాకలో ఈనాడు,ఆంధ్రజ్యోతి పత్రికల్లో రిపోర్టర్ గా..,ఆ తర్వాత 1999లో వార్త విశాఖ కలెక్టరేట్ రిపోర్టర్ గా పనిచేశాను.2002లో ఆంధ్రభూమి విశాఖ వన్ టౌన్ రిపోర్టర్ గా చేరాను. 2005లో వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ప్రెస్ క్లబ్ పాలక వర్గo ఎన్నికల్లో కార్యవర్గ సభ్యునిగా నన్ను సభ్యులంతా కలిసి ఎన్నుకున్నారు.మూడు సంవత్సరాల పాటు వీజేఎఫ్ ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యునిగా సాటి జర్నలిస్టుల సంక్షేమానికి నా వంతు కృషి చేశాను. 2007లో శ్రీదేవి మాస్టర్ మీడియా సిస్టమ్స్ ఎస్ డి వి ఛానల్ లో స్టాఫ్ రిపోర్టర్ గా చేరి 2013 వరకు పని చేశాను. మధ్యలో అంటే 2009లో విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధినిగా పోటీ చేసి విజయం సాధించిన దగ్గుబాటి పురందేశ్వరి వద్ద ప్రెస్ రిలేషన్ ఆఫీసర్ (పీఆర్వో) గా ఎన్నికల ప్రచార సమయం వరకు పనిచేశాను. నాకు ఆ సదావకాశాన్ని మీడియో విజన్ పాత్రుడు గారి ద్వారా, మిలీనియం సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ అధినేత గాదె శ్రీధర్ రెడ్డి గారు కల్పించారు. 2014లో ఏసీటి ఛానెల్ నందు న్యూస్ రిపోర్టర్ గా చేరి 2020 జనవరి వరకు పనిచేశాను.ఇన్ని పత్రికలు, మీడియాలు మారాను అంటే మీకు సందేహం రావచ్చు. నేను పని చేసిన చోట ఎక్కడా కూడా యాజమాన్యం నన్ను విధుల నుంచి తొలగించలేదు.నేనే అక్కడి విధానాలు నచ్చక కొంతమందితో రాజీ పడి మనసు చంపుకొని పనిచేయలేక స్వచ్ఛందంగా విధుల నుంచి తప్పుకున్నాను. ఈ సమాజానికి నా వంతు సేవ చేయాలనే సదుద్దేశంతో జర్నలిజం రంగంలో అడుగుపెట్టి సాధ్యమైనంత వరకు నిబద్ధతతో పనిచేశాను. పాత్రికేయునిగా ఈ 27 ఏళ్ల అనుభవంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో అనేక స్థానిక పత్రికల స్థాపనకు సహకారాన్ని అందించి ఎంతోమందిని ఈ రంగానికి పరిచయం చేసి గురువు స్థానాన్ని పొందగలిగాను. జర్నలిజంలో ఈ 27 ఏళ్ల కాలంలో అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు, కళా సాంస్కృతిక రంగ సంస్థలు వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరం ప్రెస్ క్లబ్ తో పాటు, నేను పని చేసిన మీడియా సంస్థలచే ఉత్తమ జర్నలిస్ట్ అవార్డులు, ప్రశంసా పత్రాలు, సత్కారాలను అందుకున్నాను.జర్నలిస్టుగా సరైన ఆదాయం లేక, తప్పుడు మార్గంలో వెళ్ల లేక..,అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఈ రంగంలో నేటికీ కొనసాగుతున్నాను.నాకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆర్దిక పరిస్థితుల వలన పిల్లలకు సరైన విద్యను అందించ లేకపోయాను.తల్లిదండ్రులను కూడా నిర్లక్ష్యం చేశాను.నా తండ్రి తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు సరైన వైద్యం అందించలేక అతనిని పోగొట్టుకున్నాను.ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కష్టనష్టాలను భరిస్తూ జర్నలిజం రంగంలో కొనసాగుతూ 2020 డిసెంబర్ వరకు ప్రెస్ అక్రిడిటేషన్ కలిగి ఉన్న నాకు విశాఖ జిల్లా సమాచార శాఖ అధికారులు 2021-23కు గాను ప్రెస్ అక్రిడిటేషన్ ఇవ్వలేకపోయారు.నాకే కాదు నా లాంటి సీనియర్ జర్నలిస్ట్ లు మరికొంత మందికి కూడా చిన్న చిన్న కారణాలు చూపి అక్రిడిటేషన్స్ నిలిపివేశారు. అక్రిడిటేషన్ పొంద లేని వారిలో సీనియర్ జర్నలిస్టులు ఉన్నప్పటికీ ప్రెస్ అక్రిడిటేషన్ లేని వారంతా నకిలీ జర్నలిస్ట్ లుగా చూస్తూ సమాజంలో దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ప్రెస్ అక్రిడిటేషన్ లేని వారంతా నకిలీ జర్నలిస్టు లేనా? అవునా కాదా? జర్నలిస్ట్స్ సంఘాల ప్రతినిధులు సమాచార శాఖ అధికారులు స్పష్టం చేయాలి.